ETV Bharat / sports

'ఆ క్యాచ్ పట్టుంటే పరిస్థితి వేరేలా ఉండేది'

author img

By

Published : Nov 12, 2021, 11:15 AM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్​లో ఓటమిపాలైంది పాకిస్థాన్. ఈ మ్యాచ్​లో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్​ను మిస్ చేశాడు హసన్ అలీ. దీంతో ఇతడిపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.

Babar Azam
బాబర్

టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ ఓటమి పాలైంది. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన మాథ్యూ వేడ్ (41)‌.. ఇచ్చిన క్యాచ్‌ను హసన్‌ అలీ వదిలేశాడు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వేడ్‌.. తర్వాత వరుసగా మూడు సిక్సులు బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ ఓటమిపై పాక్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్ స్పందించాడు. హసన్ అలీ శాయశక్తులా ప్రయత్నించాడని దురదృష్టవశాత్తు క్యాచ్‌ను అందుకోలేకపోయాడని పేర్కొన్నాడు. ఈ ఓటమికి అతనొక్కడినే కారణంగా చూపలేమని చెప్పాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలవడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు.

"ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ హసన్ అలీ క్యాచ్ మిస్ చేయడమే. అతడు కనుక ఆ క్యాచ్ పట్టుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ మా జట్టులో హసన్‌ అలీ ప్రధాన బౌలర్‌. అతడు జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశాత్తు అందుకోలేకపోయాడు. ప్రతి మ్యాచ్‌లో రాణించడం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని సార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మేమంతా అతడికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోం" అని బాబర్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన హసన్ అలీ కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

ఇవీ చూడండి: ఐసీయూ నుంచి వచ్చి హాఫ్ సెంచరీ.. రిజ్వాన్​పై ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.