ETV Bharat / sports

'రెజ్లింగ్ సమాఖ్య చీఫ్​పై కేసు!'.. అయినా నిరసన ఆపబోమన్న మల్లయోధులు

author img

By

Published : Apr 28, 2023, 7:15 PM IST

wrestlers protest
wrestlers protest

WFI చీఫ్​, ఎంపీ బ్రిజ్ భూషణ్​ శరణ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తామని దిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున సుప్రీంకు హాజరైన సొలిసిటర్ జనరల్​ తుషార్ మోహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనానికి చెప్పారు.

WFI చీఫ్​, ఎంపీ బ్రిజ్ భూషణ్​ శరణ్​ను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్న స్టార్ రెజ్లర్లకు ఊరట లభించింది. ఆయనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తామని దిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున సుప్రీంకు హాజరైన సొలిసిటర్ జనరల్​ తుషార్ మోహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనానికి ఈ విషయాన్ని చెప్పారు.

రెజ్లర్ల తరఫున వాదించిన సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​.. ఆరోపణలు చేసిన వారిలో ఉన్న మైనర్​కు రక్షణ కల్పించాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం.. మైనర్​కు భద్రత కల్పించాలని దిల్లీ పోలీస్​ కమిషనర్​ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 5 కు వాయిదా వేస్తూ.. పోలీసులు తీసుకున్న చర్యలపై అఫిడవిట్​ దాఖలు చేయాలని తెలిపింది. మిగిలిన వారికి కూడా రక్షణ కల్పించాలని సిబల్​ కోరగా.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతకుముందు మంగళవారం ఏడుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం.. తీవ్రమైన అంశంగా పేర్కొంటూ దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

'విజయానికి తొలిమెట్టు'
ఎఫ్​ఐఆర్​ నమోదుపై స్పందించిన రెజర్లు దీనిని విజయానికి తొలిమెట్టుగా అభివర్ణించారు. కేవలం ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడానికే ఆరు రోజులు పట్టిందని రెజ్లర్లు విమర్శించారు. ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించాలని.. లేకపోతే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు. అప్పటివరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రముఖ క్రీడాకారులు మద్దతు
మరోవైపు రెజ్లర్లకు ప్రముఖ క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మల్లయోధులు.. నేడు వీధుల్లో ఆందోళన చేయడంపై ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అభివన్‌ బింద్రా ఆవేదన వ్యక్తం చేశాడు. రెజ్లర్లకు ట్విట్టర్‌ వేదికగా మద్దతు తెలిపిన అభినవ్‌ బింద్రా.. బాధితులకు న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. క్రీడాకారులకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ముందుకు నడవాలని సూచించాడు. రెజ్లర్లకు మద్దతు తెలిపిన ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా.. మల్లయోధులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు. తమ అథ్లెట్లు న్యాయం కోరుతూ వీధుల్లో ఆందోళన చేయడం తనకు బాధ కలిగించిందని నీరజ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. పలువురు క్రీడాకారులు కూడా అథ్లెట్లకు మద్దతు తెలిపారు.

కమిటీలో ఎక్కువ మంది మహిళలే : అనురాగ్ ఠాకూర్
మహిళా రెజ్లర్లు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలు చెప్పుకునేందుకు కమిటీలో ఎక్కువ మంది మహిళలను నియమించినట్లు కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను పరిశీలించడానికి అడ్‌హాక్‌ కమిటీ ఏర్పాటుకు భారత ఒలంపిక్ సంఘాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గతంలో తాను రెజ్లర్లను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు ఠాకూర్ పేర్కొన్నారు. అనంతరం రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే.. రెజ్లర్లతో 12 గంటలపాటు చర్చించినట్లు ఠాకూర్‌ పేర్కొనడాన్ని ఒలింపిక్ పతక విజేత బజ్‌రంగ్ పూనియా తప్పుబట్టారు. కొన్ని నిమిషాలు మాత్రమే అనురాగ్‌ ఠాకూర్‌ తమతో చర్చించినట్లు పూనియా అన్నారు.

ఇవీ చదవండి :'రెజ్లర్ల నిరసన బాధాకరం.. వారి గౌరవం కాపాడే బాధ్యత మనపైనే'.. నీరజ్ చోప్రా ట్వీట్

IPL 2023: బ్యాటర్ల వీరబాదుడు.. 18 సార్లు 200+ స్కోర్లు.. ఆ 4 పిచ్​లలోనే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.