ఇంకొక్క అడుగు వేస్తే.. స్వర్ణం మనదే

author img

By

Published : May 14, 2022, 6:40 AM IST

Thomas Uber cup 2022 final india mens team

Thomas Uber cup 2022 final india mens team: ప్రతిష్టాత్మక థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ చరిత్రలో భారత్‌ సరికొత్త అధ్యాయం లఖించింది. థామస్‌ కప్‌లో 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకం ఖాయం చేసిన భారత పురుషుల జట్టు మరింత మెరుగైన ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. అద్వితీయ ఆటతో అదరగొట్టిన భారత్‌ పసిడి కోసం ఆదివారం ఇండోనేసియాను ఢీకొననుంది.

Thomas Uber cup 2022 final india mens team: థామస్‌ కప్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. క్వార్టర్‌ఫైనల్లో మలేసియాను కంగుతినిపించిన భారత్‌.. సెమీస్‌లో పటిష్టమైన డెన్మార్క్‌ను చిత్తుచేసింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో భారత్‌ 3-2తో డెన్మార్క్‌పై విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌కు చుక్కెదురైనా.. తర్వాతి పోరాటాల్లో కిదాంబి శ్రీకాంత్‌ బృందం అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 13-21, 13-21తో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. అయితే డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ 21-18, 21-23, 22-20తో కిమ్‌ ఆస్ట్రప్‌- మథియస్‌ క్రిస్టియన్సెన్‌ జంటపై గెలుపొంది 1-1తో స్కోరును సమం చేసింది. ఒక గంటా 18 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ జోడీ గొప్పగా పోరాడింది.

అనంతరం శ్రీకాంత్‌ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-18, 12-21, 21-15తో ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ను చిత్తుచేశాడు. ఒక గంటా 20 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్లు మ్యాచ్‌ సాగింది. స్మాష్‌లతో విరుచుకుపడిన శ్రీకాంత్‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించి భారత్‌ 2-1తో ఆధిక్యాన్ని అందించాడు. కాని రెండో డబుల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కృష్ణప్రసాద్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ జోడీ 14-21, 13-21తో ఆండర్స్‌ రస్‌ముసెన్‌- ఫ్రెడరిక్‌ సోగార్డ్‌ జంట చేతిలో ఓడటంతో 2-2తో స్కోరు సమమైంది. నిర్ణయాత్మక మూడో సింగిల్స్‌ ఆసక్తికరంగా మొదలైన తర్వాత ఏకపక్షంగా ముగిసింది. మంచి ఫామ్‌లో ఉన్న ప్రణయ్‌ 13-21, 21-9, 21-12తో రస్‌ముస్‌ గెమ్కీని చిత్తుచేసి 3-2తో భారత్‌కు విజయాన్ని అందించాడు. తొలి గేమ్‌లో తేలిపోయిన ప్రణయ్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. రెండో గేమ్‌లో 11-1తో ఆధిపత్యం ప్రదర్శించిన అతడు 21-9తో గేమ్‌ను ముగించాడు. మూడో గేమ్‌లోనూ జోరు కొనసాగించాడు. మరో సెమీస్‌లో ఇండోనేషియా 3-2తో జపాన్‌ను ఓడించింది. భారత్‌, ఇండోనేషియా మధ్య థామస్‌ కప్‌ ఫైనల్‌ ఆదివారం జరగనుంది. ఉబెర్‌ కప్‌లో స్వర్ణం కోసం శనివారం చైనా, దక్షిణ కొరియా తలపడనున్నాయి.

ఇదీ చూడండి: థామస్​ కప్​లో భారత్ సంచలనం.. 43 ఏళ్ల తర్వాత సెమీస్​కు.. పతకం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.