ETV Bharat / sports

ఆ ఒలింపిక్స్​లో తెలుగోడి సత్తా... స్వర్ణం గెలిచిన షూటర్

author img

By

Published : May 5, 2022, 11:47 AM IST

Telangana shooter Gold medal: బధిరుల కోసం నిర్వహించే ఒలింపిక్స్​లో తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించాడు. బ్రెజిల్​లో జరుగుతున్న ఈ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. మరోవైపు, ధనుష్ పోటీ పడిన విభాగంలోనే భారత్.. కాంస్య పతకాన్ని సైతం కైవసం చేసుకుంది.

telangana shooter dhanush srikanth gold
telangana shooter dhanush srikanth gold

Telangana shooter Deaflympics Gold: బధిర ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్​)లో భారత షూటర్లు సత్తా చాటారు. ఒకే విభాగంలో రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ రౌండ్​లో.. షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం సాధించాడు. మరో షూటర్ శౌర్య సైనీ ఇదే విభాగంలో కాంస్యం గెలుచుకున్నాడు. ధనుష్ 247.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కిమ్ వూ రిమ్ 246.6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. శౌర్య సైనీ 224.3 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకొని కాంస్యం పట్టేశాడు.

ధనుష్ శ్రీకాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం విశేషం. హైదరాబాద్​లోని గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. నారంగ్ ట్రైనింగ్​లో రాటుదేలిన ధనుష్.. తాజా ఒలింపిక్స్​లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. క్వాలిఫికేషన్ రౌండ్​లో ధనుష్ రెండో స్థానంలో నిలవగా.. ప్రధాన రౌండ్​లో మరింత రెచ్చిపోయి పసిడిని ముద్దాడాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోచ్​లు అనుజ జంగ్, ప్రీతి శర్మ సైతం ధనుష్, శౌర్యకు శిక్షణ ఇచ్చారు.

India at Deaflympics: మరోవైపు, భారత బ్యాట్మింటన్ టీమ్ సైతం ఈ క్రీడల్లో బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. డబుల్స్​లో జపాన్​ను 3-1 తేడాతో ఓడించి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించింది. రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పతకాల పట్టికలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. 19 స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్యాలతో ఉక్రెయిన్ టాప్ ప్లేస్​లో ఉంది. బ్రెజిల్​లో జరుగుతున్న ఈ డెఫ్లింపిక్స్​లో పాల్గొనేందుకు 65 మందితో కూడిన బృందాన్ని భారత్ పంపించింది. ఇందులో 10 మంది షూటర్లు ఉన్నారు. 11 విభాగాల్లో భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. డెఫ్లింపిక్స్​లో భారత్ పంపిన అతిపెద్ద, ఎక్కువ మంది యువకులతో కూడిన బృందం ఇదే కావడం విశేషం.

ఇదీ చదవండి: వేరే టీమ్​కు విరాట్ కోహ్లీ! వేలంలోకి రమ్మంటే ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.