ETV Bharat / sports

నాలుగోసారి ఆసియాకప్ ఛాంపియన్​గా భారత్.. ఫైనల్​లో పాక్ చిత్తు

author img

By

Published : Jun 2, 2023, 7:21 AM IST

Updated : Jun 2, 2023, 8:47 AM IST

asia cup junior hockey 2023
asia cup junior hockey 2023

ఆసియాకప్‌ హాకీ జూనియర్స్‌ విభాగంలో భారత్‌ ఫైనల్​లో తన సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థైన పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీని గెలుపొందిన జట్టుగా రికార్డు సృష్టించింది.

Mens Asia Cup Junior Hockey 2023 : జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు తన జోరును కొనసాగిస్తోంది. టైటిల్‌ను నిలబెట్టుకుంటూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి మైదానంలో అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థైన పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీని గెలుపొందిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతో మూడు టైటిళ్లను గెలుచుకున్న పాక్‌ రెండో స్థానానికి పరిమితమైంది. గురువారం జరిగిన ఫైనల్లో భారత్‌ 2-1 తేడాతో పాక్‌పై ఘన విజయాన్ని సాధించింది. అంగద్‌ వీర్‌ సింగ్‌ (13వ నిమిషంలో), అరిజీత్‌ సింగ్‌ (20వ) చెరో గోల్‌తో తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ప్రత్యర్థి తరపున అలీ బషారత్‌ (38వ) గోల్‌ కొట్టాడు. ఈ టోర్నీలో అజేయంగా సాగిన భారత్‌.. తుదిపోరులోనూ అదే జోరును కొనసాగించింది. పూల్‌ దశలో పాక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న ఇండియా కుర్రాళ్లు.. ఆఖరి సమరంలో మాత్రం విజృంభించారు. కాగా 2004, 2008, 2015లో ఇండియా విన్నర్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2-1 స్కోర్​తో మలేసియాపై గెలిచింది

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టు.. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ సాధించినప్పటికీ.. దాని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. ఆరో నిమిషంలో దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను పాక్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత దాడులను భారత్‌ మరింత ఉద్ధృతం చేసింది. ఎట్టకేలకు అంగద్‌ గోల్‌తో మన జట్టు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్‌లో భారత్‌ మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఈ సారి అరిజీత్‌ ఫీల్డ్‌గోల్‌తో భారత్​ ఆధిక్యం రెట్టింపైంది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని దాటుకుని అతను బంతిని గోల్‌పోస్టు లోపలికి పంపించాడు.

దీంతో అక్కడి నుంచి భారత్‌ను అందుకునేందుకు పాక్‌ కాస్త వేగం పెంచింది. అబ్దుల్‌ నుంచి పాస్‌ అందుకున్న అలీ.. బంతిని లోపలికి పంపించడంతో పాక్‌ ఖాతా తెరిచింది. ఇక చివరి క్వార్టర్‌లో మ్యాచ్​ మరోస్థాయికి చేరింది. స్కోరు సమం చేసేందుకు పాక్‌.. ఆధిక్యాన్ని పెంచుకునేందుకు భారత్‌ ఇలా రెండు జట్టు పోటాపోటీగా తలపడ్డాయి. ఆఖరిలో పాక్‌ పెనాల్టీ కార్నర్లను మన రక్షణ శ్రేణి గొప్పగా ఆపగలిగింది. అలా చివరి వరకూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత జట్టు తుది పోరులో విజేతగా నిలిచింది.

మరోవైపు ఆసియా కప్‌ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్థాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. తాజా జరిగిన టోర్నీలో భారత్‌ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్‌ 50 గోల్స్‌ సాధించగా... కేవలం నాలుగు గోల్స్‌ మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.

Last Updated :Jun 2, 2023, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.