ETV Bharat / sports

బ్యాడ్మింటన్​ స్టార్​ 'సైనా' కెరీర్​.. ఇక ముగిసినట్టేనా?

author img

By

Published : Apr 16, 2022, 7:35 AM IST

Saina Nehwal: ఒలింపిక్‌ కాంస్యం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్‌ సిరీస్‌ టోర్నీలలో లెక్కలేనన్ని విజయాలు.. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. ఇక, త్వరలో జరగబోయే కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలన్న సైనా నిర్ణయం టీమ్‌ ఈవెంట్లలో ఆమె కెరీర్‌ ముగింపు దశకు చేర్చిందా? అని క్రీడా నిపుణులు చర్చించుకుంటున్నారు.

Saina Nehwal:
Saina Nehwal

Saina Nehwal: కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలన్న భారత అగ్రశ్రేణి షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిర్ణయం టీమ్‌ ఈవెంట్లలో ఆమె కెరీర్‌ ముగింపు దశకు చేర్చిందా? అన్న చర్చకు తెరతీసింది. ఒకటిన్నర దశాబ్దం పాటు భారత బ్యాడ్మింటన్‌కు దిక్సూచిలా నిలిచిన మాజీ నంబర్‌వన్‌ సైనా.. కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు సార్లు (2006, 2010, 2018) దేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతర్జాతీయ సర్క్యూట్‌లో సైనా మళ్లీ సత్తాచాటే అవకాశం ఉన్నా.. సెలెక్షన్‌ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలన్న ఆమె నిర్ణయంతో కామన్వెల్త్‌, ఆసియా, ఒలింపిక్స్‌, ఉబర్‌ కప్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కష్టంగా మారనుంది. తప్పుడు నిర్ణయమో లేదా సమాచార లోపమో గాని బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో సైనాకు టైటిల్‌ నిలబెట్టుకునే అవకాశాలు సన్నగిల్లాయి. తన ఈ-మెయిల్‌కు జవాబు ఇవ్వనందుకు, సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహణ వెనకున్న ఉద్దేశాన్ని సామాజిక మాధ్యమం వేదికగా గురువారం సైనా ప్రశ్నించింది. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) మాత్రం ఆమె వ్యాఖ్యలపై స్పందించలేదు. ఇప్పటికీ మౌనం కొనసాగిస్తోంది.

మహిళల సింగిల్స్‌లో సంధి దశ మొదలైందని.. యువ క్రీడాకారిణులపై దృష్టిసారించాల్సిన అవసరముందని బాయ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వాళ్లు సత్తాచాటేందుకు అవకాశాలు కల్పించాలని అనుకుంటోంది. "దేశానికి సైనా ఎన్నో ఘనతలు అందించింది. అయితే గత రెండేళ్లలో ఆమె నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. గాయాల సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు. తరచూ గాయాలతో అంతర్జాతీయ స్థాయిలో ఆడటం చాలా కష్టం. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలే గాని ఆగ్రహం తెచ్చుకోకూడదు. బ్యాడ్మింటన్‌కు సైనా అందించిన సేవల్ని ఎవరూ కాదనలేరు. అయితే ఆమె అలా కఠినంగా మాట్లాడటం సరికాదు" అని మాజీ కోచ్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌, థామస్‌ అండ్‌ ఉబర్‌ కప్‌లకు సెలెక్షన్‌ ట్రయల్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా కొత్త తరానికి అవకాశం కల్పించినట్లయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 15 స్థానాల్లో ఉన్న క్రీడాకారులకు ట్రయల్స్‌ నుంచి బాయ్‌ మినహాయింపు ఇచ్చింది. టోక్యో ఒలింపియన్‌ సాయి ప్రణీత్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు సార్లు మెడలిస్ట్‌ అశ్విని పొన్నప్ప సహా 16 నుంచి 50వ ర్యాంకు క్రీడాకారులు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. ఐరోపాలో వరుసగా మూడు టోర్నీల్లో బరిలో దిగిన 23వ ర్యాంకర్‌ సైనా మాత్రం దేహంపై అదనపు భారం పడుకుండా ఉండటానికి ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈనెల 26న ఆసియా ఛాంపియన్‌షిప్‌ కూడా ప్రారంభంకానుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో లేని సైనా ఇటీవలి టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగింది. దీంతో సైనాకు ట్రయల్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వకూడదని బాయ్‌ నిర్ణయించింది. టీమ్‌ ఈవెంట్లలో భారత జట్టుకు ఎంపికవ్వాలంటే ట్రయల్స్‌లో పాల్గొనాలని స్పష్టంచేసింది. మాళవిక బాన్సోద్‌, ఆకర్షి కశ్యప్‌, తస్నిమ్‌ మీర్‌ వంటి యువ క్రీడాకారిణుల్ని సిద్ధం చేయాలని బాయ్‌ భావిస్తోంది. బాయ్‌ తాజా నిర్ణయంతో టీమ్‌ ఈవెంట్లలో సైనా కథ ముగిసినట్లేనన్న వాదన వినిపిస్తోంది!

ఇవీ చదవండి: ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ సంచలన నిర్ణయం

'అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.