ETV Bharat / sports

అత్యున్నత క్రీడా పురస్కారానికి పంచ 'ఖేల్‌'రత్నాలు

author img

By

Published : Aug 19, 2020, 8:02 AM IST

Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
అత్యున్నత క్రీడా పురస్కారానికి పంచ 'ఖేల్‌'రత్నాలు

క్రీడాకారుల పంట పండింది. ఊహించని విధంగా అత్యధిక మందికి ఈసారి అవార్డులు సొంతం కానున్నాయి. అసాధారణ రీతిలో ఐదుగురు ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ముకుందకం శర్మ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల కమిటీ.. రోహిత్‌శర్మ (క్రికెట్‌), వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లింగ్‌), రాణి రాంపాల్‌ (హాకీ), మనిక బాత్రా (టీటీ), మరియప్పన్‌ తంగవేలు (పారాలింపిక్స్‌) పేర్లను ప్రతిపాదించింది. మిగతా అవార్డులకు ఎక్కువ మంది పేర్లను సిఫార్సు చేసింది.

ఖేల్‌రత్న కోసం సాధారణంగా ఏడాదికి ఒకరిని లేదా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత ముగ్గురికి, 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత అత్యధికంగా నలుగురికి ఖేల్‌రత్న దక్కింది. ఈసారి కమిటీ ఐదుగురు పేర్లను క్రీడల శాఖకు సిఫారసు చేయడం విశేషం.

  • స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మ, రెజ్లింగ్‌ ఛాంప్‌ వినేశ్‌ ఫొగాట్‌, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, టీటీ కెరటం మనిక బాత్రా, రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో పసిడి గెలిచిన మరియప్పన్‌ తంగవేలు క్రీడల శాఖకు అందజేసిన జాబితాలో ఉన్నారు.
  • స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌తో పాటు.. ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా, పరుగులో ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌ హిమదాస్‌కు నిరాశ తప్పలేదు.
  • మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌సింగ్‌, మాజీ పారా అథ్లెట్‌ దీపా మలిక్‌ తదితరులు కమిటీలో సభ్యులు. అర్జున అవార్డు కోసం 29 మంది క్రీడాకారులతో కమిటీ జాబితాను సిద్ధం చేసింది.

ద్రోణాచార్యను 13 మందికి, ధ్యాన్‌చంద్‌ అవార్డును 15 మందికి ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం లభించాక ఆగస్టు 29న (జాతీయ క్రీడల దినోత్సవం) జరిగే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి అవార్డుల కార్యక్రమం వర్చువల్‌గా జరగనుందని సమాచారం.

రోహిత్‌ నం.4:

ఒక క్రికెటర్‌ ఖేల్‌రత్న గెలుచుకోవడం ఇది నాలుగోసారి మాత్రమే. అతనికన్నా ముందు సచిన్‌ తెందుల్కర్‌ (1998), మహేంద్రసింగ్‌ ధోనీ (2007), విరాట్‌ కోహ్లీ (2018) ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత క్రికెట్లో కీలక ఆటగాడైన 33 ఏళ్ల రోహిత్‌ గతేడాది అసాధారణంగా రాణించాడు.

Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
రోహిత్​ శర్మ

2019 వన్డే ప్రపంచకప్‌లో 5 శతకాలు సహా 648 పరుగులు సాధించి సత్తా చాటాడు. అర్జున అవార్డు తుది జాబితాలో పేసర్‌ ఇషాంత్‌శర్మ కూడా చోటు సంపాదించాడు. 31 ఏళ్ల ఇషాంత్‌ ఇప్పటిదాకా 97 టెస్టులు, 80 వన్డేలు ఆడి 400పైన అంతర్జాతీయ వికెట్లు సాధించాడు.

సాత్విక్‌ శ్రమకు ఫలితం

గత కొన్నేళ్లుగా సత్తా చాటుతున్న యువ షట్లర్‌, తెలుగుతేజం సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టికు తాజాగా అర్జున అవార్డుతో బహుమానం లభించింది. గతేడాది థాయ్‌లాండ్‌ ఓపెన్‌ను గెలుచుకున్న ఈ ద్వయం ఒక సూపర్‌ సిరీస్‌ సాధించిన భారత తొలి పురుషుల డబుల్స్‌జోడీగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఫైనల్‌ చేరింది.

Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
సాత్విక్​

ఉషకు ధ్యాన్‌చంద్‌ అవార్డు:

విశాఖకు చెందిన మాజీ బాక్సర్‌ ఉష ధ్యాన్‌చంద్‌ అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె తూర్పు కోస్తా రైల్వే లోకోషెడ్‌లో విధులు నిర్వహిస్తోంది. తన కెరీర్‌లో ఉష ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జాతీయస్థాయి పోటీల్లో 12 పతకాలు సాధించింది. ప్రస్తుతం ఆమె భారత మహిళా బాక్సింగ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోంది.

వినేశ్‌కు ఎట్టకేలకు:

మరోవైపు 2016 రియో ఒలింపిక్స్‌లో గాయంతో బాధాకర రీతిలో నిష్క్రమించిన వినేశ్‌ ఫొగాట్‌కు శ్రమకు తగ్గ ఫలితం లభించింది. 2018 కామన్వెల్త్‌ క్రీడలు, 2019 ఆసియా క్రీడల్లో పసిడి పతకాలతో మెరిసిన ఈ రెజ్లర్‌.. 2019 ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కాంస్యం సాధించింది.

Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
వినేశ్​ ఫొగాట్​
Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
రాణి రాంపాల్​

మరోవైపు భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించడంలో రాణి రాంపాల్​ కీలకపాత్ర పోషించింది. ఆమె సారథ్యంలోనే 2017 ఆసియాకప్‌ అందుకున్న భారత్‌.. 2018 ఆసియా క్రీడల రజతాన్నీ సాధించింది.

టీటీ స్టార్‌ మనిక బాత్రా కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలవడమే కాదు.. ఆసియా క్రీడల్లో సింగిల్స్‌ కాంస్యం నెగ్గి సంచలనం సృష్టించింది. తంగవేలుది భిన్నమైన విజయగాథ. 2016 రియో పారాలింపిక్స్‌ హైజంప్​లో ఈ తమిళనాడు ఆటగాడు పసిడి గెలిచాడు.

Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
మనిక బాత్రా
Rohit Sharma, Vinesh Phogat, two others named for Khel Ratna
మరియప్పన్​

అవార్డుల జాబితా

రాజీవ్‌ ఖేల్‌రత్న: రోహిత్‌శర్మ (క్రికెట్‌), వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లింగ్‌), మనిక బాత్రా (టీటీ), రాణి రాంపాల్‌ (హాకీ), తంగవేలు మరియప్పన్‌ (పారాలింపిక్స్‌)

ఖేల్‌రత్న అవార్డీలకు పతకం, సర్టిఫికెట్‌తో పాటు రూ.7.5 లక్షలు బహుమతిగా లభిస్తాయి. అర్జున అవార్డు పొందినవాళ్లకు అర్జున జ్ఞాపికతో పాటు రూ.5 లక్షలు ఇస్తారు.

అర్జున అవార్డు

సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి (బ్యాడ్మింటన్‌), ఇషాంత్‌శర్మ (క్రికెట్‌), సాక్షి మలిక్‌ (రెజ్లింగ్‌), ద్యుతిచంద్‌ (అథ్లెటిక్స్‌), దివ్య కర్కాన్‌ (రెజ్లింగ్‌), అతానుదాస్‌ (ఆర్చరీ), దీపక్‌ హుడా (కబడ్డీ), దీపిక (హాకీ), దివిజ్‌శరణ్‌ (టెన్నిస్‌), మీరాబాయ్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌), ఆకాశ్‌దీప్‌ (హాకీ), లవ్లీనా (బాక్సింగ్‌), మనూ బకర్‌ (షూటింగ్‌), సౌరభ్‌ చౌదరి (షూటింగ్‌), మనీష్‌ (బాక్సింగ్‌), సందేశ్‌ (ఫుట్‌బాల్‌), దత్తు బొకానల్‌ (రోయింగ్‌), రాహుల్‌ అవారె (రెజ్లింగ్‌), దీప్తిశర్మ (క్రికెట్‌), శివ కేశవన్‌ (వింటర్‌ స్పోర్ట్స్‌), మధురిక (టీటీ), మనీష్‌ నర్వాల్‌ (పారా షూటర్‌), సందీప్‌ (పారా అథ్లెట్‌), సుయాంశ్‌ (పారా స్విమ్మర్‌), విశేష్‌ (బాస్కెట్‌బాల్‌), అజయ్‌ (టెంట్‌ పెగ్గింగ్‌), అదితి అశోక్‌ (గోల్ఫ్‌), సారిక (ఖోఖో).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.