ETV Bharat / sports

Neeraj Chopra: నీరజ్‌ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే?

author img

By

Published : Aug 9, 2021, 3:15 PM IST

neeraj chopra
నీరజ్​ చోప్డా

నీరజ్​ చోప్డా.. ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతున్న పేరు. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కలను నెరవేర్చాడు చోప్డా. అయితే నీరజ్​.. ఈ ఘనత సాధించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకుందామా..?

విశ్వక్రీడల వేదిక ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు నీరజ్‌ చోప్డా. టోక్యో ఒలింపిక్స్‌లో 23 ఏళ్ల నీరజ్‌ జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించినవేళ దేశవ్యాప్తంగా సంబరాలు అంబురాన్నంటాయి.

దేశవ్యాప్తంగా చర్చ..

రాష్ట్రపతి, ప్రధాని నుంచి మొదలుకొని సామాన్యుని వరకు అందరూ నీరజ్‌ చోప్డా గురించే చర్చించారు. 2012లో అండర్‌ 16 జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన నీరజ్‌.. 2015లో జాతీయ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పి ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపుకు తిప్పాడు నీరజ్‌. అయితే నీరజ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దాడడానికి తనలో ఎంత ప్రతిభ ఉందో, దానికి రెట్టించిన కష్టం కూడా ఉంది.

భారీగానే ఖర్చు..

నీరజ్‌ ప్రతిభ, కష్టాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్‌ కోసం భారీ వ్యయప్రయాసలకోర్చింది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్‌కు ముందు 450 రోజుల పాటు నీరజ్‌ చోప్డా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,85,39,638 ఖర్చు చేసింది.

నీరజ్​ కోచ్​కూ..

ఇక 2019లో నీరజ్‌ చోప్డాకు మోచేయి శస్త్ర చికిత్స తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్‌గా డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌ను నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1,22,24,880 చెల్లించింది. నీరజ్‌ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావెలిన్‌లకు రూ.4,35,000 ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందు 2021లో నీరజ్‌ యూరప్‌ టోర్నమెంట్లలో పాల్గొనడానికి 50 రోజుల పాటు స్వీడన్‌లో ఉన్నాడు. ఇందుకోసం ప్రభుత్వం రూ.19,22,533 ఖర్చు చేసింది.

వెన్నుదన్నుగా..

మెరుగైన క్రీడాకారుడిగా రాటుదేలేందుకు కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవటంతో అందుకు ప్రతిఫలంగా నీరజ్‌ దేశ మువ్వన్నెల జెండాను విశ్వక్రీడల్లో రెపరెపలాడించాడు. నీరజ్‌ చోప్డాకు ముందు అభినవ్‌ బింద్రా షూటింగ్‌ విభాగంలో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. ఈ క్రీడల్లో భారత్‌ 7 పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో భారత్‌ 48వ స్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి:

వందేళ్ల భారత నిరీక్షణకు తెర

ఎవరీ నీరజ్ చోప్డా? ఊబకాయుడి నుంచి ఒలింపిక్ ఛాంపియన్​గా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.