ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రాలో జకోవిచ్‌కు చోటు.. కానీ..

author img

By

Published : Jan 14, 2022, 7:20 AM IST

djokovic

Djokovic Australian Open: సెర్బియా టెన్నిస్​ స్టార్​ నొవాక్ జకోవిచ్​ వీసా రద్దు వ్యవహారం ఇంకా ముగియక ముందే.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డ్రాలో ఆడేందుకు జకోవిచ్‌కు చోటు దక్కింది. టోర్నీ డ్రాలో ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడికి టాప్‌ సీడ్‌ కట్టబెట్టారు. అయితే.. అతడిని అనుమతించడంపై స్పష్టత మాత్రం ఇంకా రాలేదు.

Djokovic Australian Open: ఈ నెల 17న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ ఆడతాడా? అందుకు ఆ దేశ ప్రభుత్వం అతనికి అనుమతినిస్తుందా? అన్న ప్రశ్నలకు ఇంకా జవాబు రాలేదు. కానీ నిర్వాహకులు మాత్రం టోర్నీ డ్రాలో ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడికి టాప్‌ సీడ్‌ కట్టబెట్టారు.

గురువారం ప్రకటించిన డ్రా ప్రకారం ఈ సెర్బియా ఆటగాడు.. తొలి రౌండ్లో తన దేశానికే చెందిన ప్రపంచ 78వ ర్యాంకర్‌ కెక్‌మనోవిచ్‌తో పోటీపడనున్నాడు. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం జకో విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ టోర్నీలో ఆడాలంటే తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలనే నిబంధన నుంచి అతను వైద్య మినహాయింపు పొందాడు. కానీ ఆ కారణం సహేతుకంగా లేదని సరిహద్దు భద్రతా దళం అతణ్ని విమానాశ్రయంలోనే అడ్డుకుని వీసా రద్దు చేసి ఓ హోటల్‌కు తరలించింది. దీనిపై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన జకో.. ఆ హోటల్‌ నుంచి బయటకు వచ్చి ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. కానీ వ్యక్తిగత అధికారంతో అతని వీసాను రద్దు చేసే విషయాన్ని ఇమ్మిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాక్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

తాజాగా విలేకర్లతో మాట్లాడిన ఆ దేశ ప్రధాని మోరిసన్‌.. "జకోవిచ్‌ వీసా విషయంలో వ్యక్తిగత రద్దును ఉపయోగించే అధికారం అలెక్స్‌కు ఉంది. దీనిపై ఈ సమయంలో ఇంకెలాంటి వ్యాఖ్యలు చేయను" అని పేర్కొన్నారు.

మరోవైపు గత నెల 16న తనకు కరోనా సోకిందని వైద్య మినహాయింపు కోరిన జకోవిచ్‌.. ఆ తర్వాత బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యాడని తేలడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఆస్ట్రేలియాకు రాకముందు రెండు వారాల వ్యవధిలో తన ప్రయాణ విషయాలపై తన సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చారని జకో పేర్కొన్నాడు.

జకోవిచ్‌ రెండు డోసుల టీకా వేసుకోలేదు కాబట్టి అతను ఆస్ట్రేలియా వదిలి వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ దేశ ఉప ప్రధాని బార్నబి జోస్‌ తెలిపారు.

యుకీ కూడా ఔట్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో భారత కథ ముగిసింది. సింగిల్స్‌ ప్రధాన డ్రాకు ఒక్క ప్లేయర్‌ కూడా అర్హత సాధించలేకపోయారు. బరిలో మిగిలిన యుకీ బాంబ్రి క్వాలిఫయర్‌ రెండో రౌండ్లో బాంబ్రి 1-6, 3-6 తేడాతో టోమస్‌ మచాక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడాడు. ఇప్పటికే రామ్‌కుమార్‌, ప్రజ్ఞేశ్‌, అంకిత రైనా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: కొవిడ్‌ సోకినా విచ్చలవిడిగా తిరిగిన జకోవిచ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.