ETV Bharat / sports

మళ్లీ నిరసనకు దిగిన రెజ్లర్లు..ఆయన్ను అరెస్ట్​ చేసేంతవరకు కదలమంటూ..

author img

By

Published : Apr 23, 2023, 6:15 PM IST

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్లు మరోసారి రోడ్డెక్కారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ ముందు ఆందోళన చేపట్టారు.

Etv Bharat
Etv Bharat

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్​పై భారత రెజ్లర్లు మరోసారి ధ్వజమెత్తారు. మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ వినేష్ ఫోగత్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లాంటి రెజర్లు.. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నిరసన ప్రదర్శనకు కూర్చున్నారు. గత జనవరిలో కూడా వీరంతా ఇదే చోట కొన్ని రోజులపాటు ధర్నా చేశారు.

ఇటీవలే కొంతమంది మహిళా రెజ్లర్లు తమను బ్రిజ్​భూషణ్​ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ దిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్​లో ఆయనపై ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు ఆధారంగా ఎఫ్​ఐఆర్​ ఇంకా దాఖలు చేయలేదని రెజ్లర్లు పేర్కొన్నారు.

ఈ విషయం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రెజ్లర్ సాక్షి మాలిక్.. జంతర్​ మంతర్​ వేదికగా తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ ప్యానెల్ నివేదికను ఇంకా బహిరంగపరచకపోవడం తమను నిరాశకు గురిచేస్తోందని అన్నారు."మహిళా రెజ్లర్లు ఇచ్చిన రికార్డెడ్​ స్టేట్‌మెంట్‌ నివేదికను పబ్లిక్‌గా ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ఇది సున్నితమైన సమస్య, కంప్లైంట్​ ఇచ్చినవారిలో ఒకరు మైనర్ బాలిక" అని ఆమె అన్నారు. అంతే కాకుండా ఫిర్యాదుదారుల పేర్లను లీక్ చేయకూడదని కోరారు.

బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని బజరంగ్ పునియా అన్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఆరోపణలు చేసి 3 నెలలకుపైనే గడిచినా ఇంత వరకు న్యాయం జరగలేదని.. ఎంత ప్రయత్నించినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అన్నారు. "మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే పడుకుని భోజనం చేస్తాం. మూడు నెలలుగా సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము దేశం కోసం పతకాలు సాధించాము. దీని కోసం మా కెరీర్‌ను పణంగా పెట్టాము" అని వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.

దిల్లీ పోలీసులకు మహిళా కమీషన్​ నోటీసులు..
నిందితునిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయకపోవడాన్ని తప్పు పడుతూ దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌.. స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేశారు. మహిళా రెజ్లర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్న ఆమె.. ఈ విషయంపై పోలీసులు వివరణ ఇవ్వాలని కోరారు.

అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు విషయాన్ని తెలుసుకునేందుకు ఏప్రిల్ 22న.. ఓ బాధితురాలు ఎస్‌హెచ్‌ఓకు ఫోన్ చేయగా.. సోమవారం తర్వాతనే ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామంటూ ఎస్​హెచ్​ఓ తెలిపిందని అన్నారు. అయితే సోమవారం కూడా ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారన్న గ్యారెంటీ లేదని ఎస్‌హెచ్‌ఓ తెలిపిందని కమీషన్​ పేర్కొంది.

dcw notice to police
దిల్లీ పోలీసులకు మహిళా కమీషన్​ నోటీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.