ETV Bharat / sports

రొనాల్డో భారీ ఆఫర్.. మాస్టర్​ చెఫ్​ కావాలంట.. నెలకు రూ.4.5 లక్షల జీతం!

author img

By

Published : Jan 21, 2023, 2:27 PM IST

Cristiano Ronaldo Master chef
'మాస్టర్​ చెఫ్​ కావాలి'.. రొనాల్డో భారీ ఆఫర్​.. నెలకు రూ.4.5 లక్షల జీతం

ఫుట్​బాల్​ దిగ్గజం, పోర్చుగల్​ స్టార్ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో భారీ ఆఫర్ ప్రకటించాడు. తనకు, కుటుంబ సభ్యులకు రుచికరంగా వంట చేసిపెట్టే చెఫ్ కావాలని, అందుకోసం నెలకు రూ.4.5లక్షలు జీతం ఇస్తానని చెప్పాడు.

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఓ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల పేరు చెప్పమంటే.. అందులో కచ్చితంగా ఉండే పారు క్రిస్టియానో రొనాల్డో. ఎందుకంటే అతడు మైదానంలో తన విన్యాసాలతో క్రీడా ప్రేమికులను తెగ ఉర్రూతలూగిస్తుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. అలా ఇప్పటికే ఆటపరంగానూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రొనాల్డోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది స్టార్ ప్లేయర్స్​ సైతం అతడికి వీరాభిమానులు. అయితే ఇప్పుడతడికి ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది. దీంతో అతడు తీవ్ర నిరాశలో ఉన్నాడట. అయితే అది ఆటకు సంబంధించింది కాదు. తనకు, కుటుంబ సభ్యులకు రుచికరంగా వంట చేసిపెట్టే చెఫ్ దొరకడం లేదంట.

విషయానికొస్తే.. రొనాల్డో తన కుటుంబంతో కలిసి పోర్చుగల్‌కు షిఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నాడట. ఇప్పటికే అక్కడ దాదాపు రూ.170కోట్ల విలువైన ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించే పనిలో పడ్డాడట. సెప్టెంబర్ 2021లో ఇంటి కోసం భూమిని కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. జూన్​ 2023 నాటికి ఆ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో భార్య, పిల్లలతో రొనాల్డో ఆ ఇంటికి షిఫ్ట్‌ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో ప్రకటించాడు. నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తో పాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే మాస్టర్‌ చెఫ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అతడికి నెలకు రూ.4.5 లక్షలు జీతం ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదట. దీంతో అతడు నిరాశ చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే రొనాల్డో గతేడాది ఖతర్‌ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్‌ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో రొనాల్డో తన ప్రపంచకప్​ కలను ఈ సారి కూడా నెరవేర్చుకోలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో పోర్చుగల్ జట్టు.. క్వార్టర్స్‌లో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఆ సమయంలో రొనాల్డో కన్నీళ్లతో మైదానాన్ని వీడటం ఫుట్‌బాల్‌ అభిమానులను కలిచివేసింది.

భారీ డీల్​.. కాగా, 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్‌ మాడ్రిడ్‌, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్‌ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగిపోయింది. అలా ఫిఫా 2023 ప్రపంచకప్​ ముందు రొనాల్డో తన మాంచెస్టర్‌ యునైటెడ్ క్లబ్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. అనంతరం సౌదీ అరేబియాకు చెందిన మరో క్లబ్‌ అల్ నజర్​తో జతకట్టాడు. ఆ క్లబ్‌ 2025 జూన్‌ వరకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా ఏడాదికి 200 మిలియన్‌ యూరోలతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మొత్తంగా 500 మిలియన్‌ యూరోలను (భారత కరెన్సీలో దాదాపు రూ.4400కోట్లకు పైమాటే) చెల్లించనుందట. దీంతో ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇదీ చూడండి: వామ్మో.. 'విరుష్క' బాడీగార్డ్ జీతం అంతా.. తెలిస్తే షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.