ETV Bharat / sports

పతకం కోసం పోరుబాట.. ఉద్యోగం కోసం వెతుకులాట

author img

By

Published : Jul 2, 2020, 7:03 AM IST

నిఖత్‌ జరీన్‌.. తొమ్మిదేళ్ల కిందటే ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అదే టోర్నీలో రెండేళ్ల తర్వాత రజతం కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మరే బాక్సర్‌ అందుకోని ఘనతలివి. టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో బెర్తు కోసం దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌తో అమీతుమీ తేల్చుకున్న ధీశాలి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న ఏకైక తెలుగు బాక్సర్‌. అయినా ఉద్యోగం పొందడంలో మాత్రం తనకు నిరాశే ఎదురవుతోంది.

Boxer NiKhat Zareen Special Interview
పతకం కోసం పోరుబాట.. ఉద్యోగం కోసం వెతుకులాట

బాక్సింగ్‌ రింగ్‌లో పంచ్‌లతో ప్రత్యర్థుల్ని చిత్తుచేస్తున్న నిఖత్‌కు ఉద్యోగం పొందడంలో మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఉద్యోగం ఇస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయండంటూ ఆమె చేస్తున్న విజ్ఞప్తులు బుట్ట దాఖలవుతున్నాయి! పైగా.. ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ ఉందా? అని ఒక ఉన్నతాధికారి ఎదురు ప్రశ్న వేస్తారు! స్పోర్ట్స్‌ కోటా జీవోలో బాక్సింగ్‌ లేదు కదా అని మరో ఉన్నతాధికారి అంటారు! ఆశా వర్కర్ల పోస్టులు పడుతున్నాయి.. దరఖాస్తు చేసుకోమని ఇంకో ఉన్నతాధికారి సలహా ఇస్తారు! అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయికి సొంతగడ్డపై ఇలాంటి అవమానాలకు మాత్రం లోటులేదు!

టర్నింగ్​ పాయింట్​

2011లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌గా ఆవిర్భవించిన నిఖత్‌కు అప్పట్నుంచి కెరీర్‌లో ఎదురేలేదు. మహిళల 51 కేజీల విభాగంలో దేశంలోనే నంబర్‌వన్‌ బాక్సర్‌గా నిలిచింది. నేషన్స్‌ కప్‌ అంతర్జాతీయ టోర్నీ, గోల్డెన్‌ గ్లోవ్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ టోర్నీ, బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ టోర్నీ, బల్గేరియా స్ట్రాంజా అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజతం, టోక్యో ఒలింపిక్‌ క్రీడల టెస్ట్‌ ఈవెంట్లో కాంస్యం, ఇండియా ఓపెన్‌లో కాంస్య పతకాలతో మెరిసింది. తెలుగు రాష్ట్రాల తరఫున మరే బాక్సర్‌ అందుకోని ఘనతలు ఆమె సొంతం.

Boxer NiKhat Zareen Special Interview
తెలంగాణ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో బాక్సర్​ నిఖత్​ జరీన్​

ఉద్యోగ వేటలో

గతేడాది అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి సొంతగడ్డ తెలంగాణకు తిరిగొచ్చిన నిఖత్‌ను మంత్రి కేటీఆర్‌, క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని, స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఉద్యోగ వేటలో ఉన్న నిఖత్‌ ఒకవైపు అంతర్జాతీయ టోర్నీలు ఆడుతూనే గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమైంది. పరీక్షలో అర్హత మార్కులు 70 కాగా 63 మార్కులు సంపాదించింది. స్పోర్ట్స్‌ కోటా కింద కూడా ఆమెకు ఉద్యోగం రాకపోవడం వల్ల.. నిఖత్‌ తండ్రి జమీల్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కుమార్తె ఉద్యోగం గురించి విజ్ఞప్తి చేశారు. యువ బాక్సర్‌కు అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. అయితే సీఎం హామీని కూడా ఉన్నతాధికారులు అటకెక్కించారు!

"తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ టోర్నీలపై ఏకాగ్రత పెట్టాలంటే ఉద్యోగ భద్రత చాలా ముఖ్యం. పోలీసు శాఖలో పనిచేయాలన్నది నా కోరిక. సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా."

- నిఖత్​ జరీన్​, భారత బాక్సర్​

హమీలు ఇచ్చినా ఫలితం శూన్యం

ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఫలితం లేకపోవడం వల్ల మరోసారి నిఖత్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, క్రీడల ముఖ్య కార్యదర్శి, శాట్స్‌ ఎండీ, ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి సహా ప్రభుత్వ.. క్రీడా సంఘాల పెద్దలకు విజ్ఞప్తులు అందజేసింది. అంతర్జాతీయంగా సత్తా చాటిన బాక్సర్‌గా.. అన్ని అర్హతలు ఉన్న తనకు స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వమని కోరింది. ప్రభుత్వం స్పందించి తనకు ఉద్యోగమిస్తే మరింత మంది అమ్మాయిలు క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకుంటారని ఆమె అంటోంది.

ఇదీ చూడండి... ఇన్​స్టాలో సానియా-షోయబ్ డేట్​ నైట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.