ETV Bharat / sports

'148 మంది అథ్లెట్లకు టీకా.. 17 మందికి రెండు డోసులు'

author img

By

Published : May 22, 2021, 12:22 PM IST

దేశంలో ఇప్పటివరకు 148 మంది అథ్లెట్లు (అన్ని క్రీడలతో కలిపి) టీకాలు వేసుకున్నారని తెలిపారు భారత ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరేందర్ బత్రా. పారా ఒలింపిక్స్ ఆటగాళ్లతో కలిసి ఈ సంఖ్య 163 అని వెల్లడించారు.

Narinder Batra
నరేందర్ బత్రా

కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సామాన్య ప్రజలు, ప్రముఖులు, క్రీడాకారులు టీకా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు దేశంలో 148 మంది అథ్లెట్లు (అన్ని క్రీడలతో కలిపి) వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు భారత ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరేందర్ బత్రా. ఇందులో ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

"మొత్తం 148 మంది అథ్లెట్లలో 17 మంది టీకా రెండు డోసులు వేసుకోగా, మరో 131 మంది తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులూ ఉన్నారు. అలాగే 13 మంది పారా ఒలింపిక్స్ అథ్లెట్లు కూడా తొలి విడత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో ఇద్దరు రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో కలిపి ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్న అథెట్ల సంఖ్య 163. ఇందులో టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనబోయే ఆటగాళ్లలో 87 మంది తొలివిడత డోసులు వేసుకోగా, 23 మంది రెండు డోసులు వేసుకున్నారు."

-నరేంర్ బత్రా, ఐఓఏ అధ్యక్షుడు

గతేడాది జరగాల్సి ఉన్న ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. ఈ ఏడాది కూడా కొవిడ్ కారణంగా మెగాటోర్నీ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వీటిపై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ.. జపాన్​లో అత్యవసర పరిస్థితి విధించినా కూడా పోటీలు మాత్ర తప్పకుండా జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది జులైలో ఈ పోటీలు జరగనున్నాయి. జులై 23న ఒలింపిక్స్, ఆగస్టు 24న పారా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభమవుతాయి.

మెగాటోర్నీలో పాల్గొనే షూటర్లు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్నారు. వారు అక్కడే వ్యాక్సిన్ వేయించుకుని నేరుగా టోక్యో బయలుదేరతారు. ఇందులో కొందరు క్రొయేషియాకు వెళ్లేముందే తొలిడోసు టీకా వేసుకున్నారు. రెండో డోసు అక్కడే వేయించుకోనున్నారు. ఫెన్సర్ భవానీ దేవీ ఇటలీలో, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను యూఎస్ఏలో టీకా వేసుకోనున్నారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.