ETV Bharat / sports

Junior Hockey World Cup:  క్వార్టర్స్​లో అదరగొట్టిన మన కుర్రాళ్లు

author img

By

Published : Dec 2, 2021, 6:32 AM IST

జూనియర్​ హాకీ వరల్డ్​ కప్​2021,  Junior Hockey World Cup 2021 Quarter-final , Junior Hockey World Cup 2021 Quarter-final  teamindia won
జూనియర్​ హాకీ వరల్డ్​ కప్​2021

Junior Hockey World Cup 2021 quarter finals: జూనియర్​ హాకీ ప్రపంచకప్​లో టైటిల్​ను సొంతం చేసుకునే దిశగా యువ భారత జట్టు దూసుకెళ్తోంది. బుధవారం జరిగిన క్వార్టర్స్​లో భారత్​ 1-0 తేడాతో బెల్జియంపై గెలుపొందింది.

Junior Hockey World Cup 2021 quarter finals: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా యువ భారత జట్టు మరో అడుగు ముందుకేసింది. అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ కప్పు ఖాతాలో వేసుకునేందుకు చేరువవుతోంది. బుధవారం క్వార్టర్స్‌లో భారత్‌ 1-0 తేడాతో బలమైన బెల్జియంపై విజయం సాధించింది. 21వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన శార్దానంద్‌ తివారీ జట్టుకు గెలుపు గోల్‌ అందించాడు. ఓవరాల్‌ మ్యాచ్‌ల్లో గెలుపోటముల రికార్డు చూసుకుంటే బెల్జియందే ఆధిపత్యం.. ఈ ప్రపంచకప్‌లో తన పూల్‌లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.. కానీ క్వార్టర్స్‌లో బెల్జియంకు భారత్‌ ఓటమి రుచి చూపింది. జూనియర్‌ ప్రపంచకప్‌లో ఆ జట్టుపై అజేయ రికార్డును కొనసాగించింది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మైదానంలో చిరుతల్లా కదిలిన మన కుర్రాళ్లు తెలివిగా ఆడారు. ఆరంభంలో ప్రత్యర్థిని సమర్థంగా కట్టడి చేసి.. ఆ తర్వాత గోల్‌పోస్టులపై దాడులు చేశారు. బెల్జియం కూడా గట్టిగానే పోరాడటం వల్ల తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్‌ నమోదు కాలేదు.

ఇక రెండో క్వార్టర్‌లో భారత్‌ మరింత దూకుడు ప్రదర్శించింది. జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేస్తూ శార్దానంద్‌ భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ వెంటనే ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌ అవకాశం వచ్చినప్పటికీ భారత డిఫెన్స్‌ దాన్ని సమర్థంగా అడ్డుకుంది. అక్కడి నుంచి ప్రత్యర్థిని నిలువరించడంపై భారత్‌ దృష్టి పెట్టింది. ముఖ్యంగా గోల్‌ కీపర్‌ పవన్‌ గొప్ప ప్రదర్శన చేశాడు. రెండో అర్ధభాగంలో ప్రత్యర్థికి లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలను అతను గొప్పగా అడ్డుకున్నాడు. ఆఖర్లో అతను గోడలా నిలబడ్డాడు. 57వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ అడ్డుకోవడంతో పాటు 59వ నిమిషంలో గోల్‌ కాకుండా ఆపాడు. చివరి వరకూ అదే పట్టుదల చూపించిన భారత్‌ విజయాన్ని అందుకుని జర్మనీతో పోరుకు సిద్ధమైంది.

షూటౌట్‌లో జర్మనీ: ఆరు సార్లు ఛాంపియన్‌ జర్మనీ సెమీస్‌లో అడుగుపెట్టింది. హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్స్‌లో ఆ జట్టు షూటౌట్‌లో 3-1తో స్పెయిన్‌ను ఓడించింది. అంతకుముందు మ్యాచ్‌ నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 2-2తో నిలవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. మ్యాచ్‌లో జర్మనీ తరపున క్రిస్టోఫర్‌ (5వ నిమిషంలో), మాసి (60వ), స్పెయిన్‌ జట్టులో అబాజో (11వ), ఎడ్వర్డ్‌ (59వ) గోల్స్‌ కొట్టారు. మ్యాచ్‌లో ఆఖరి నిమిషాల్లో నాటకీయత చోటు చేసుకుంది. 59వ నిమిషంలో ఎడ్వర్డ్‌ ఫీల్డ్‌ గోల్‌తో స్పెయిన్‌దే విజయం అనిపించింది. కానీ ఆఖరి నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన మాసి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. అందులో గొప్ప ప్రదర్శన చేసిన జర్మనీ విజయాన్ని అందుకుంది. రెండో క్వార్టర్స్‌లో అర్జెంటీనా 2-1తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. అర్జెంటీనా తరపున జొయాకిన్‌ (24వ), ఫ్రాంకో (59వ) చెరో ఫీల్డ్‌ గోల్‌ కొట్టారు. నెదర్లాండ్స్‌ జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను బుకెన్స్‌ (25వ) చేశాడు. ఈ మ్యాచ్‌ కూడా షూటౌట్‌కు దారి తీసేలా కనిపించింది. కానీ మ్యాచ్‌ ముగిసేందుకు మరో నిమిషం ముందు ఫ్రాంకో గోల్‌ కొట్టి జట్టును గెలిపించాడు. మరోవైపు ఫ్రాన్స్‌ 4-0తో మలేసియాను చిత్తుచేసి సెమీస్‌ చేరింది. టిమోతీ (14వ, 24వ, 60వ) మూడు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేశాడు. మథియాస్‌ (31వ) ఓ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు.

జూనియర్‌ ప్రపంచకప్పుల్లో ఇప్పటివరకు బెల్జియంతో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయాలు సాధించింది.

ఇదీ చూడండి: BWF World Tour Finals: సింధు, శ్రీకాంత్ శుభారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.