ETV Bharat / sports

నేను చేసిన ఆ పనికి ధోనీ మాత్రమే స్పందించాడు: కోహ్లీ

author img

By

Published : Sep 5, 2022, 9:51 AM IST

Updated : Sep 5, 2022, 1:29 PM IST

kohli dhoni comments
ధోనీపై కోహ్లీ కామెంట్స్​

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తాను టెస్టు కెప్టెన్సీకి గుడ్​బై చెప్పిన సమయంలో ధోనీ తనతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు విరాట్​ కోహ్లీ. తామిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాడు. తాను టెస్టు కెప్టెన్సీకి గుడ్​బై చెప్పిన స‌మ‌యంలో మహీ మాత్ర‌మే తనతో పర్సనల్​గా మాట్లాడాడని గుర్తుచేసుకున్నాడు. మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రూ ఎలాంటి అభిప్రాయాల‌ను పంచుకోలేద‌ని పేర్కొన్నాడు. గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కోహ్లీ ఆసియాకప్​లో భాగంగా ఆదివారం పాక్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్​ సెంచరీ రాణించాడు. ఈ మ్యాచ్​ అనంతరం మాట్లాడుతూ ధోనీపై వ్యాఖ్యలు చేశాడు.

"నేను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. గతంలో నేను అతడితో కలిసి ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్‌ ధోనీ. మరెవరూ నాకు మెసేజ్‌లు చేయలేదు. నా ఫోన్‌నంబర్‌ చాలా మంది వద్ద ఉంది. చాలా మంది నాకు టీవీల్లో సలహాలు ఇస్తున్నారు. కానీ, ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడు. మీకు ఎవరితోనైనా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. మీకు ఇరువైపుల నుంచి నమ్మకముందన్న విషయం అర్థమవుతుంది. నేను అతడి నుంచి ఏమీ ఆశించలేదు.. అతడు నా నుంచి ఏమీ ఆశించలేదు. మేము ఇద్దరం పరస్పరం అభద్రతా భావంతో ఎప్పుడూ లేము" అని విరాట అన్నాడు.

టీవీల్లో బహిరంగ సలహాలు ఇవ్వడంపై మాట్లాడుతూ.. "నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే.. వ్యక్తిగతంగా చెబుతాను. మీరు టీవీల ఎదుట లేదంటే ప్రపంచం మొత్తానికి తెలిసేట్లు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే.. వాటికి నా వద్ద ఎలాంటి విలువ ఉండదు. మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. వాటిని నేను నిజాయితీగా పరిశీలిస్తాను. అవి ఎలా ఉంటాయో మీరే చూస్తారు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు.. మీరు విజయం సాధించేలా ఆ భగవంతుడే చూస్తాడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి" అని కింగ్‌ కోహ్లీ పేర్కొన్నాడు.

అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక సమయంలో క్యాచ్‌ను వదిలేయడంపై కోహ్లీ స్పందించాడు. ఈ విషయంలో అర్ష్‌దీప్‌ను పూర్తిగా వెనకేసుకొచ్చాడు. "ఎవరైనా తప్పులు చేస్తారు. అక్కడ పరిస్థితి చాలా ఉత్కంఠగా ఉంది. మ్యాచ్‌ చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పులు జరగొచ్చు. నేను తొలిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు షాహిద్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో చెత్తషాట్‌ ఆడాను. ఆ రోజు నిద్రపట్టక తెల్లవారు జాము 5 గంటల వరకూ సీలింగ్‌ చూస్తూనే గడిపాను. నా కెరీర్‌ ముగిసిపోయిందనుకొన్నాను. ఇవన్నీ సహజమే. ప్రస్తుతం టీమ్‌ ఇండియాలో మంచి వాతావరణం ఉంది. సీనియర్లు మీ చుట్టూ ఉంటారు. ఈ క్రెడిట్‌ కెప్టెన్‌, కోచ్‌కే దక్కుతుంది. తప్పును గ్రహించి.. దాని నుంచి నేర్చుకొని ముందుకు వెళ్లడమే" అని విరాట్‌ చెప్పారు.

ఇదీ చూడండి: Asia Cup 2022 : చేజేతులా ఓడిన భారత్‌.. ప్రతీకారం తీర్చుకున్న పాక్

Last Updated :Sep 5, 2022, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.