ETV Bharat / sports

ఆ ఎన్నికలకూ దూరం.. కొత్త ఇన్నింగ్స్ అంటూ మరో ట్విస్ట్.. గంగూలీ ప్లాన్ ఏంటో?

author img

By

Published : Oct 24, 2022, 10:47 AM IST

Ganguly political Entry
గంగూలీ పొలిటికల్​ ఎంట్రీ

భారతదేశానికి కెప్టెన్​గా ఎన్నో సంవత్సరాలు తన సేవలందించిన సౌరవ్ గంగూలీ.. ఆ తర్వాత కూడా క్యాబ్​, బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఐసీసీ ఛైర్మన్​గా కూడా బాధ్యతలు చేపడతాడని అంతా అశించారు. కానీ అతడు మాత్రం క్రికెట్ వర్గాలకు ఊహించని షాక్​ల మీద షాక్​లు ఇచ్చాడు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్ష పదవి, ఐసీసీ ఛైర్మన్​ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అతడు.. తాజాగా క్యాబ్​ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతడు ఏ పదవిలోనూ లేడు. మరోవైపు అతడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు ఇంతకీ దాదా కొత్త ఇన్నింగ్స్​ ప్లాన్ ఏంటి? పాలిటిక్స్​లో వస్తాడా? రాడా? అనేది ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

సౌరవ్‌ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా దాదా చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అతడు రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమే అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎందుకుంటే అతడు తాజాగా క్రికెట్‌ వర్గాలకు ఊహించని షాకిచ్చాడు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరమైన అతడు.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాడు. దీని గురించి మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల గురించి భవిష్యత్​లో ఆలోచిస్తాను. నా కొత్త ఇన్నింగ్స్​లో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి' అని అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారాయి. బహుశ దాదా రాజకీయాల్లోకి వచ్చే విషయం గురించే పరోక్షంగా అన్నాడని భావిస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం కూడా తన క్రీడా ప్రస్థానం ప్రారంభించి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా దాదా ఓ ట్వీట్​ చేశాడు. 'ప్రజలకు సహాయపడేలా ఇకపై ఏదైనా చేయాలని భావిస్తున్నా. కొత్త మార్గంలో నడవాలని ప్లాన్‌ చేసుకుంటున్నా. నాకు మీ అందరి మద్దతు కావాలి' అంటూ రాసుకొచ్చాడు. ఆ ట్వీట్‌ రాజకీయ ఎంట్రీకి సంబంధించిందేనని వార్తలు గుప్పుమన్నాయి. ఇకపోతే ఆ ట్వీట్​కు కొద్ది రోజుల క్రితం కూడా భాజపాకు చెందిన కీలక నేతలు గంగూలీ ఇంటికి వెళ్లి మంతనాలు జరపడం.. మరోవైపు బంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేతలతో అతడు టచ్‌లో ఉన్నాడని వార్తలు రావడం జరిగింది.

దాదాకు దీదీ మద్దతు.. ఇక బీసీసీఐ అధ్యక్ష పదవి రేసు నుంచి దాదా తప్పుకున్నప్పుడు అతడు ఐసీసీ ఛైర్మన్​ పదవికి పోటీ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రెండు పదవులకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతుగా నిలిచారు. రెండు సార్లు అతడి గురించి ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాదాను అధ్యక్ష ఎన్నికల్లో వంచించారని, అన్యాయంగా తప్పించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కుట్రపూరిత రాజకీయాలతోనే గంగూలీని ఐసీసీ ఛైర్మన్​ పదవికి నామినేట్ చేయలేదని ఆరోపించారు.

మొత్తంగా దాదా.. బీసీసీఐ ప్రెసిడెంట్​ ఎన్నికల నుంచి తప్పుకోవడం, ఐసీసీ ఛైర్మన్, క్యాబ్​ పదవికి పోటీ చేయకపోవడం, కొత్త ఇన్నింగ్స్​ స్టార్ట్​ చేస్తున్నా అని చెప్పడం వంటివి గమనిస్తే.. గంగూలీ రాజకీయ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. మరి దాదా నిజంగానే పొలిటికల్​ ఎంట్రీ కోసం ఈ ఎన్నికలకు దూరమయ్యాడా? అసలు ఆ కొత్త ఇన్నింగ్స్​ ఏంటి? ఏం చేయబోతున్నాడు? అనేది ప్రస్తుతం అటు క్రీడా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై క్లారిటీ రావాలంటే దాదా స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: కోహ్లీ దీపావళి ధమాకా భారత్-పాక్​ మ్యాచ్​ అపురూప దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.