ETV Bharat / sports

T20 Worldcup: పాపం సూర్య, కోహ్లీ ఎంత ఫీలయ్యారో

author img

By

Published : Nov 11, 2022, 1:58 PM IST

టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​లో ఓటమితో వెనుదిరిగింది టీమ్​ఇండియా. దీంతో జట్టుతో పాట క్రికెట్​ ప్రేమికులు బాధలో మునిగిపోయారు. అయితే ఈ క్రమంలో కోహ్లీ, సూర్య ఎమోషనల్​ ట్వీట్​ చేశారు.

Etv Bharat
Etv Bharat

మెగా టైటిల్‌ కల తీరకుండానే మరో పెద్ద టోర్నీలో టీమ్‌ఇండియా జర్నీ ముగిసింది. టీ20 ప్రపంచకప్‌ నుంచి రోహిత్‌ సేన నిష్క్రమించింది. ఈ ఓటమి జట్టు ఆటగాళ్లను దుఃఖంలో ముంచెత్తింది. కోట్లాది మంది భారత అభిమానులను నిరాశలోకి నెట్టేసింది. ఈ అసంపూర్ణ ప్రయాణంపై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. భారమైన హృదయంతో ఆస్ట్రేలియాను వీడుతున్నామంటూ ఉద్వేగభరిత ట్వీట్‌ చేశాడు. ఈ టోర్నీ నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"మా కలను సాధించకుండా.. తీవ్ర నిరాశతో నిండిన హృదయాలతో ఆస్ట్రేలియా తీరాలను వదిలివెళ్తున్నాం. కానీ ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలనేదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నా- కోహ్లీ

ఇక, యువ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. "బాధాకరమైన ఓటమి. మేం ఎక్కడ ఆడినా అద్వితీయ మద్దతు ఇచ్చే మా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ.. ఎంతో కష్టపడిన జట్టు యాజమాన్యం, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు. నా దేశానికి ఆడటం గర్వంగా ఉంది. మరింత బలంగా తిరిగొస్తాం" అని సూర్య ట్విటర్‌లో రాసుకొచ్చాడు. అటు టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గుండె బద్దలైన ఎమోజీని ట్వీట్ చేసి నిరాశ వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: T20 Worldcup: ఆ ముగ్గురు తప్ప అందరూ ఫ్లాపే.. ప్లేయర్స్ వ్యక్తిగత స్కోరు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.