ETV Bharat / sports

Virat Kohli: 'కోహ్లీ వందో టెస్టు.. ఈసారి సెంచరీ పక్కా'

author img

By

Published : Mar 1, 2022, 8:34 PM IST

Virat Kohli 100 test: టీమ్​ ఇండియా రన్​ మెషీన్​ విరాట్​ కోహ్లీ సెంచరీపై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వందో టెస్టులోనే కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు దిగ్గజ ఆటగాడు సునీల్​ గావస్కర్​. ఈ మ్యాచ్​కు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ పంజాబ్​ క్రికెట్​ ఆసోసియేషన్​కు సమాచారం అందించింది.

virat kohli
విరాట్ కోహ్లీ

Virat Kohli 100 test: భారత మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తాడోనని యావత్​ క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన వందో టెస్టులోనైనా సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకూ కోహ్లీ ఒక్క సెంచరీ చేయలేదు. తరచుగా అర్ధశతకాలతో రాణిస్తున్నా.. మూడంకెల స్కోరును మాత్రం అందుకోలేదు. ఈ నేపథ్యంలో మార్చి 4 నుంచి మెుహాలీలో జరిగే తన వందో టెస్ట్ మ్యాచ్​ కోసం కోహ్లీ నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

కోహ్లీ సెంచరీ అంశంపై దిగ్గజ ఆటగాడు సునీల్​ గావస్కర్​ సైతం స్పందించాడు. తన వందో టెస్ట్​ మ్యాచ్​లో కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. వందో టెస్టులో సెంచరీ చేసిన మెుదటి భారతీయ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాలన్నాడు. దేశం తరఫున ఆడాలన్న కలతో ఎదిగి వందోటెస్ట్​ మ్యాచ్​ ఆడటం గొప్ప అనుభూతి అన్నాడు.

కోహ్లీ ఈ మ్యాచ్​ ఆడితే భారత్​ తరఫున వంద టెస్టు మ్యాచులాడిన పదకొండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇంతకుముందు సచిన్​ తెందూల్కర్​(200), రాహుల్​ ద్రవిడ్​(163), వీవీఎస్ లక్ష్మణ్​(134), అనిల్​ కుంబ్లే(132), దిలీప్​ వెంగ్​సర్కార్​(116), సౌరభ్​ గంగూలీ(113), ఇషాంత్​ శర్మ(105), హర్బజన్​ సింగ్​(105), వీరేంద్ర సెహ్వాగ్​(103) ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటివరకూ ఏ భారత బ్యాటర్​ కూడా వందో టెస్టులో సెంచరీ చేయలేదు. అంతర్జాతీయంగా చూస్తే 9 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు.

"సెంచరీ చేసి తన వందో టెస్ట్​ మ్యాచ్​ను కోహ్లీ ఘనంగా జరుపుకుంటాడని అనుకుంటున్నాను. అనేక మంది ఆటగాళ్లు వందో టెస్ట్​ ​ఆడినా చాలా తక్కువ మంది ఈ ఘనతను సాధించారు. నాకు తెలిసి కొలిన్​ కౌడ్రె మెుదటి ఆటగాడు అనుకుంటా. జావీద్​ మియాందాద్​, అలెక్స్​ స్టీవార్ట్​ కూడా చేశారు. నా 109వ టెస్ట్​ మ్యాచ్​లో 48 పరుగుల వద్ద సులభమైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాను. నువ్వు ఈ ఘనత సాధించబోతున్నావని అనిపిస్తుంది. నువ్వు స్కూల్లో క్రికెట్​ ఆడుతున్నపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నావు. దేశానికి ఆడుతూ వందో టెస్ట్​ మ్యాచ్ వరకూ చేరుకున్నావు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఒక్క టెస్ట్​ ఫార్మాట్​లోనే కాదు మిగిలిన ఫార్మాట్లలో అతడు సాధించిన రికార్డులు చూస్తే అద్భతమైన ఆటగాడని ఎవరికైనా తెలుస్తుంది."

-సునీల్ గావస్కర్​

మరోవైపు, విరాట్​ కోహ్లీ వందో టెస్ట్​ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్​కు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్​ క్రికెట్ ఆసోసియేషన్​కు బీసీసీఐ సమాచారం అందించింది.

2019 నుంచి...

బంగ్లాదేశ్​తో 2019లో జరిగిన మ్యాచ్​లో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ మూడంకెల స్కోరు చేయలేదు. 2020 నుంచి కోహ్లీ 45శాతం కంటే తక్కువ సగటుతో ఉన్నాడు. 14 టెస్ట్​ మ్యాచుల్లో 4 అర్థశతకాలతో 760 పరుగులు చేశాడు. కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వడం వల్ల వెస్టిండీస్​తో చివరి టీ20, శ్రీలంకతో పూర్తి సిరీస్​కు దూరమయ్యాడు. కోహ్లీ జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​లోనే వందో టెస్ట్​ మ్యాచ్​ ఆడాల్సి ఉన్నా వెన్నునొప్పితో ఆడలేదు.

ఇదీ చదవండి: కోహ్లీ సూపర్​​ ఇన్నింగ్స్​.. మలింగను భయపెట్టేశాడుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.