ETV Bharat / sports

'కుర్రాళ్ల విషయంలో ఇంకాస్త ఓపిక పట్టాలి'

author img

By

Published : Jan 7, 2023, 8:01 AM IST

team india coach rahul dravid
rahul dravid

టీమ్​లో ఇప్పుడున్న ప్లేయర్స్​ అంతా చిన్నవారని వాళ్ల విషయంలో కాస్త ఓపిక పట్టాలని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. అంతే కాకుండా వచ్చే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో టీమ్‌ఇండియా పునర్నిర్మాణ దశలో ఉందని ..మూడో టీ20 కోసం జట్టులో మార్పులు ఉండకపోవచ్చని చెప్పాడు.

వచ్చే టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో టీమ్‌ఇండియా పునర్నిర్మాణ దశలో ఉందని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. అనుభవం సంపాదించే వరకు యువ ఆటగాళ్ల విషయంలో ఓపికగా ఉండాలని ద్రవిడ్‌ తెలిపాడు. శ్రీలంకతో రెండో టీ20లో ఓటమికి అనుభవ రాహిత్యమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. "జట్టులోని కుర్రాళ్లకు చాలా నైపుణ్యం ఉంది. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కష్టంతో కూడిన పని ఇది. అంతర్జాతీయ క్రికెట్లో నేర్చుకోవడం అంత సులువు కాదు. కుర్రాళ్ల విషయంలో ఓపిక అవసరం. జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి వారికి మద్దతు కొనసాగుతుంది. తర్వాతి టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రయాణం ఇప్పుడే మొదలైంది. జట్టు పునర్నిర్మాణ దశలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా భిన్నమైన పరిస్థితిలో ఉంది. ఈ సిరీస్‌ కంటే ముందు ఇంగ్లాండ్‌తో ప్రపంచకప్‌ సెమీస్‌ టీమ్‌ఇండియా ఆడిన చివరి టీ20 మ్యాచ్‌. అప్పుడు ఆడిన వాళ్లలో కొద్దిమంది మాత్రమే ఇప్పుడు జట్టులో ఉన్నారు. మాది యువ జట్టు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ కూడా ఉండటం సానుకులాంశం. వరల్డ్‌కప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఎక్కువ దృష్టిసారిస్తారు కాబట్టి టీ20ల్లో యువ ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. వారికి అవకాశాలిచ్చి అండగా నిలవాలి. కుర్రాళ్ల విషయంలో ఓపిక పట్టాల్సి ఉందని భావిస్తున్నా" అని ద్రవిడ్‌ అన్నాడు.

మూడో టీ20 కోసం జట్టులో మార్పులు ఉండకపోవచ్చని చెప్పాడు. "జట్టులో చాలామంది యువ ఆటగాళ్లు ఆడుతున్నారు. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగంలో. వాళ్ల విషయంలో ఓపికగా ఉండాలి. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ చాలా చిన్నవాళ్లు. ఓపెనింగ్‌ జోడీగా వారి అనుభవం రెండు మ్యాచ్‌లే. గాయాలైతే తప్ప తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు" అని అన్నాడు.

రెండో టీ20లో ఎక్కువ నోబాల్స్‌ వేయడంపై స్పందిస్తూ.. "అర్ష్‌దీప్‌సింగ్‌, శివమ్‌ మావి చిన్న పిల్లలు. ఏ ఫార్మాట్లో అయినా నోబాల్స్‌, వైడ్లు వేయాలని ఎవరూ కోరుకోరు. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అదనపు పరుగులు నష్టం చేస్తాయి" అని బదులిచ్చాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల విభాగం చాలా పటిష్టంగా ఉందని ద్రవిడ్‌ చెప్పాడు. "షాబాజ్‌ అహ్మద్‌ కూడా జట్టులో ఉన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజాలతో జట్టు సంతోషంగా ఉంది. టీ20ల్లో అక్షర్‌ పటేల్‌కు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. జట్టుకు శుభ సంకేతమది" అని వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.