ETV Bharat / sports

కివీస్​తో రెండో వన్డే.. టీమ్​ఇండియాకు డేంజర్​ బెల్.. ఓడితే ఇక అంతే!

author img

By

Published : Nov 26, 2022, 7:51 PM IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే నవంబరు 27న హమిల్టన్‌ వేదికగా జరగనుంది. తొలివన్డేలో నెగ్గిన కివీస్‌ ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గితే సిరీస్‌ వారి సొంతమవుతుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ పోరులో దూకుడుగా ఆడాలని టీమిండియా కోరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

teamindia vs Newzealand second ODI match preview
కివీస్​తో రెండో వన్డే.. టీమ్​ఇండియాకు డేంజర్​ బెల్.. ఓడితే ఇక అంతే!

న్యూజిలాండ్‌ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలివన్డేలో ఓటమి చవిచూసిన భారత జట్టు హమిల్టన్‌ వేదికగా జరిగే రెండో వన్డే కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ నెగ్గడం ద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని కోరుకుంటోంది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలివన్డేలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ఓపెనర్లు శిఖర్‌ధావన్‌, శుభమన్‌ గిల్‌ అర్థశతకాలతో సత్తా చాటి మరోసారి శతక భాగస్వామ్యం అందించినప్పటికీ పవర్‌ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు సాధించలేకపోయారు. తొలి పది ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే భారత్ చేయగలిగింది. చిన్న మైదానమైన ఈడెన్‌ పార్క్‌లో 306 పరుగులు చేసినా భారత్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోతే 300 పరుగుల మార్క్‌ను కూడా టీమిండియా దాటేదికాదు. ఈ నేపథ్యంలో ఆది నుంచి దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలని భారత బ్యాటర్లు కోరుకుంటున్నారు.

ముఖ్యంగా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పేలవమైన ఫామ్‌ భారత జట్టును వేధిస్తోంది. వికెట్‌ కీపర్‌ స్థానం కోసం ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ వంటి ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న వేళ రిషబ్‌ పంత్‌ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. తొలి వన్డేలో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండో వన్డేలో లాథమ్‌, కేన్‌ విలియమన్స్‌ సహా కివీస్‌ బ్యాటర్లను వారు కట్టడి చేయాల్సి ఉంది. రెండో వన్డేకు చాహల్‌ స్థానంలో కులదీప్‌ను ఆడించే అవకాశాలనూ తోసిపుచ్చలేము. హమిల్టన్‌లోనూ టాస్‌ కీలక పాత్ర పోషించనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్‌ సూపర్ లీగ్‌ పాయింట్ల టేబుల్‌లో భారత్‌ అగ్రస్థానంతో కొనసాగుతోంది. ఆదివారం కివీస్‌తో రెండో వన్డేలో ఓడితే మాత్రం సిరీస్‌ కోల్పోవడం సహా టీమ్‌ఇండియా రెండో స్థానానికి పడిపోనుంది. ఐసీసీ పాయింట్ల పట్టికలో టాప్‌ - 8 జట్లు భారత్‌ వేదికగా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. పాయింట్లపరంగా కాకపోయినా ఆతిథ్య జట్టు హోదాలో భారత్‌కు ఈ టోర్నీలో ఆడే అవకాశం ఉంటుంది.


ఇదీ చూడండి: టీమ్​ఇండియాపై రమీజ్​ రాజా అక్కసు.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత క్రికెట్​ లవర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.