ETV Bharat / sports

టీమ్​ఇండియాపై రమీజ్​ రాజా అక్కసు..  గట్టి కౌంటర్ ఇచ్చిన భారత క్రికెట్​ లవర్స్​

author img

By

Published : Nov 26, 2022, 4:24 PM IST

Updated : Nov 26, 2022, 5:18 PM IST

ramiz raja
పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌ రజా

టీమ్​ఇండియాకు పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌ రాజా పరోక్షంగా హెచ్చరించాడు. అయితే దానిపై స్పందించిన భారత క్రికెట్ ప్రేమికులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏం అన్నారంటే..

దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్‌తో.. భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్లలో.. తటస్థ వేదికల్లో మాత్రమే పాక్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. అయితే వచ్చే ఏడాది ఆసియా కప్‌ పాక్‌ వేదికగా జరుగుతుండటంతో.. ఈ టోర్నీలో భారత్‌ పాల్గొనడంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ భారత్‌ తమ దేశంలో ఆడకపోతే.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌ రజా తెలిపాడు.

ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌లో తాము ఆడబోమని రమీజ్‌ తేల్చి చెప్పాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందే 2023 ఆసియా కప్‌ జరగనుంది. ఆసియా కప్‌ కోసం భారత్.. పాక్‌కు రావొద్దని నిర్ణయం తీసుకుంటే.. ఈ విషయంలో తమ వైఖరి దృఢంగా ఉందని రమీజ్‌ స్పష్టం చేశాడు.

గత కొంత కాలంగా పాక్‌ క్వాలిటీ క్రికెట్‌ ఆడుతోందని.. భారత్‌ను రెండు సార్లు ఓడించామని రమీజ్‌ గుర్తు చేశాడు. 'మా నిర్ణయం చాలా కచ్చితంగా ఉంది.. వాళ్లు(భారత్‌) ఇక్కడికి వస్తే.. మేం ప్రపంచకప్‌ ఆడటానికి అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే.. మేమూ వెళ్లం. పాక్‌ లేకుండానే మెగా టోర్నీ ఆడనివ్వండి. వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో పాక్‌ ఆడకపోతే.. ఆ టోర్నీని ఎవరు చూస్తారు?. మేం ఆటలో దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నాం. మా జట్టు మంచి ప్రదర్శన ఇస్తోంది. జట్టు మంచి ఆటను ఆడినప్పుడే పాక్‌ క్రికెట్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నేను ఎప్పుడూ చెబుతుంటాను. బిలియన్‌ డాలర్ల ఎకానమీ కలిగిన బోర్డు ఉన్న జట్టును పాక్‌ నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఓడించింది' అని ఓ ఉర్దూ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పీసీబీ చీఫ్‌ తెలిపాడు. పాకిస్థాన్‌లో ఆసియా కప్ ఆడబోమంటూ.. బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు పాక్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియాపై గతకొంతకాలంగా విమర్శలు చేస్తోన్న రమీజ్‌.. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు.

రమీజ్​ రాజాకు కౌంటర్​.. అయితే రమీజ్​ రాజా అన్న వ్యాఖ్యలపై టీమ్​ఇండియా క్రికెట్​ లవర్స్ గట్టి కౌంటర్​ వేశారు. ప్రపంచకప్​​ ఫైనల్​లో పాకిస్థాన్​ ఇంగ్లాండ్​ మ్యాచ్​ చూడటానికి 80,462 మంది ప్రేక్షకులు వచ్చారని(ఎక్కువ శాతం భారతీయులు), కానీ గ్రూప్​ స్టేజ్​లో ​ జరిగిన భారత్​ జింబాబ్వే మ్యాచ్​కు ఏకంగా 82,507మంది ఆడియెన్స్​ వచ్చారని గుర్తుచేశారు. దీని ఆధారంగా ఏ జట్టుకు ఎక్కువ ఆదరణ ఉందో తెలుసుకోవాలని రమీజ్​ రాజాకు సెటైర్లు వేశారు.

కాగా, 2009లో గడాఫీ స్టేడియం బయట శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం.. ఆ దేశంలో క్రికెట్‌ ఆడటం ప్రపంచ దేశాలు మానేశాయి. అక్కడ 2009లో నిర్వహించిన ఆసియా కప్పే చివరి మల్టీ నేషనల్‌ ఈవెంట్‌. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో 2015లో జింబాబ్వే, 2017లో శ్రీలంక అక్కడ పర్యటించింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడింది.

ఇవీ చదవండి: 'ఉమ్రాన్‌.. పేస్‌ను వదలొద్దు.. జోరు పెంచాల్సిందే!'

ఫ్యాన్​ అతి తెలివి.. బైనాక్యుల‌ర్స్‌లో బీర్​.. అడ్డంగా బుక్కైయాడుగా!

Last Updated :Nov 26, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.