ETV Bharat / sports

2021లో భారత్‌ సాధించిన అపురూప విదేశీ విజయాలు

author img

By

Published : Dec 31, 2021, 4:49 PM IST

Team India in Test
Team India

Team India in Test: 2021లో టెస్టుల్లో టీమ్​ఇండియా ఆధిపత్యం చెలాయించింది. మూడు దశాబ్దాలుగా గెలుపు మాత్రమే చవిచూస్తున్న గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించింది. ఇంగ్లాండ్​ను ఆ దేశంలోనే మట్టికరిపించింది. ఇక ఇటీవలే సెంచూరియన్​లోనూ దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం సాధించింది. ఈ విజయాలను మరోసారి నెమరవేసుకుందాం.

Team India in Test: ఇది కదా టీమ్‌ఇండియా అంటే. సగటు భారత అభిమాని ఆశించేదీ ఇదే కదా..! ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. టీమ్‌ఇండియా ఇన్నాళ్లూ ఇంట (స్వదేశం) గెలుస్తూనే ఉంది. కానీ, ఈ మధ్యే రచ్చ గెలవడం మొదలెట్టింది. దీంతో చరిత్ర తిరగరాసే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఉపఖండం ఆవల నాలుగు టెస్టుల్లో విజయం సాధించి చరిత్రలో రెండోసారి ఈ ఘనత నమోదుచేసింది. 2021 ఆరంభంలో గబ్బాలో తొలి టెస్టు విజయాన్ని రుచిచూసిన భారత జట్టు.. చివరగా సెంచూరియన్‌లో మరో చిరస్మరణీయ విజయం సాధించి ఈ ఏడాదిని మరింత ఘనంగా ముగించింది.

సిడ్నీలో డ్రా.. విజయం కన్నా ఎక్కువే..

Team India in Test
అశ్విన్

టీమ్‌ఇండియా ఈ ఏడాది ఆడిన తొలి టెస్టు.. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మూడో మ్యాచ్‌. అప్పటికే భారత్‌ తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలై.. మెల్‌బోర్న్‌లో ఆడిన రెండో టెస్టులో విజయం సాధించింది. దీంతో ఆత్మవిశ్వాసంతో సిడ్నీలో అడుగుపెట్టింది. కానీ, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేయగా టీమ్‌ఇండియాను 244 పరుగులకే పరిమితం చేసింది. అలా 94 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసి భారత్‌ ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, సిడ్నీలాంటి పిచ్‌ మీద చివరి రెండు రోజుల్లో 400 పైచిలుకు స్కోర్‌ సాధించాలంటే ఏ జట్టుకైనా అసాధ్యమే. కానీ, టీమ్‌ఇండియా తొలుత గెలవడానికే పోరాడింది. పంత్‌ (97) ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజయంపై ఆశలు రేపాడు. కానీ అతడు ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. 272 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో జట్టు ఓటమివైపు మళ్లింది. క్రీజులో మిగిలింది లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌. అప్పుడే అశ్విన్‌ (39), హనుమ విహారి (23) క్రీజులోకి వచ్చి 40 ఓవర్లకుపైగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ పటిష్ఠమైన ఆసీస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌ను డ్రా చేశారు. ఓటమి లాంఛనం అనుకున్న క్లిష్టపరిస్థితుల్లో నుంచి మ్యాచ్‌ను కాపాడారు. దీంతో ఇది విజయం కన్నా ఎక్కువనే చెప్పాలి.

గబ్బా కోటను బద్దలుకొట్టి..

Team India in Test
రిషభ్ పంత్

ఈ మ్యాచ్‌కు ముందు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు తిరుగులేదు. మూడు దశాబ్దాలుగా ఓటమే ఎరుగకుండా అక్కడ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. దీంతో 1988 తర్వాత టీమ్‌ఇండియానే అక్కడ తొలి విజయం సాధించి చరిత్ర తిరగరాసింది. గబ్బా కోటను బద్దలుకొట్టి సింహంలా గాండ్రించింది. అయితే, ఈ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా గట్టిపోటీనే ఇచ్చింది. టీమ్‌ఇండియాకు విజయం అంత తేలికగా రాలేదు. సిడ్నీలో అశ్విన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా నాటి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ 'గబ్బాకు రా.. చూసుకుందాం' అని కవ్వించాడు. అయినా, సంయమనంతో ఆడిన అతడు విహారితో కలిసి మ్యాచ్‌ను డ్రా చేశాడు. ఇక చివరి టెస్టులో అశ్విన్‌ ఆడకపోయినా టీమ్‌ఇండియానే మ్యాచ్‌ గెలిచింది. తొలుత ఆసీస్‌ 369 పరుగులు చేయగా.. భారత్‌ 336 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు 294 పరుగులు చేసి.. భారత్‌ ముందు 327 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంతి అనూహ్యంగా స్పందించే ఆ పిచ్‌పై చివరి రోజు 300పైచిలుకు పరుగులు చేయడం గగనమే. అయినా గిల్‌ (91), పుజారా (56), పంత్‌ (89), వాషింగ్టన్‌ (22) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఈ ఏడాది టెస్టుల్లో తొలి విజయం సాధించడమే కాకుండా రెండోసారి ఆసీస్‌ గడ్డపై బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ సాధించింది టీమ్‌ఇండియా.

ఇంగ్లిష్‌ జట్టును దాని సొంత గడ్డపైనే గడగడలాడించి..

Team India in Test
కేఎల్​ రాహుల్

ఇక ఇంగ్లాండ్‌ టీమ్‌ ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లీసేన స్పిన్‌ ఫ్రెండ్లీ పిచ్‌లు తయారు చేయించుకొని 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుందనే విమర్శలు ఎదుర్కొంది. అయితే, ఆ విమర్శకుల నోళ్లు మూయించేలా భారత్‌.. ఇంగ్లాండ్‌ పర్యటనలో రెచ్చిపోయింది. ఇంగ్లిష్‌ జట్టును దాని సొంత గడ్డపైనే గడగడలాడించి కొత్త శకానికి నాంది పలికింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తర్వాత నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా.. తర్వాత లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్‌ గెలుపు బావుటా ఎగురవేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (129) శతకంతో మెరవగా భారత్‌ 364 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ (180*) భారీ ఇన్నింగ్స్‌ ఆడి ఆ జట్టును 391 పరుగులకు చేరవేశాడు. దీంతో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఆపై భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 298/8 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ చేసి ఇంగ్లాండ్‌ ముందు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఆ జట్టును 120కే కుప్పకూల్చారు. దీంతో 151 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఓవల్‌లో గెలిచి.. ఆధిపత్యం చెలాయించి..

Team India in Test
రోహిత్ శర్మ

ఇక మూడో టెస్టు లీడ్స్‌లో జరగ్గా టీమ్‌ఇండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం మళ్లీ లండన్‌లోని ఓవల్‌ మైదానానికి చేరుకున్న రెండు జట్లూ నాలుగో టెస్టులో తలపడ్డాయి. ఈసారి భారత్‌ ఘన విజయం సాధించింది. 157 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది. చివరి టెస్టు కరోనా కేసుల కారణంగా రద్దవ్వగా దాన్ని తర్వాత నిర్వహించేందుకు ఇరు బోర్డులూ అంగీకరించాయి. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 290 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 99 పరుగులుగా నమోదైంది. అయినా టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడింది. రోహిత్‌ (127) శతకంతో చెలరేగాడు. భారత్‌ చివరికి 466 పరుగుల స్కోర్‌ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్‌ 366 పరుగుల లక్ష్య ఛేదనలో 210కే ఆలౌటై మరోసారి పేస్‌బౌలింగ్‌ పిచ్‌పైనే భంగపడింది. దీంతో భారత్‌ స్వదేశంలో స్పిన్‌ ఫ్రెండ్లీ పిచ్‌ల ఆరోపణలు ఎదుర్కొన్న వాటికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఇది ఈ ఏడాది టీమ్‌ఇండియాకు మూడో విదేశీ టెస్టు విజయం కావడం గమనార్హం.

సెంచూరియన్‌లో సెన్సేషన్‌.. మరో చారిత్రక విజయం..

Team India in Test
సెంచూరియన్​లో టీమ్​ఇండియా

ఇక తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ టీమ్ఇండియా జయకేతనం ఎగురవేసింది. ఇది కూడా పేస్‌ బౌలింగ్‌ పిచ్‌ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ 113 పరుగుల తేడాతో గెలుపొంది సెంచూరియన్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (123) మరోసారి శతకంతో ఆదుకున్నాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. ఆపై దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటవ్వగా భారత్‌కు 130 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌటై దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ ఏడాది భారత్‌ ఉపఖండం బయట నాలుగో టెస్టు గెలిచి 2021ను అద్భుతంగా ముగించింది. ఇదివరకు కూడా కోహ్లీ నేతృత్వంలోనే టీమ్‌ఇండియా 2018లో ఇలాంటి ఘనతే సాధించింది. కానీ అప్పుడు వేదికలు వేరు. అప్పుడు భారత్‌.. జోహెనస్‌బర్గ్‌, నాటింగ్‌హామ్‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ స్టేడియాల్లో విజయాలు సాధించడం విశేషం.

ఇక టీమ్‌ఇండియా ఇటీవలే సెంచూరియన్‌లో విజయం సాధించడం వల్ల ట్విట్టర్‌లో నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా గబ్బా టెస్టును గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి కోహ్లీసేన ఈ ఏడాది విజయ ప్రస్థానం మొదలెట్టిందని పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు గబ్బా పేరు ట్విట్టర్​లో ట్రెండింగ్‌గా మారింది.

ఇదీ చూడండి: India Rewind 2021: టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్ వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.