ETV Bharat / sports

టీమ్​ఇండియా X బంగ్లాదేశ్.. కోహ్లీ సలహా ఇచ్చాడు.. రాహుల్‌ మెరిశాడు

author img

By

Published : Nov 2, 2022, 8:35 PM IST

kl rahul virat kohli
kl rahul virat kohli

గత కొద్దిరోజులుగా ఫామ్​లేమితో సతమతమైన టీమ్​ఇండియా బ్యాటర్​ కేఎల్​ రాహుల్.. బుధవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్​ సెంచరీతో మెరిశాడు. మ్యాచ్​ అనంతరం 'కోహ్లీ సలహా ఇచ్చాడు.. రాహుల్‌ ఫామ్‌లోకి వచ్చాడు' అంటూ విరాట్​ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.

T20 World Cup Ind Vs Ban: టీ20 వరల్డ్‌కప్‌-2022.. గ్రూప్‌-2లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమ్​ఇండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారు చేసుకుంది. ఆఖరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఆసక్తికర సమరంలో టీమ్​ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి ప్రత్యర్ధిని చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (50), విరాట్‌ కోహ్లీ (64*) అర్ధ శతకాలతో చెలరేగగా.. ఆ తర్వాత భారత పేసర్లు ప్రతికూల పరిస్థితుల నడుమ అద్భుతంగా బౌలింగ్‌ చేసి బంగ్లాదేశ్‌ ఆటను కట్టించారు. కాగా, ఈ మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం సాధించి టీమ్​ఇండియా భారీ స్కోర్‌ సాధించడానికి పునాది వేసిన కేఎల్‌ రాహుల్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు పేలవ ఫామ్‌తో సతమతమై, కాన్ఫిడెన్స్‌ కోల్పోయిన రాహుల్‌.. ఒత్తిడిని ఎలా అధిగమించి ట్రాక్‌లో పడాలో కింగ్‌ కోహ్లీ వద్ద సలహాలు తీసుకోవడం నిన్న జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా మనందరం చూశాం. ఫామ్‌ లేమి కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాహుల్‌కు కోహ్లీ బ్యాటింగ్‌ పాఠాలు నేర్పడం, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడం గమనించాం.

రాహుల్‌.. కోహ్లీతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత నెట్స్‌లోకి వెళ్లి ప్రాక్టీస్‌ చేస్తుండగా.. కోహ్లీ అక్కడికి కూడా వెళ్లి ఫుట్‌వర్క్‌ తదితర విషయాలపై సలహాలు ఇవ్వడం పలు వీడియోల్లో వీక్షించాం. బంగ్లాపై టీమ్​ఇండియా గెలుపు అనంతరం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. కోహ్లీ సలహా ఇచ్చాడు.. రాహుల్‌ ఫామ్‌లోకి వచ్చాడు అంటూ కోహ్లీ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కోహ్లీ వీరాభిమానులైతే.. తమ ఆరాధ్య ఆటగాడు రాయితో సైతం పరుగులు చేయించగలడని ఆకాశానికెత్తుతున్నారు.

మొత్తానికి చాలా కాలంగా ఫామ్‌ లేక నానా తంటాలు పడ్డ రాహుల్‌ ఎట్టకేలకు బంగ్లాతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్‌ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఫుట్‌వర్క్‌, షాట్‌ సెలెక్షన్‌ తదితర అంశాల్లో పూర్వవైభవం సాధించాడు. రాహుల్‌కు పాఠాలు నేర్పి గట్టెక్కించిన కోహ్లీ సైతం ఈ మ్యాచ్‌లో అజేయమైన అర్ధసెంచరీతో మెరిశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.