ETV Bharat / sports

వారసుడు వచ్చేశాడు!.. విరాట్​ తర్వాత అతడేనా?

author img

By

Published : Feb 3, 2023, 7:21 AM IST

shubman gill
shubman gill

భారత క్రికెట్లో ప్రతి తరానికి ఓ సూపర్‌స్టార్‌ ఉన్నాడు. సునీల్‌ గావస్కర్‌ క్రికెట్‌కు ఆకర్షణ తెస్తే.. సొగసైన బ్యాటింగ్‌తో సచిన్‌ తెందుల్కర్‌ రికార్డుల దుమ్ముదులిపాడు. వారిద్దరి తర్వాత ఆట ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తూ కోహ్లి దూసుకొచ్చాడు. మరి విరాట్‌ తర్వాత ఎవరనే ప్రశ్నకు.. శుభ్‌మన్‌ గిల్‌ సమాధానంగా కనిపిస్తున్నాడు! అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఆటతీరుతో.. ప్రతికూల పరిస్థితులనూ ఎదుర్కొనే ప్రతిభతో.. సవాళ్లను దాటి అలరించే షాట్లతో.. అంతర్జాతీయ క్రికెట్లో భారత ఆధిపత్యాన్ని కొనసాగించేలా ఆశలు రేపుతున్నాడు.

గత ఏడు మ్యాచ్‌ల్లో ఓ ద్విశతకం, మూడు సెంచరీలు.. టీ20ల్లో భారత్‌ తరపున అత్యధిక స్కోరు.. చిన్న వయసులోనే పొట్టి ఫార్మాట్లో శతకం చేసిన భారత క్రికెటర్‌.. అన్ని ఫార్మాట్లలోనూ మూడంకెల స్కోరు అందుకున్న అయిదో టీమ్‌ఇండియా ఆటగాడు.. ఇలా తక్కువ వయసులోనే ఎన్నో ఘనతలను ఖాతాలో వేసుకున్నాడు 23 ఏళ్ల పంజాబీ కుర్రాడు శుభ్‌మన్‌.

ఈ తరం కుర్రాళ్లలో చాలామంది ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు. టీ20ల్లో సత్తాచాటితే.. వన్డేలకు వచ్చే సరికి విఫలమవుతున్నారు. ఇక టెస్టుల గురించి ఆలోచించడమే లేదు. కానీ రోహిత్‌, కోహ్లి లాగా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టే ఆటగాడిగా శుభ్‌మన్‌ గుర్తింపు పొందుతున్నాడు. ఈ వయసులోనే పరిపూర్ణమైన ఆటగాడిగా.. టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా, ఫార్మాట్‌కు తగ్గ ఆటతీరుతో అలవోకగా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకూ 13 టెస్టుల్లో ఓ శతకం సహా 736 పరుగులు, 21 వన్డేల్లో 3 సెంచరీలు, ఓ ద్విశతకం కలిపి 1254 పరుగులు, 6 టీ20ల్లో ఓ సెంచరీతో సాయంతో 202 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని సగటు 73.76గా ఉండడం విశేషం.

పరుగుల దాహం..
ఇటీవల శ్రీలంకతో మూడో వన్డేలో శుభ్‌మన్‌ సెంచరీ (116) చేసినా అతని తండ్రి లఖ్‌విందర్‌ సింగ్‌కు ఆనందం లేదు. పైగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని గిల్‌ ఉపయోగించుకోలేదనేది అతని కోపానికి కారణం. కానీ కివీస్‌తో తొలి వన్డేలో ఆ ముచ్చట తీర్చేశాడు గిల్‌. అతనిలా పరుగుల వేటలో సాగడం వెనుక కుటుంబ ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కెరీర్‌ ఆరంభం నుంచి అతణ్ని వెన్నుతట్టి నడిపిస్తోంది అదే.

2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో అతని దూకుడు మాములుగా సాగలేదు. ఆ టోర్నీలో 124 సగటుతో 372 పరుగుల చేసి దేశానికి కప్పు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరుగుల మోత మోగించి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ'గానూ నిలిచాడు. సీనియర్‌ జట్టు తరపున ఆరంభంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా.. తట్టుకుని నిలబడ్డాడు.

ఇప్పుడు అతను నిలబడితే చాలు పరుగుల వరదే. ఫార్మాట్‌కు తగ్గట్లుగా గేర్లు మారుస్తూ ఆడడం అతని ప్రత్యేకత. పరిస్థితులకు అనుకూలంగా ఆటతీరు మార్చుకోవడంలోనూ పట్టు సాధించాడు. టెస్టుల్లో గంటల పాటు క్రీజులో నిలబడడం, వన్డేల్లో సందర్భోచితంగా గేర్లు మార్చడం, టీ20ల్లో విధ్వంసానికి దిగడం అతనికి అలవాటుగా మారింది.

ఏ సవాలైనా..
2020-21 బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ ఆస్ట్రేలియా గడ్డపై ఆకట్టుకున్నాడు. స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ లాంటి పేసర్లను ఎదుర్కొని.. జట్టు చారిత్రక టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతని 91 పరుగుల ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కఠిన సవాలును దాటి.. చెమటోడ్చి జట్టు విజయానికి బాటలు వేశాడు. ప్రమాదకర ప్రత్యర్థి బౌలింగ్‌ను కాచుకుని క్రీజులో గడిపాడు. ఇది అతని టెస్టు బ్యాటింగ్‌ సామర్థ్యాలకు దర్పణం పట్టింది. వన్డేల్లో కివీస్‌తో మ్యాచ్‌లో అతను డబుల్‌ సెంచరీ చేస్తాడని అనుకోలేదు. కానీ చివర్లో సిక్సర్లతో విరుచుకుపడి ఆ ఘనత అందుకున్నాడు.

ఇక టీ20లకు అతను పనికిరాడనే విమర్శలకు సెంచరీతో దిమ్మతిరిగే జవాబిచ్చాడు. ఓ ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో అనే దానికి న్యూజిలాండ్‌తో టీ20లో అతని బ్యాటింగ్‌ సాగిన తీరు సరైన ఉదాహరణ. తొలి 20 బంతుల్లో 34 పరుగులు, తర్వాతి 25 బంతుల్లో 33 పరుగులు, చివరి 18 బంతుల్లో 59 పరుగులు చేసిన అతను కచ్చితమైన సమయంలో వేగాన్ని అందుకున్నాడు. మొత్తం మీద 200 స్ట్రైక్‌రేట్‌తో అజేయంగా నిలిచాడు. నీళ్లు తాగినంత సులువుగా బౌండరీలు కొట్టడం, అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి ఎత్తిపడేయడం మెరుగుపరుచుకున్న అతని నైపుణ్యాలకు నిదర్శనం.

మరో పరీక్ష..
ప్రతిభావంతుడైన ఆటగాడు అని గిల్‌ పైన మొదటి నుంచే ముద్ర ఉంది. ఆరంభంలో కొన్ని అవకాశాలను వృథా చేసుకున్నప్పటికీ.. ఇప్పుడు బ్యాటింగ్‌లో మెరుగైన అతను ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. గతేడాది బంగ్లాదేశ్‌ పర్యటనలో రోహిత్‌ గైర్హాజరీలో మరోసారి అవకాశం దక్కించుకున్న అతను.. ఇక వదిలిపెట్టడం లేదు. టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు. ఇప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో అదరగొట్టాడు.

ఇప్పుడిక అతనికి మరో పరీక్ష ఎదురు కానుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అతనికి సవాలు విసరనుంది. ఈ నెల తొమ్మిదిన ఈ సిరీస్‌ ఆరంభమవుతుంది. తొలి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టుతో గిల్‌ ఉన్నాడు. గాయంతో శ్రేయస్‌ దూరమవడంతో అతను తుదిజట్టులో ఆడడం ఖాయమనిపిస్తోంది.

రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా ఆడతారు కాబట్టి గిల్‌ను మిడిలార్డర్‌లో ఆడించే ఆస్కారముంది. మరి ఈ పరీక్షలో అతను నెగ్గితే ఇక తిరుగుండదు. మూడు ఫార్మాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఇప్పటికే చాటిచెప్పిన అతను జట్టులో ఇకపై ప్రధాన ఆటగాడిగా ఎదుగుతాడనడంలో సందేహం లేదు.

కనుల విందుగా..
శుభ్‌మన్‌ బ్యాటింగ్‌ కనుల విందుగా ఉంటుంది. ఏదో క్రీజులో అడుగుపెట్టి ధనాధన్‌ షాట్లు ఆడామా? బౌండరీలు సాధించామా? అని కాకుండా.. అతను సంప్రదాయ షాట్లతోనే అలరిస్తాడు. కచ్చితత్వం, నియంత్రణతో సాధికారిక షాట్లు కొడతాడు. అతని ప్రతి షాట్‌ అద్భుతమే. క్రికెటింగ్‌ షాట్లకు పరిపూర్ణమైన ఉదాహరణగా అతని బ్యాటింగ్‌ సాగుతోంది. ఒక్కో షాట్‌ ముందు దానికంటే చూడముచ్చటగా ఉంటుంది. బంతి పడకముందే క్రీజులో కదలడం.. చాలా ముందుగానే అంచనా వేసి సర్దుకోవడం లాంటివేమీ గిల్‌ బ్యాటింగ్‌లో కనిపించవు.

బంతి పడిందా.. దానికి తగినట్లు అప్పటికప్పుడు షాట్‌ ఆడి పరుగులు సాధించడమే అతనికి తెలుసు. అందులోనే సొగసు దాగి ఉంది. మణికట్టును గొప్పగా వాడుతూ మైదానంలో అన్నివైపులా పరుగులు రాబట్టడంలో కళను ప్రదర్శిస్తున్నాడు. కచ్చితమైన టైమింగ్‌ అతని మరో బలం. క్రీజులో అతను అంతెత్తుగా నిలబడి.. బంతిని సరిగ్గా అందుకుని షాట్‌ ఆడుతుంటే కనువిందుగా ఉంటుంది.

ముఖ్యంగా కింది చేతిని అతను ఉపయోగించే తీరు గొప్పగా ఉంటోంది. పేసర్ల బౌలింగ్‌లో ఓ అడుగు ముందుకు వేసి.. బంతి లైన్‌ను గమనించి.. మెరుపు వేగంతో మిడ్‌ వికెట్‌లో సిక్సర్లు రాబట్టడం అతని మరో ప్రత్యేకత. క్రీజులో బలంగా నిలబడి షార్ట్‌పిచ్‌ బంతులను పుల్‌ షాట్లుగా మలచడంలోనూ అతను దిట్ట. 2022 డిసెంబర్‌ 14 నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి శుభ్‌మన్‌ 14 మ్యాచ్‌ల్లో 926 పరుగులు చేయడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.