ETV Bharat / sports

భారత్‌ను సెమీస్‌ చేర్చాలనేదే ఐసీసీ ఆలోచన: షాహిద్​ అఫ్రిది

author img

By

Published : Nov 4, 2022, 9:36 PM IST

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్ -2లో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. రెండు స్థానాల కోసం భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ పోటీలో నిలిచాయి. బంగ్లాపై విజయం సాధించిన టీమ్‌ఇండియా ఈ రేసులో ముందంజలో నిలిచింది. దీంతో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఏమన్నాడంటే?

shahid afridi
షాహిద్ అఫ్రిది

టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. వర్షం కారణంగా అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారిందని, ఫేక్‌ ఫీల్డింగ్‌.. అని బంగ్లా అభిమానులు, ఆటగాళ్లు సాకులు చెప్పుకొస్తున్నారు. ఈ విజయంతో పాక్‌ సెమీస్‌ ఛాన్స్‌లు కాస్త సంక్లిష్టంగా మారాయి. దీంతో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​పై తీవ్ర ఆరోపణలు చేశాడు. భారత్‌ను ఎలాగైనా సెమీస్‌లో ఆడించాలని ఐసీసీ కోరుకుందని, అందుకే పాక్‌, బంగ్లాదేశ్‌ జట్లతో జరిగిన మ్యాచుల్లో టీమ్‌ఇండియాకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించాడు.

"బంగ్లాదేశ్‌ - భారత్‌ మ్యాచ్‌ను ఓ సారి పరిశీలిస్తే.. వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్‌ చాలా చిత్తడిగా ఉంది. అయినప్పటికీ భారత్‌కు అనుకూలంగా ఐసీసీ వ్యవహరించింది. ఎలాగైనా భారత్‌ సెమీస్‌ చేర్చాలనేదే ఐసీసీ ఆలోచన. బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా వర్షం ఆగిపోగానే.. వెంటనే ప్రారంభించడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయి. ఐసీసీ, భారత్ ఆడటం, తీవ్ర ఒత్తిళ్లు రావడం.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే లిటన్‌ దాస్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బంగ్లాదేశ్ కానీ వికెట్లు కోల్పోకపోతే తప్పకుండా గెలుస్తుందని ఆరు ఓవర్ల తర్వాత మేమంతా భావించాం. అయితే పరిస్థితులు కలిసి రాలేదు. అయినా బంగ్లా చాలా బాగా పోరాడింది. అలాగే భారత్-పాక్‌ మ్యాచ్‌ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించినవారికి తప్పనిసరిగా ఉత్తమ అంపైరింగ్‌ అవార్డులు దక్కుతాయి." అని అఫ్రిది వ్యాఖ్యానించాడు. భారత్‌ తన చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడిస్తే.. ఎలాంటి సమీకరణాలతో అవసరం లేకుండా అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకొంటుంది.

ఇదీ చదవండి: కోహ్లీతో దాని గురించే చర్చించా: కేఎల్​ రాహుల్​

T20 World Cup : 6 మ్యాచ్​లు.. 4 బెర్త్​లు.. సెమీస్​ ఛాన్స్​ దక్కేదెవరికో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.