ETV Bharat / sports

Rahul Dravid Coach: టీమ్​ఇండియాకు అండగా 'ది వాల్'

author img

By

Published : Nov 4, 2021, 2:34 PM IST

rahul dravid
రాహుల్ ద్రవిడ్

మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరుగాంచిన రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid Coach News) టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, అంకితభావంతో శ్రద్ధగా నిర్వహించడం ద్రవిడ్‌ స్టైల్‌! వ్యక్తుల స్థాయిలో కన్నా వ్యవస్థీకృత మార్పులతో క్రికెట్‌ను బలోపేతం చేయడాన్ని ద్రవిడ్‌(Dravid Coaching Career) నమ్ముతాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ సీనియర్​ జట్టులో ఎలాంటి మార్పులు తీసుకురానున్నాడోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్‌లో కిక్రెట్‌ను ఒక మతంలా ఆరాధిస్తే.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. నిత్యం వారు ఏమి చేసినా సంచలనమే! కానీ, ఈ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, అంకితభావంతో శ్రద్ధగా నిర్వహించడం ద్రవిడ్‌(Rahul Dravid Coach) స్టైల్‌. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మెరుపులు ఎక్కడా కనిపించవు.. కానీ, అతని షాట్లకు నేలమీద చిమ్మిన నీటి వలే బంతి బౌండరీలైన్‌ దాటేస్తుంది. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు గోడలా నిలిచి ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడం అతనికే చెల్లింది. ఇన్నింగ్స్‌ ముగిశాక స్కోర్‌ బోర్డు చూస్తే.. సింగిల్స్‌-డబుల్స్‌తోనే ఇన్ని పరుగులు చేశాడా! అని నోరెళ్లబెట్టడం ప్రత్యర్థులవంతవుతుంది. ఏదో అంటుగడుతున్నట్లు శ్రద్ధగా క్రికెట్‌ టెక్ట్స్‌బుక్‌లోని అన్ని షాట్లూ ఆడగల సత్తా ద్రవిడ్‌(Dravid Coaching Career) సొంతం. రాహుల్‌ మైదానం వీడినా భారత క్రికెట్‌కు తన శక్తియుక్తులు ధారపోస్తున్నాడు. వ్యక్తుల స్థాయిలో కన్నా వ్యవస్థీకృత మార్పులతో క్రికెట్‌ను బలోపేతం చేయడాన్ని ద్రవిడ్‌ నమ్ముతాడు. తాజాగా సీనియర్‌ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం వల్ల.. భారత జట్టులో, జట్టు ఎంపికలో వ్యవస్థీకృత మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

వివిధ జట్లకు కోచ్‌గా ద్రవిడ్‌(Rahul Dravid India Coach News) ఇప్పటికే సత్తాచాటాడు. 2014 నుంచి రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అండర్‌-19, భారత్‌- ఏ జట్లకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న అతను.. యువ ఆటగాళ్లను సానబెట్టాడు. తన శిక్షణలో 2016 అండర్‌-19 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌.. 2018లో కప్పు అందుకుంది. ఆ సమయంలోనే సీనియర్‌ జట్టు కోచ్‌గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినా.. యువ ఆటగాళ్ల కోసం సున్నితంగా తిరస్కరించాడు. 2019 నుంచి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా పదవి చేపట్టి.. అక్కడికి వచ్చే భారత ఆటగాళ్లను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇటీవల టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక వెళ్లిన మరో భారత జట్టుకు ద్రవిడ్‌ తాత్కాలిక కోచ్‌గా పనిచేశాడు.

rahul dravid
రాహుల్ ద్రవిడ్

షాడో టూర్లతో..

భారత క్రికెట్‌ విజయాల్లో షాడో టూర్ల పాత్ర చాలా ఉంది. భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు ఏదైనా దేశంలో పర్యటించడానికి ముందు 'ఏ' టీమ్‌ అక్కడ సిరీస్‌ ఆడుతుంది. భారత సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యేందుకు సిద్ధంగా ఉన్న క్రీడాకారులు ఈ జట్టులో ఆడతారు. దీంతో వారు అక్కడి వాతావరణ పరిస్థితులకు, పిచ్‌లకు అలవాటు పడతారు. అంతేకాదు.. ప్రత్యర్థుల ఆటశైలిని ఆకళింపు చేసుకొంటారు. సీనియర్‌ జట్టులో ప్రవేశించాక.. ఆ దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఈ అనుభవం వారికి అక్కరకొస్తోంది. శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి వంటి క్రీడాకారులు ఇలానే సీనియర్‌ జట్టులోకి వచ్చారు. సీనియర్ల బృందానికి ఎంపికై తుదిజట్టులో ఆడకపోయినా.. బలమైన బ్యాకప్‌ క్రీడాకారుడిగా రిజర్వు బెంచ్‌లో ఉంటారు. అందుకే ఈ టూర్ల నిర్వహణకు రాహుల్‌ బలంగా మద్దతు ఇస్తాడు.

అండర్‌-19లో ఒక్కసారే అవకాశం

rahul dravid
టీమ్​ఇండియా సీనియర్​ జట్టు కోచ్​ బాధ్యతలు చేపట్టనున్న ద్రవిడ్

అండర్‌-19 వరల్డ్‌కప్‌ల విషయంలో ద్రవిడ్‌(Dravid Under 19 Coach) విప్లవాత్మక నిర్ణయం తీసుకొన్నాడు. ఏ క్రీడాకారుడైనా ఒక్కసారి అండర్‌-19 ప్రపంచ కప్‌కు వెళ్లే జట్టులో ఉంటే, మరోసారి అండర్‌-19లో పాల్గొనే అవకాశం అతనికి ఉండదు. ఈ విధంగా ద్రవిడ్‌ మార్పులు చేశాడు. దీంతో వయస్సుకు సంబంధించి తరచూ తలెత్తే వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. అంతేకాదు ఎక్కువ మంది క్రీడాకారులు అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఆడేందుకు అవకాశం లభించింది. ఈ విషయంపై ఓ సందర్భంలో ద్రవిడ్‌ మాట్లాడుతూ.. అండర్‌-19 స్థాయి క్రికెట్‌లో ఫలితం కోసం చూడకూడదు.. క్రీడాకారుల అభివృద్ధి గురించి చూడాలని వెల్లడించాడు.

ఆటగాళ్ల- కోచ్‌ బంధం బలోపేతం..!

ఆసీస్‌ మాజీ గ్రెగ్‌ ఛాపెల్‌ను కోచ్‌గా నియమించిన సమయంలో అంతర్గత విభేదాలు, ఇతర కారణాలతో భారత్‌ జట్టు నైతిక స్థైర్యం ఎంతగా దెబ్బతిన్నదో ప్రత్యక్షంగా చూశాం. క్రికెట్‌లో కోచ్‌, జట్టు సభ్యుల మధ్య సమన్వయ చాలా ముఖ్యమని ఛాపెల్‌ పర్వం చెబుతోంది. రాహుల్‌కు జట్టు సమన్వయం కొంత సులభమే కావచ్చు. తన శిక్షణలో రాటుదేలిన పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మహమ్మద్‌ సిరాజ్‌, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, అవేశ్‌ ఖాన్‌, కేఎస్‌ భరత్‌, అభిమన్యు ఈశ్వరన్‌, హనుమ విహారి వంటి వారు జట్టులో ఉన్నారు. వీరికి రాహుల్‌ శైలి ముందే తెలుసు.

ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రీడాకారులను అద్భుతంగా ప్రోత్సహిస్తాడనే పేరుంది. దీంతో ఆటగాళ్లు ఆయనతో సన్నిహితంగా ఉంటారు. ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ద్రవిడ్‌ మృదుస్వభావి కావడం.. టెస్టులు, వన్డేలు కలిపి 24వేలకు పైగా పరుగులు చేసిన రికార్డు ఉండటంతో జట్టులోని కోహ్లీ, రోహిత్‌ వంటి సీనియర్లు ఆయన సలహాలను నిర్లక్ష్యం చేసే సాహసం చేయరు. దీనికి తోడు ప్రతిభావంతులకు అండగా నిలవడంలో ద్రవిడ్‌కు మరెవరూ సాటిరారు. 41 ఏళ్ల ప్రవీణ్‌ తాంబే వంటి క్రీడాకారుడికి రాజస్థాన్‌ రాయల్స్‌లో అవకాశం ఇచ్చింది ద్రవిడే.

జట్టులో సీనియర్‌ క్రీడాకారులకు వారి లోపాలు, బలాలు బాగా తెలుసు. కానీ, జట్టు ఎంపిక నుంచి తుది 11 మంది కూర్పు వరకు వ్యూహరచనలో విషయంలో కోచ్‌ సహకారం చాలా అవసరం. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పనిచేయడంతో ఇప్పటికే ఆయన వద్ద టీమ్‌ఇండియా కోసం తగినంత సమాచారం ఉంది. ఇక భారత జట్టుకు 72 ఇన్నింగ్స్‌ల్లో వికెట్‌ కీపింగ్‌ చేసిన అనుభవం ద్రవిడ్‌కు ఉంది. ఇవన్నీ కోచ్‌గా అతడి వ్యూహరచనను బలోపేతం చేసే అంశాలే.

rahul dravid
అండర్-19 జట్టు కోచ్​గా ద్రవిడ్

ద్రవిడ్‌కు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని పట్టుండటం కలిసొచ్చే అంశం. వన్డే, టెస్టుల్లో రాహుల్‌ ఆట గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. రాజస్థాన్‌(కోచ్‌), దిల్లీ(మెంటార్‌) ఐపీఎల్‌ జట్లకు వ్యవహరించిన అనుభవం ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ వంటివారిని వెలుగులోకి తెచ్చింది రాహులే.

కఠిన సవాళ్లూ ఉన్నాయి..

  • ఆటగాళ్లలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించి భవిష్యత్తు కెప్టెన్లను తయారు చేయాల్సిన అవసరం ఉంది. విరాట్‌, రోహిత్‌కు తోడు కనీసం మరో ఇద్దరు చేరితే టీమ్‌ ఇండియాకు అత్యవసర సమయాల్లో నాయకత్వానికి కొరత ఉండదు. కె.ఎల్‌.రాహుల్‌, పంత్‌ వంటి ఆప్షన్లను ద్రవిడ్‌ ఉపయోగించుకోవచ్చు.
  • పాండ్యా వంటి సీమ్‌ బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్ల కొరత టీమ్‌ఇండియాలో కనిపిస్తోంది. దానిని భర్తీ చేయడంపై కూడా ద్రవిడ్‌ దృష్టిపెట్టాల్సి ఉంది.
  • వచ్చే రెండేళ్లలో టీ20 వరల్డ్‌ కప్‌(2022), వన్డే వరల్డ్‌ కప్‌ (2023)లను ఒడిసి పట్టడమే లక్ష్యంగా టీమ్‌ఇండియాను సిద్ధం చేయడం పెనుసవాల్‌. ఈ టోర్నీల కోసం కొత్తగా ప్రతిభావంతులను వెలికి తీసి అవకాశాలను కల్పించేలా భవిష్యత్తు సిరీస్‌లకు జట్టు కూర్పులను సిద్ధం చేసుకోవాలి.

ఇదీ చదవండి:

రెండు మ్యాచ్​ల్లో అందుకే ఓడిపోయాం: రోహిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.