ETV Bharat / sports

Rahane Pujara: దేశవాళీలో అదరగొడితేనే మళ్లీ టీమ్​ఇండియాలోకి​!

author img

By

Published : Feb 20, 2022, 3:12 PM IST

Rahane Pujara News: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సీనియర్​ ఆటగాళ్లు రహానె, పుజారాలపై బీసీసీఐ వేటు వేసింది. శ్రీలంకతో సిరీస్​కు వారిని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో వారు మళ్లీ జట్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉందా లేక ఇక్కడితో వారి కెరీర్​ ముగిసిందా అని అభిమానుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఫామ్​ అందుకుంటే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

pujara rahane
పుజారా రహానే

Rahane Pujara News: అప్పట్లో టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు రాహుల్ ద్రవిడ్-వీవీఎస్‌ లక్ష్మణ్ కీలక ప్లేయర్లు.. వారు రిటైర్‌మెంట్ తీసుకున్నాక ఆ స్థానాలను ఛెతేశ్వర్‌ పుజారా-అజింక్య రహానె భర్తీ చేశారు. మరీ ముఖ్యంగా ఛెతేశ్వర్‌ పుజారా టెస్టు స్పెషలిస్ట్‌గా మారాడు. 'నయా వాల్‌' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. అయితే గత రెండు మూడేళ్లుగా వీరిద్దరి ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో త్వరలో జరిగే శ్రీలంక సిరీస్‌కు కూడా జట్టులో స్థానం దక్కలేదు. ఇలానే ఉంటే భవిష్యత్తులోనూ చోటు దక్కడం గగనమే. పుజారా-రహానె ద్వయం పరిస్థితి గురించి ప్రత్యేక కథనం..

మూడేళ్లు.. చెరొక సెంచరీ

ఆస్ట్రేలియాతో 2020-21 సీజన్‌లో టీమ్‌ఇండియా నాలుగు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. మొన్నటి వరకు టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అజింక్య రహానె చివరిసారిగా శతకం చేసింది కూడానూ ఇదే సిరీస్‌లో కావడం గమనార్హం. అయితే కోహ్లీ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన రహానె సిరీస్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఈ పర్యటనలో అర్ధశతకాలను సాధించగలిన ఛెతేశ్వర్ పుజారా... వాటిని సెంచరీలుగా మార్చుకోలేకపోయాడు. అంతకుముందు న్యూజిలాండ్‌ పర్యటనలోనూ ఫామ్‌పరంగా పెద్ద మార్పులేమీ లేవు. టెస్టుల్లో వీరు శతకం చేసి దాదాపు మూడేళ్లు కావొస్తోంది.

అవకాశాలు కోకొల్లలు..

ఇటీవల కాలంలో టెస్టు జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రమైంది. యువ ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత మూడేళ్లలో 30 టెస్టుల వరకు టీమ్‌ఇండియా ఆడింది. ప్రతి మ్యాచ్‌లోనూ వీరిద్దరికీ అవకాశం కల్పించింది. అయినప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. మరోవైపు అరంగేట్ర టెస్టులోనే శ్రేయస్‌ అయ్యర్‌ శతకం సాధించగా.. మయాంక్‌ అగర్వాల్, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు కాచుకుని ఉన్నారు. ఇప్పటికే అనేక అవకాశాలను దక్కించుకున్న రహానె-పుజారా రాణించలేకపోయారు. దీంతో వారిద్దరిపై శ్రీలంకతో సిరీస్‌లకు వేటు పడక తప్పలేదు.

దేశవాళీలో అదరగొడుతున్న రహానె

అనవసర షాట్లు ఆడకుండా క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు మాజీలు రహానె, పుజారాలకు సూచించారు. దాని కోసం దేశవాళీ టోర్నీల్లో ఆడాలని గావస్కర్‌, గంగూలీ సలహా ఇచ్చారు. ప్రస్తుతం ముంబయి జట్టుకు రహానె, సౌరాష్ట్ర తరఫున పుజారా ఆడుతున్నారు. అయితే రహానె వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని సెంచరీతో ఫామ్‌ను అందుకోగా.. పుజారా అదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ డకౌట్‌గా వెనుదిరిగాడు. దేశవాళీ టోర్నీల్లో వీలైనన్ని భారీగా పరుగులు సాధిస్తే వచ్చే జులైలో ఇంగ్లాండ్‌తో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టుకు జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటన తర్వాత దాదాపు నాలుగు నెలలపాటు టీమ్ఇండియా టెస్టులు ఆడే పరిస్థితి లేదు. అందుకే రహానె-పుజారాకు బోలెడంత సమయం ఉంది. ఈలోపు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే ఫామ్‌ను అందిపుచ్చుకుంటే టీమ్‌ఇండియా తలుపులు తెరుచుకుని ఉంటాయి. లేకపోతే యువకుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోక తప్పదు.

ఇదీ చూడండి : శ్రీలంకతో టెస్టు సిరీస్​.. ఎవరీ సౌరభ్​కుమార్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.