ETV Bharat / sports

డికాక్​ క్షమాపణలు.. తర్వాతి మ్యాచ్​లకు అందుబాటులోకి

author img

By

Published : Oct 28, 2021, 2:20 PM IST

Updated : Oct 28, 2021, 5:01 PM IST

దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​, బ్యాటర్​ క్వింటన్​ డికాక్.. వెస్టిండీస్​తో మ్యాచ్​ నుంచి తాను ఎందుకు తప్పుకున్నాడో క్లారిటీ ఇచ్చాడు​. తాను అలా చేసినందుకు సహ ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ప్రపంచకప్​లోని తర్వాతి మ్యాచ్​లకు అతడు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

de kock
డికాక్​

వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​ నుంచి తాను తప్పుకోవడంపై వివరణ ఇచ్చాడు దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​, బ్యాటర్​ క్వింటన్​ డికాక్​. తాను అలా చేసినందుకు సహ ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

ప్రతి మ్యాచ్​ ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని బ్లాక్​ లైవ్స్ మ్యాటర్​కు(Black Lives Matter) సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డికాక్​.. మోకాళ్లపై కూర్చోవడం ఇష్టం లేక మ్యాచ్​ నుంచి తప్పుకొన్నాడు! దీంతో అతడి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు వివరణ ఇచ్చాడు.

"నేను జట్టు ఆటగాళ్లకు, దేశ ప్రజలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడూ నా పేరు వివాదాస్పదం అవ్వాలనుకోలేదు. జాత్యాహంకార విషయాలకు వ్యతిరేకంగా నిలబడటం ఎంత అవసరమో నేను అర్థం చేసుకుంటాను. అలాగే ఆటగాళ్లుగా ఇది మా బాధ్యత అని కూడా తెలుసు. నేను మోకాళ్లపై నిల్చొని ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడం ద్వారా ప్రజల జీవితాలు మెరుగవుతాయంటే.. అంతకుమించిన సంతోషం మరొకటి లేదు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆడకపోవడం ద్వారా నేనెవర్నీ కించపర్చాలనుకోలేదు. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లను కూడా. అయితే, మాకు ఈ ఆదేశాలు మంగళవారం ఉదయమే హఠాత్తుగా చెప్పడంతో గందరగోళపరిస్థితులు నెలకొన్నాయి. అది కొందరు అర్థం చేసుకోలేకపోయారు. నా చర్యతో ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే నన్ను క్షమించండి. ఇప్పటివరకూ ఈ విషయంపై మౌనంగా ఉన్నా. కానీ, నా బాధేంటో మీతో పంచుకోవాలని మీముందుకు వచ్చా" అని డికాక్‌ తెలిపాడు.

"అలాగే కొంతమందికి నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చానో కూడా తెలియదు. మాది రెండు వర్ణాలు కలగలిసిన కుటుంబం. అలాంటప్పుడు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అనేది నాకు పుట్టినప్పటి నుంచీ ఉన్న విషయమే. ఏ ఒక్కరి వ్యక్తిగత హక్కులకన్నా ప్రజలందరి హక్కులు, సమానత్వమే ముఖ్యమైన విషయం. నేను చిన్నప్పటి నుంచీ ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని, అవి ముఖ్యమైనవనే నమ్మకంతో పెరిగాను. అందువల్లే వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మాకు అలా మోకాళ్లపై నిల్చొని సంఘీభావం తెలపాలని కచ్చితంగా చెప్పినప్పుడు నా హక్కులు పోయినట్టు భావించాను. ఈ క్రమంలోనే గతరాత్రి జట్టు యాజమాన్యంతో సమావేశమైనప్పుడు వాళ్ల మనోభావాలు ఏంటో అర్థమయ్యాయి. ఈ విషయం మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కాకుండా అంతకుముందే చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు. ఇప్పుడు నేను 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌'కు పూర్తి మద్దతు తెలిపి ఆదర్శంగా నిలవాలని నాకు తెలుసు. అయితే, ఈ ఉద్యమానికి సంబంధించి మాకు ఇంతకుముందు ఇష్టమైన విధంగా సంఘీభావం తెలపొచ్చనే సందేశం ఇచ్చారు. నేను దేశం తరఫున ఆడటం గర్వంగా భావిస్తాను. ఒకవేళ నేను రేసిస్ట్‌ అయితే, నాకు ఇష్టం లేకున్నా మోకాళ్లపై నిల్చొని మోసపూరితంగా ఆ ఉద్యమానికి చేటు చేసేవాడిని. అలా చేయడం తప్పు. కానీ, నేను అలా చేయలేదు. నేను ఎలాంటి వాడినో నాతో కలిసి ఆడినవారికి తెలుసు" అని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ వాపోయాడు.

"అలాగే ఒక ఆటగాడిగా నన్ను చాలా మాటలు అన్నారు. అవన్నీ ఎప్పుడూ బాధపెట్టలేదు. కానీ, ఇప్పుడు అపార్ధంతో జరిగిన ఈ సంఘటన వల్ల 'రేసిస్ట్‌' అనే ముద్ర వేశారు. అది నన్ను ఎంతగానో కలచివేసింది. ఇది నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా బాధ పెట్టింది. నేను జాత్యహంకారిని కాదు. ఆ విషయం నా మనస్సాక్షికి, నాతో ఆడిన ఆటగాళ్లకు తెలుసు. నా మాటలు అంత ప్రభావవంతంగా ఉండవని తెలుసు కానీ, నా ఉద్దేశం ఏమిటో మీకు చెప్పాలని ప్రయత్నించాను. మీ అందరికీ మరోసారి క్షమాపణలు చెబుతున్నా" అని డికాక్‌ విచారం వ్యక్తం చేశాడు.

అక్టోబర్​ 30న షార్జా వేదికగా శ్రీలంకతో.. దక్షిణాఫ్రికా తన తర్వాతి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: డికాక్​ నిర్ణయం వ్యక్తిగతం: క్రికెట్ సౌతాఫ్రికా

Last Updated :Oct 28, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.