ETV Bharat / sports

తెలుగు తేజాలు నిఖత్​ జరీన్​, శ్రీజకు అర్జున.. ప్రకటించిన కేంద్రం

author img

By

Published : Nov 15, 2022, 7:00 AM IST

తెలంగాణ యువ అథెట్లు నిఖత్​ జరీన్​, ఆకుల శ్రీజకు ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారం లభించింది. 2022కు గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం 25 మంది అథ్లెట్లతో ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో బాక్సర్‌ నిఖత్‌, టీటీ క్రీడాకారిణి శ్రీజకు చోటు దక్కింది.

nikhath zareen and srija
నిఖత్​ జరీన్​ ఆకుల శ్రీజ

అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తోన్న తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ ప్రతిభకు గుర్తింపు లభించింది. ప్రపంచ వేదికలపై పతకాలు సాధించిన ఈ అమ్మాయిల ఖాతాలో ఇప్పుడు ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారం చేరింది. 2022కి గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం 25 మంది అథ్లెట్లతో ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో బాక్సర్‌ నిఖత్‌, టీటీ క్రీడాకారిణి శ్రీజకు చోటు దక్కింది. 26 ఏళ్ల నిజామాబాద్‌ బాక్సర్‌ నిఖత్‌ ఈ ఏడాది 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. ఆ ఘనత సాధించిన భారత అయిదో మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించింది.

అదే దూకుడు కొనసాగించిన ఆమె కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పసిడి పంచ్‌ విసిరింది. 2011లో ఆమె జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ గెలిచింది. ఇప్పుడు దక్షిణ భారత్‌లోనే అర్జున అవార్డుకు ఎంపికైన తొలి మహిళా బాక్సర్‌గా నిలిచింది. మరోవైపు టేబుల్‌ టెన్నిస్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీజ అదరగొడుతోంది. కామన్వెల్త్‌ క్రీడల మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ కమల్‌తో కలిసి ఆమె స్వర్ణాన్ని ముద్దాడింది. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి మహిళా టీటీ క్రీడాకారిణి ఆమెనే కావడం విశేషం. 24 ఏళ్ల శ్రీజ 2019 దక్షిణాసియా క్రీడల మహిళల డబుల్స్‌, మహిళల టీమ్‌ విభాగాల్లో బంగారు పతకాలు కైవసం చేసుకుంది.

బ్యాడ్మింటన్‌ స్టార్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌ కూడా అర్జున దక్కించుకున్నారు. టీనేజీ చెస్‌ సంచలనం ప్రజ్ఞానందనూ పురస్కారం వరించింది. కోచ్‌లు జీవన్‌జోత్‌ సింగ్‌ (ఆర్చరీ), మహమ్మద్‌ అలీ ఖమర్‌ (బాక్సింగ్‌), సుమ సిద్ధార్థ్‌ (పారా షూటింగ్‌), సుజీత్‌ మాన్‌ (రెజ్లింగ్‌) ద్రోణాచార్య అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు అందజేస్తారు.

ఒకే ఒక్కడు..: దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు ఈ సారి టీటీ దిగ్గజం శరత్‌ కమల్‌ను వరించింది. గతేడాది 12 మందికి ఈ అవార్డు దక్కగా.. ఈ సారి ఒక్కరికే పురస్కారం వచ్చింది. అత్యధిక (10) సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించిన శరత్‌.. కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు నెగ్గాడు. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నాడు.

40 ఏళ్ల ఈ ఆటగాడు ఈ ఏడాది కామన్వెల్‌ క్రీడల్లో మూడు స్వర్ణాలు (పురుషుల సింగిల్స్‌, టీమ్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌), ఓ రజతం (పురుషుల డబుల్స్‌) కైవసం చేసుకోవడం విశేషం. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో అతను నాలుగు ఒలింపిక్స్‌ (2004, 2008, 2016, 2020)ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 2004లో అర్జున అవార్డు అందుకున్న అతను.. 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి: అది కోహ్లీ, సూర్య రేంజ్​.. అత్యంత విలువైన జాబితాలో చోటు!

సరికొత్త లుక్స్​లో తారలు ఎవరబ్బా ఆ హెయిర్ స్టైలిష్ట్ భలే ముస్తాబు చేస్తున్నాడుగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.