ETV Bharat / sports

అన్నకు తగ్గ తమ్ముడు - రంజీలో రాణిస్తున్న షమీ సోదరుడు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 5:57 PM IST

Updated : Jan 6, 2024, 6:50 PM IST

Mohammed Shami Brother : మహమ్మద్‌ షమీ కుటుంబం నుంచి మరో పేసర్‌ దూసుకొస్తున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. ఇంతకీ అతను ఎవరంటే ?

Mohammed Shami Brother
Mohammed Shami Brother

Mohammed Shami Brother : వరల్డ్​ కప్​లో అత్యుత్తమ ఫామ్​ కనబరిచి అందరికీ హీరోగా మారిపోయాడు టీమ్‌ఇండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ. భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్లేయర్​ ఆట తీరును అందరూ కొనియాడారు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా అతడు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షమీ బాటలోనే అతడి కుటుంబం నుంచి మరో పేసర్‌ మైదానంలోకి దిగుతున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. బెంగాల్‌ తరపున రంజీ అరంగేట్రం చేసిన ఈ యువ కెరటం మరెవరో కాదు. షమీ సోదరుడు కైఫ్‌.

షమీ లాగే కైఫ్‌కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఫామ్​లో సాగుతుండటం చూసిన కైఫ్​ స్ఫూర్తి పొందాడు. అలా టీమ్‌ఇండియాకు ఆడాలనే లక్ష్యంతో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.

ఇక కైఫ్​ ఇప్పటివరకూ తొమ్మిది లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో పుట్టిన ఈ స్టార్​ ప్లేయర్​ 2021లో జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్‌ తరఫున లిస్ట్‌- ఎ తో క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విజయ్‌ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. గోవాపై మూడు వికెట్లను సాధించాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై కూడా రెండు వికెట్ల చొప్పున పడగొట్టాడు.

2021 బెంగాల్‌ టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో ఖరగ్‌పూర్‌ బ్లాస్టర్స్‌ తరపున ఆడిన కైఫ్​ 25.85 సగటుతో 7 వికెట్లతో రాణించాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. కానీ ఇప్పుడు రంజీ అరంగేట్రంతో అతని కెరీర్‌ పుంజుకునే అవకాశముంది. గురువారం విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఆంధ్రాతో ఆరంభమైన రంజీ మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో కైఫ్‌ అడుగుపెట్టాడు.

టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే కైఫ్‌ కల నెరవేరే దిశగా షమీ అండగా నిలుస్తున్నాడు. కలిసి సాధన చేయడంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలిస్తూ తమ్ముడి బౌలింగ్‌ మెరుగవడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సోదరులు ఇద్దరు కలిసి స్వగ్రామంలో ప్రాక్టీస్‌ చేశారు. దీంతో ప్రపంచ స్థాయి పేసర్‌గా ఎదిగిన అన్నతో కలిసి సాధన చేయడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది.

100% కష్టపడ్డాం- ఏం తప్పు చేశామో ఇప్పటికీ తెలియట్లేదు: షమీ

బుమ్రా, షమీ తర్వాత ఎవరు?- వారిపై దృష్టి పెట్టాల్సిందే!

Last Updated :Jan 6, 2024, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.