ETV Bharat / sports

గందరగోళంలో అఫ్గాన్​ క్రికెట్.. భవిష్యత్ ఏంటో?

author img

By

Published : Aug 21, 2021, 7:03 AM IST

టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ జట్టుది ఏడో స్థానం. శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఆ జట్టు కంటే కిందే. టీ20లో వరుసగా 12 విజయాలు సాధించిన ఏకైక జట్టు అదే. పొట్టి క్రికెట్లో అత్యధిక స్కోరు (278/3) ఘనత వాళ్లదే. వన్డే ఆల్‌రౌండర్లలో 2, 4 స్థానాలు వారివే. టీ20 బౌలింగ్‌లో 3, 5 ర్యాంకులు వారి సొంతమే. పై గణాంకాల ప్రకారం ఇదేదో అగ్రశ్రేణి జట్టు అనుకోవచ్చు. కానీ ఈ ఘనతలు అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్ల సొంతం. ఇంత ప్రతిభ ఉన్న క్రికెటర్ల భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది.

Is cricket on safe ground in Afghanistan?
అఫ్గానిస్థాన్ క్రికెట్

అఫ్గాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్లా మజారీతో కలిసి కాబూల్‌లోని అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) (Afghanistan Cricket Board) కేంద్ర కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. దేశంలోని అన్ని క్రికెట్‌ మైదానాలపై తాలిబన్ల నియంత్రణ.. లండన్‌ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏసీబీ ఛైర్మన్‌ ఫర్హాన్‌ యూసుఫ్‌జాయ్‌.. తమ కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళనలో ఆటగాళ్లు.. ఇదీ ప్రస్తుతం అఫ్గాన్‌ క్రికెట్‌, ఆటగాళ్ల పరిస్థితి. స్టార్‌ ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, ముజీబుర్‌ రహమాన్‌, మహ్మద్‌ నబి ఇంగ్లాండ్‌లో 'హండ్రెడ్‌' టోర్నీ ఆడుతున్నారు. మిగతా జట్టు సభ్యులంతా కాబూల్‌లోనే ఉండటం క్రికెట్‌ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. "నా దేశం గందరగోళంలో ఉంది. పిల్లలు, మహిళలతో సహా వేలాదిగా అమాయక ప్రజలు నిత్యం బలవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అఫ్గాన్లను చంపొద్దు" అంటూ ట్విటర్‌ వేదికగా రషీద్‌ఖాన్‌ భయాందోళనను వ్యక్తం చేశాడు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్నాహాలపై దృష్టిసారించాల్సిన అఫ్గాన్‌ ఆటగాళ్లు భయం గుప్పిట బతుకుతుండటం ఆందోళన కలిగించేదే.

మునుపటిలా ఆడగలరా?

అఫ్గాన్‌లో తాజా పరిణామాలు పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పైనా ప్రభావం చూపేలా ఉన్నాయి. సెప్టెంబరులో శ్రీలంకలో పాక్‌తో అఫ్గాన్‌ మూడు వన్డేలు ఆడనుంది. టీ20 ప్రంపచకప్‌ అనంతరం నవంబరులో అఫ్గాన్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అఫ్గాన్‌ అంతర్యుద్ధం నుంచి బతికి బట్టకడితే చాలనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు క్రికెట్‌పై ఏ మేరకు ధ్యాస పెడతారన్నది అసలు ప్రశ్న. "తాలిబన్లకు క్రికెట్‌ అంటే ఇష్టం. మొదట్నుంచీ క్రికెట్‌కు మద్దతు ఇచ్చారు. క్రికెట్‌ కార్యకలాపాల్లో వాళ్లు జోక్యం చేసుకోరు. తాలిబన్ల కాలంలో క్రికెట్‌ అభివృద్ధి చెందింది. అఫ్గాన్‌ ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు కాబూల్‌లో సురక్షితంగా ఉన్నారు" అంటూ అఫ్గాన్‌ బోర్డు సీఈఓ హమీద్‌ షిన్వారి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మాటలు ఆటగాళ్లలో ధైర్యం నింపట్లేదు. స్వదేశంలో పరిస్థితులపై ప్రతి రోజూ రషీద్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు ఏసీబీ ఛైర్మన్‌ యూసుఫ్‌జాయ్‌ లండన్‌లో తలదాచుకుంటున్నాడు. ఆటపై ఏమాత్రం అవగాహన లేనివాళ్లతో క్రికెట్‌ పరిపాలన సాగిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2010 తర్వాత మొదలైన దేశవాళీ వ్యవస్థను గత ఏడాది నుంచి గాలికొదిలేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గాన్‌ క్రికెటర్లు ఆటపై దృష్టిసారించడం సాధ్యమేనా? కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన చెందుతూ మ్యాచ్‌లపై ఏకాగ్రత నిలపగలరా? మునుపటిలా క్రికెట్‌ ఆడగలరా? అన్నవి జవాబు లేని ప్రశ్నలే!

సొంతగడ్డ భారత్‌..

1995లో ఏర్పాటైన ఏసీబీకి క్రికెట్లో పెద్ద దిక్కు బీసీసీఐనే. 2001లో ఐసీసీ అనుబంధ సభ్యత్వం సంపాదించిన అఫ్గాన్‌.. 2003లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌లో చోటు దక్కించుకుంది. 2017 జూన్‌లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం, టెస్టు హోదా లభించాయి. 1996-2001 వరకు తాలిబన్ల పాలన కొనసాగగా.. అనంతరం అఫ్గాన్‌ దేశ పునర్నిర్మాణంలో భారత్‌ భాగమైంది. క్రికెట్‌ బాధ్యతల్ని బీసీసీఐ భుజాన వేసుకుంది. అఫ్గాన్‌లో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తోంది. ఆ దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ మౌలిక వసతులు ఏర్పాటయ్యేంత వరకు భారత్‌ను అఫ్గాన్‌ సొంతగడ్డగా మార్చుకుంది. 2010-2016 వరకు షార్జా క్రికెట్‌ స్టేడియంలో కార్యకలాపాలు కొనసాగించిన అఫ్గాన్‌.. 2017 నుంచి భారత్‌కు తరలివచ్చింది. గ్రేటర్‌ నోయిడాలో, దేహ్రాదూన్‌లో మ్యాచ్‌లు ఆడింది. 2019లో కొత్త వేదిక కావాలని అఫ్గాన్‌ అడగడం వల్ల లఖ్‌నవూలోని వాజ్‌పేయి క్రికెట్‌ స్టేడియాన్ని బీసీసీఐ కేటాయించింది. 2019లో అఫ్గాన్‌ ఆతిథ్యమిచ్చిన రెండు టెస్టులు భారత్‌లోనే (దేహ్రాదూన్, లఖ్‌నవూ) జరిగాయి.

ఇదీ చదవండి: కప్పే లక్ష్యంగా.. బీసీసీఐ పెద్దలతో కెప్టెన్‌ కోహ్లీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.