ETV Bharat / sports

ప్రపంచకప్ లక్ష్యంగా.. బీసీసీఐ పెద్దలతో కెప్టెన్‌ కోహ్లీ!

author img

By

Published : Aug 21, 2021, 6:03 AM IST

Updated : Aug 21, 2021, 6:56 AM IST

త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్​ గెలవడమే లక్ష్యంగా కోహ్లీ.. బీసీసీఐ పెద్దలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జేషా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలిసింది.

kohli
కోహ్లీ, విరాట్

లండన్‌లో రెండో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జేషా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలిసింది. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌పైనే వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా లక్ష్యం ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ గెలవడమే అయినా అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్‌ కూడా కోహ్లీ కెప్టెన్సీకి ఎంతో కీలకం. ఇప్పటికే అతడి సారథ్యంలో టీమ్‌ఇండియా 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోల్పోయిన నేపథ్యంలో రాబోయే ఐసీసీ ట్రోఫీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు జట్టు సారథిని కలిశారని బోర్డు సభ్యుడొకరు పీటీఐకు చెప్పారు.

ఈ సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు చెప్పడం మంచిది కాదంటూనే ఐపీఎల్ తర్వాత భారత్‌ ఆడాల్సింది టీ20 ప్రపంచకప్పే అయినందున దాని గురించే చర్చించి ఉంటారని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా, వచ్చేనెలలో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేయకముందు కొన్ని ప్రధాన విషయాలపై అటు సెలెక్టర్లు, ఇటు జట్టు యాజమాన్యం దృష్టిసారించాల్సి ఉంది. పొట్టి క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లను కూడా సవాలు చేసే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏయే ఆటగాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి విశ్లేషిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాంత్‌, ఉమేశ్‌ను పొట్టి కప్పుకు ఎంపిక చేసే వీలులేదు. ఇక పోతే బుమ్రా, షమి ఐపీఎల్‌లో ఆడుతుండటంతో వారి పనిభారాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మరోవైపు సిరాజ్‌ టెస్టు క్రికెట్‌లో రాణిస్తున్నా అతడిని టీ20 ఫార్మాట్‌కు ఎంపిక చేస్తారా అనేది కీలకంకానుంది.

మరోవైపు దీపక్‌చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ సైతం బుమ్రా, షమికి తోడుగా ఉంటారు. దాంతో పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ఈ నలుగురూ సరిపోయే అవకాశం ఉంది. మణికట్టు స్పిన్నర్ల జాబితాలో రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌కు తోడు రాహుల్‌ చాహర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తాడా లేదా అంచనా వేయాలి. ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లో ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ త్వరలో సమావేశమౌతారని బీసీసీఐ భావిస్తోంది. ఏదేమైనా టీమ్‌ఇండియా ఈసారి కచ్చితంగా ప్రపంచకప్‌ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 2013లో చివరిసారి ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన భారత జట్టు ఇప్పటివరకూ మరో ఐసీసీ ట్రోఫీ ముద్దాడలేదు.

ఇదీ చదవండి:'నిలకడతో పాటు వేగంగా ఆడితే విజయం మాదే'

Last Updated : Aug 21, 2021, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.