ETV Bharat / sports

IPL 2022: తెవాతియా మాయ.. ఉత్కంఠ పోరులో గుజరాత్​ విజయం

author img

By

Published : Apr 8, 2022, 11:34 PM IST

Updated : Apr 9, 2022, 6:37 AM IST

IPL 2022
PUNJAB KINGS VS GUJARAT TITANS

IPL 2022 GT VS PBKS: 190 పరుగుల లక్ష్యం.. గుజరాత్‌ విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం. ఒడియన్‌ స్మిత్‌ చేతిలో బంతి. తొలి బంతికే హార్దిక్‌ రనౌట్‌. నాలుగు బంతుల్లో 7 పరుగులే వచ్చాయి. ఆఖరి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొడితే తప్ప గుజరాత్‌ గెలవదు. మ్యాచ్‌ పంజాబ్‌ సొంతమైనట్లే అని అంతా ఓ అంచనాకు వచ్చేశారు. కానీ తీవ్ర ఒత్తిడిలో తెవాతియా అద్భుతమే చేశాడు. రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి గుజరాత్‌కు సంచలన విజయాన్నందించాడు.

IPL 2022 GT VS PBKS: గుజరాత్‌ అజేయ జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం చివరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫామ్‌ కొనసాగిస్తూ లివింగ్‌స్టోన్‌ (64; 27 బంతుల్లో 7×4, 4×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో వరుసగా రెండో అర్ధశతకంతో సత్తాచాటాడు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (3/22) మరోసారి తన విలువ చాటిచెప్పాడు.అరంగేట్ర పేసర్‌ దర్శన్‌ నాల్కండే (2/37) కూడా ఆకట్టుకున్నాడు. ఛేదనలో గుజరాత్‌ 4 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (96; 59 బంతుల్లో 11×4, 1×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. రాహుల్‌ తెవాతియా (13 నాటౌట్‌; 3 బంతుల్లో 2×6) జట్టును విజయతీరాలకు చేర్చాడు. రబాడ (2/35) మెరిశాడు.

ఆహా గిల్‌.. అదరహో తెవాతియా: తన క్లాస్‌ షాట్లతో గిల్‌ ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ సాగడంతో ఛేదనను గుజరాత్‌ దూకుడుగా మొదలెట్టింది. మరో ఓపెనర్‌ వేడ్‌ (6)ను రబాడ వెనక్కి పంపినప్పటికీ.. ఐపీఎల్‌ అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌ (35)తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. 20 ఏళ్ల సుదర్శన కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాడు. చాహర్‌ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్‌పై కళ్లుచెదిరే సిక్సర్‌ కొట్టాడు. దీంతో 7 ఓవర్లకు స్కోరు 66/1. తన బౌలింగ్‌లోనే గిల్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను స్మిత్‌ పట్టుకోలేకపోవడం పంజాబ్‌పై ప్రభావం చూపింది. ఓ చూడముచ్చటైన ఫోర్‌తో అర్ధశతకం అందుకున్న గిల్‌ తన దాడి కొనసాగించాడు. మరో ఎండ్‌లో కచ్చితమైన టైమింగ్‌తో చక్కని కవర్‌డ్రైవ్‌లతో సుదర్శన్‌ జోరు ప్రదర్శించాడు. ఏ దశలోనూ స్కోరు వేగం తగ్గకుండా వీళ్లు జాగ్రత్తపడ్డారు. 11 ఓవర్లలోనే స్కోరు 100 దాటింది. ఫీల్డర్ల మధ్య ఖాళీల నుంచి ఫోర్లు రాబట్టిన గిల్‌ బ్యాటింగ్‌ సొగసు చూడాల్సిందే. వికెట్‌ కోసం నిరీక్షిస్తున్న ప్రత్యర్థి బౌలర్లకు మరింత చిరాకు కలిగిస్తూ ఈ జోడీ జట్టును లక్ష్యం దిశగా నడిపింది. కానీ కీలక సమయంలో సుదర్శన్‌ను ఔట్‌ చేసిన చాహర్‌ 101 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు.

చివరి అయిదు ఓవర్లలో గుజరాత్‌ విజయానికి 56 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్‌ ఎటు మలుపు తిరుగుతుందోననే ఆసక్తి కలిగింది. ఆఖర్లో అర్షదీప్‌ గొప్పగా బౌలింగ్‌ చేశాడు. 16వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ పెరిగింది. ఆ దశలో చాహర్‌ బౌలింగ్‌లో గిల్‌ను స్టంపౌట్‌ చేసే అవకాశాన్ని వికెట్‌కీపర్‌ వదిలేశాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టిన హార్దిక్‌ క్యాచ్‌ను రబాడ అందుకోలేకపోయాడు. 18వ ఓవర్లో అర్ష్‌దీప్‌ 5 పరుగులే ఇవ్వడంతో విజయ సమీకరణం రెండు ఓవర్లలో 32 పరుగులుగా మారింది. రబాడ వేసిన 19వ ఓవర్లో హార్దిక్‌ రెండు ఫోర్లు కొట్టినా గిల్‌ ఔటవడంతో దెబ్బ పడింది. చివరి ఓవర్లో గుజరాత్‌కు 19 పరుగులు కావాల్సి వచ్చింది. స్మిత్‌ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లో రెండు పరుగులే రావడంతో పాటు హార్దిక్‌ పెవిలియన్‌ చేరాడు. చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లతో గెలిపించిన తెవాతియా హీరోగా నిలిచాడు.

లివింగ్‌స్టోన్‌ మళ్లీ..: పంజాబ్‌కు ఆశించిన ఆరంభం, ముగింపు దక్కలేదనే చెప్పాలి. లివింగ్‌స్టోన్‌ విధ్వంసంతో భారీ స్కోరు దిశగా సాగిన పంజాబ్‌ను రషీద్‌ దెబ్బకొట్టాడు. అంతకుముందు తొలి పవర్‌ప్లేలోనే.. కెప్టెన్‌ మయాంక్‌ (5)తో పాటు పంజాబ్‌ తరపున అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో (8) వికెట్లు తీసి గుజరాత్‌ దెబ్బకొట్టింది. ఆ ప్రభావం జట్టుపై పడకుండా ధావన్‌ (35), లివింగ్‌స్టోన్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు. రషీద్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నప్పటికీ తనను తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌కు తాకడంతో బతికిపోయిన లివింగ్‌స్టోన్‌ తర్వాత మరింత చెలరేగాడు. దర్శన్‌ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌, రెండు ఫోర్లు రాబట్టాడు. స్కూప్‌ షాట్‌తో అతను కొట్టిన సిక్సర్‌ హైలైట్‌గా నిలిచింది. 10 ఓవర్లకు స్కోరు 86/2. ఆ వెంటనే ధావన్‌ను రషీద్‌ ఔట్‌ చేసినా.. గుజరాత్‌కు ఆ ఆనందాన్ని మిగల్చకుండా క్రీజులోకి వచ్చిన జితేశ్‌ (23) భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. తెవాతియా (0/24) ఓవర్లో ఓ ఫోర్‌, రెండు సిక్సర్లు బాదాడు. మోకాలిపై కూర్చుని ఓ బంతిని అమాంతం స్టాండ్స్‌లో పడేశాడు. అదే ఓవర్‌ చివరి బంతికి సిక్సర్‌తో లివింగ్‌స్టోన్‌ 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ దశలో వరుస బంతుల్లో వికెట్లతో దర్శన్‌ గుజరాత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. స్లో డెలివరీతో జితేశ్‌ కథ ముగించిన అతను.. నకుల్‌ బంతితో స్మిత్‌ (0)ను ఖాతా తెరవనీయలేదు. వికెట్లు పడ్డా లివింగ్‌స్టోన్‌ బౌండరీల వేట ఆగలేదు. షమి (1/36) ఓవర్లో షారుక్‌ (15) వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో 15 ఓవర్లకు జట్టు 152/5తో నిలిచింది. 220కి పైగా స్కోరుపై పంజాబ్‌ కన్నేసిన సమయమది. కానీ తర్వాతి ఓవర్లోనే రషీద్‌ వైవిధ్యమైన లెగ్‌స్పిన్‌తో కథ మొత్తం మార్చేశాడు. ఒకే ఓవర్లో లివింగ్‌స్టోన్‌, షారుక్‌ను పెవిలియన్‌ చేర్చి ప్రత్యర్థికి షాకిచ్చాడు. వెంటనే రబాడ (1) కూడా రనౌటైపోయాడు. హార్దిక్‌ వేసిన చివరి ఓవర్లో రాహుల్‌ చాహర్‌ (22 నాటౌట్‌) ఓ సిక్సర్‌, ఫోర్‌ కొట్టడంతో స్కోరు 190కి చేరువగా వెళ్లింది.

ఇదీ చదవండి: మయాంక్.. నువ్వు కెప్టెన్‌వనే విషయం మర్చిపో: సెహ్వాగ్

Last Updated :Apr 9, 2022, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.