ETV Bharat / sports

కెప్టెన్​గా తొలి విజయం.. ఆమెకే అంకితం: జడ్డూ

author img

By

Published : Apr 13, 2022, 10:00 AM IST

Updated : Apr 13, 2022, 11:53 AM IST

Jadeja
రవీంద్ర జడేజా

IPL RCB vs CSK: తాను కెప్టెన్​గా ఇంకా నేర్చుకుంటున్నానని, కొత్త బాధ్యతల్లోకి పూర్తిగా అలవాటు చేసేందుకు కొంత సమయం పడుతుందన్నాడు చెన్నై సారథి రవీంద్ర జడేజా. నాలుగు వరుస ఓటముల తర్వాత ఆర్​సీబీపై గెలిచిన అనంతరం ఈ వ్యాఖ్య చేశాడు.మరోవైపు.. హర్షల్​ పటేల్​ లేకపోవటం పెద్ద లోటు అని పేర్కొన్నాడు ఆర్​సీబీ కెప్టెన్​ డుప్లిసెస్​.

IPL RCB vs CSK: టీ20 మెగా లీగ్​లో నాలుగు వరుస ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్​ కింగ్స్​. ఆర్​సీబీపై మంగళవారం జరిగిన మ్యాచ్​లో 23 పరుగుల తేడాతో గెలుపొంది ఖాతా తెరిచింది. ఈ సీజన్​లో వరుస ఓటముల కారణంగా కెప్టెన్​ రవీంద్ర జడేజాపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆర్​సీబీపై విజయం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు చెన్నై సారథి జడేజా. కెప్టెన్​గా తాను ఇంకా నేర్చుకుంటున్నానని, కొత్త బాధ్యతల్లోకి పూర్తిగా మారేందుకు కొంత సమయం పడుతుందన్నాడు.

" ముందుగా.. ఇది నాకు కెప్టెన్​గా తొలి విజయం. మొదటి విజయం ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే ఈ గెలుపును నా భార్యకు అంకితమిస్తున్నా. గత నాలుగు మ్యాచుల్లో విజయం సాధించలేకపోయాం. కానీ, ఒక జట్టుగా మంచి ప్రదర్శన చేశాం. ఒక కెప్టెన్​గా సీనియర్​ ఆటగాళ్ల ఆలోచనలను తెలుసుకుంటున్నా. మహీ భాయ్​ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్లి చర్చిస్తున్నా. కొత్త బాధ్యతల్లోకి మారేందుకు కాస్త సమయం పడుతుంది. ఇప్పటికీ నేర్చుకుంటున్నా. ప్రతి మ్యాచ్​లో మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నా. "

- రవీంద్రా జడేజా, సీఎస్​కే సారథి

తొలి నాలుగు మ్యాచ్​ల్లో ఓటమితో తమ జట్టు ఆందోళనకు గురికాలేదని, యాజమాన్యం తమపై ఒత్తిడి పెట్టలేదన్నాడు జడేజా. వారు ప్రశాంతంగా ఉండటమే కాకుండా తమలో విశ్వాసం నింపేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నాడు. ఇక్కడ అనుభవం ఉపయోగపడుతుందని, ప్రశాంతంగా ఉంటూ తిరిగి ట్రాక్​లోకి వచ్చేందుకు యత్నించామన్నాడు. ఈ మ్యాచ్​తో తమ ప్రయత్నాలకు మంచి ఫలితం లభించిందని, దానిని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఆర్​సీబీపై జడ్డూ రికార్డ్​: బెంగళూరుపై అత్యంత విజయవంతమైన బౌలర్​గా రికార్డ్​ సృష్టించాడు చెన్నై సారథి రవీంద్రా జడేజా. మంగళవారం జరిగిన మ్యాచ్​లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుని ఆ జట్టుపై అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు మొత్తం 26 వికెట్లు పడగొట్టాడు జడ్డూ. అతడి తర్వాత జస్ప్రిత్ బుమ్రా(24), ఆశిశ్​ నెహ్రా(23) ఉన్నారు.

"టీ20 లీగ్‌లో తొలి విజయం సాధించడం ఆనందంగా ఉంది. అందులోనూ నేను కీలక పాత్ర పోషించడం ఇంకా బాగుంది. ప్రాథమిక సూత్రాల మీద దృష్టిసారించాను కాబట్టే బ్యాటింగ్‌లో రాణించగలిగాను. సీనియర్లతో మాట్లాడుతూ ఉంటా. ముఖ్యంగా మహీ భాయ్‌ (ధోనీ) మంచి సలహాలు ఇవ్వడంతోనే మెరుగయ్యా. క్రీజ్‌లో కుదురుకోవడంపైనే దృష్టిసారించా. బంతిని చాలా చక్కగా టైమింగ్‌ చేసి షాట్లు కొట్టగలిగా. చాలా మంది ఎడమ చేతి బ్యాటర్లకు యువరాజ్‌ స్ఫూర్తి. నా బ్యాటింగ్ శైలి కూడా ఇలానే ఉంటుందని అంటుంటారు. పరిస్థితులను బట్టి కోచ్‌, కెప్టెన్‌ ఏ స్థానంలో ఆడమన్నా దానికి సిద్ధమే." అని శివమ్​ దూబే అన్నాడు.

హర్షల్​ పటేల్​ లేకపోవటం పెద్ద లోటు: పేసర్​ హర్షల్​ పటేల్​ సేవలను జట్టు మిస్సవుతోందన్నాడు ఆర్​సీబీ సారథి ఫాఫ్​ డుప్లెసిస్​. 'హర్షల్​ ఈ జట్టుకే కాదు ఏ టీమ్​కైనా అందించే సేవలను మీరు చూస్తారు. మ్యాచ్​ను అదుపు చేసే సత్తా అతనిలో ఉంది. ఈ రోజు అతడిని మిస్సయ్యాం. చివరి వరకు మాకు వైవిధ్యమైన బౌలింగ్​ లేదు. హర్షల్​ లేకపోవటం పెద్ద లోటు. త్వరలోనే జట్టులోకి వస్తాడనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నాడు. సోదరి మృతితో బయోబబుల్​ వీడాడు హర్షల్​ పటేల్​. దీంతో ఆర్​సీబీకి బౌలింగ్​ విభాగంలో పెద్ద లోటుగా మారింది. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో హర్షల్​ పటేల్​, అతని కుటుంబానికి సంఘీభావంగా నల్లటి ఆర్మ్​బ్యాండ్స్​ ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు ఆర్​సీబీ ఆటగాళ్లు. ఈ మ్యాచ్​లో శివమ్​దూబే, రాబిన్​ ఊతప్ప అద్భుతమైన ఆటతో జట్టు భారీ స్కోర్​ సాధించేందుకు కృషి చేశారు.

ఇదీ చూడండి: IPL 2022: చెన్నై బోణీ.. బెంగళూరును ముంచేసిన మహీశ్ తీక్షణ

Last Updated :Apr 13, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.