ETV Bharat / sports

Ipl-2021: ఐపీఎల్​ రెండోదశలో విజయావకాశాలు ఎవరికి ఎక్కువ?

author img

By

Published : Sep 16, 2021, 7:43 AM IST

ఈ ఏడాది ఏప్రిల్​లో భారత్​లో ఆరంభమై... వైరస్ భయంలో ఉన్న ప్రజలకు కాస్త ఉపశమనాన్ని అందించేలా సాగిన ఐపీఎల్​ 14వ (Ipl-2021)సీజన్​ను మహమ్మారి కాటేసింది. కొంతమంది ఆటగాళ్లు పాజిటివ్​గా తేలడం కారణంగా మేలో లీగ్​ను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. అప్పటికే తమ ఆటతీరుతో కొన్ని జట్లు అభిమానులకు ఆనందాన్ని పంచితే.. మరికొన్ని పేలవ ప్రదర్శనతో నిరాశలో ముంచెత్తాయి. అయితే మరలా ఆదివారం నుంచి అభిమానులను అలరించేందుకు లీగ్ రెండో దశ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? వాటి విజయావకాశాల మాటేంటి అనేది ఓ సారి చూద్దాం.

Ipl-2021
ఐపీఎల్​ 2021

ఈ ఏడాది వేసవిలో కరోనా కారణంగా ఐపీఎల్‌ 14వ (Ipl-2021) సీజన్‌ అర్ధంతరంగా ఆగిపోయడంతో అందరిలోనూ సందిగ్ధత! మిగిలిన మ్యాచ్‌ల పరిస్థితేంటన్న సందేహం. ఇప్పుడు యూఏఈ వేదికగా ఐపీఎల్‌-14 పునఃప్రారంభమవుతోంది. ఆదివారం నుంచే అభిమానులను అలరించేందుకు లీగ్‌ రెండో దశ సిద్ధమైంది. మరి.. సీజన్‌కు మధ్యలో బ్రేక్‌ పడకముందు జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయి? వాటి ప్రదర్శన ఎలా ఉంది? ఇప్పుడు ముందంజ వేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో చూసేద్దాం పదండి.

ప్లేఆఫ్‌కు చేరువలో..

దిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals).. ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్లేఆఫ్‌లో అడుగుపెట్టే తొలి జట్టుగా కనిపిస్తోంది. తొలి దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో అంచెలో ఆడనున్న ఆరు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తు ఖాయమవుతుంది. శ్రేయస్‌ పునరాగమనం ఆ జట్టు బలాన్ని పెంచేదే. వోక్స్‌ స్థానంలో డ్వార్షుయిజ్‌ జట్టులోకొచ్చాడు. ధావన్‌, పృథ్వీ, శ్రేయస్‌, స్మిత్‌, పంత్‌లతో బ్యాటింగ్‌.. రబాడ, నార్జ్‌, అవేష్‌, అశ్విన్‌లతో బౌలింగ్‌ పటిష్ఠంగా ఉన్నాయి.

సీఎస్కే మళ్లీ..

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై(Csk Team) నిరుడు నిరాశపరిచినా.. ఈసారి పుంజుకుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మిగతా 7 మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తు పక్కా. రెండు నెగ్గినా ఛాన్సుంటుంది. గతేడాది యూఏఈలోనే జరిగిన సీజన్‌లో ఆ జట్టు ప్రదర్శన పేలవం. మళ్లీ ఇప్పుడు అక్కడ ఆడబోతుండటం ఆ జట్టుపై ప్రభావం చూపుతుందేమో చూడాలి. తొలి దశ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన డుప్లెసిస్‌ ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడం ఇబ్బందే. ఆల్‌రౌండర్లు జడేజా, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, బ్రావో ఆ జట్టుకు బలం.

ఈసారైనా..

ఇప్పటిదాకా టైటిలే గెలవని బెంగళూరు (Rcb Team) ఈసారి కల నెరవేర్చుకునే దిశగా సాగుతోంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో మూడో స్థానంలో ఉన్న కోహ్లీసేన.. మిగతా ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో నెగ్గినా ప్లేఆఫ్‌ చేరొచ్చు. యూఈఏకి రాలేకపోయిన జంపా, సామ్స్‌, రిచర్డ్‌సన్‌, అలెన్‌ స్థానాల్లో హసరంగ, చమీర, గార్టన్‌, డేవిడ్‌లను ఆర్‌సీబీ తీసుకుంది. సీజన్‌లో అత్యధిక వికెట్ల బౌలర్‌గా కొనసాగుతున్న హర్షల్త్‌ో పాటు సిరాజ్‌, జేమీసన్‌, చాహల్‌ల రూపంలో నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉన్నారు. సుందర్‌ యూఏఈ మ్యాచ్‌లకు దూరమవడం దెబ్బే. బ్యాటింగ్‌ భారం కోహ్లి, డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌పైనే ఉంది.

అలవాటు కొనసాగిస్తుందా?

రికార్డు స్థాయిలో అయిదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి.. (Mumbai Indians Team)మరోసారి టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో యూఈఏ చేరింది. గత సీజన్‌లో ఇదే గడ్డపై ట్రోఫీ సొంతం చేసుకున్న ఆ జట్టు.. దాన్ని పునరావృతం చేస్తుందా అన్నది చూడాలి. తొలి ఏడు మ్యాచ్‌ల్లో 4 విజయాలే సాధించిన ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌ చేరాలంటే ఏడు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు మూణ్నాలుగు విజయాలవసరం. కెప్టెన్‌ రోహిత్‌కు తోడు డికాక్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, కృనాల్‌, పొలార్డ్‌, బుమ్రా, బౌల్ట్‌ లాంటి మేటి ఆటగాళ్లున్న ముంబయికి అదేమంత కష్టమేమీ కాదు.

ఆట మారుతుందా?

కొత్త కెప్టెన్‌ సంజు శాంసన్‌ సారథ్యంలో ఎన్నో ఆశలతో ఈ సీజన్లో అడుగుపెట్టిన రాజస్థాన్‌కు (Rajasthan Royals Team) ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలే సాధించిన జట్టు అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. గాయాలతో తొలి అంచె పోటీలకు దూరమైన ఆర్చర్‌, స్టోక్స్‌లతో పాటు ఇప్పుడు బట్లర్‌, ఆండ్రూ టై కూడా జట్టుకు అందుబాటులో లేరు. బ్యాటింగ్‌ భారం శాంసన్‌పైనే ఉంది. షంసితో పాటు ఫిలిప్స్‌, లూయిస్‌లను జట్టులోకి తీసుకున్న రాజస్థాన్‌ ఆట మారతుందేమో చూడాలి.

కింగ్స్‌.. కష్టపడితేనే

విజయంతో సీజన్‌ను ఆరంభించిన పంజాబ్‌ను (Kings xi Punjab)నిలకడ లేమి సమస్య వెంటాడుతోంది. 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించిన ఆ జట్టు ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఆ జట్టు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు నెగ్గాలి. బ్యాటింగ్‌లో రాహుల్‌, మయాంక్‌, గేల్‌ కీలకం. కొత్తగా వచ్చిన మార్‌క్రమ్‌ ఎలా ఆడతాడో చూడాలి. బౌలర్లలో రాణిస్తోంది షమి ఒక్కడే. జే రిచర్డ్‌సన్‌, మెరిడిత్‌ స్థానాల్లో వచ్చిన రషీద్‌, ఎలిస్‌ జట్టుకు ఏమేర ఉపయోగపడతారో చూడాలి.

కేకేఆర్‌కు కఠినమే..

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కోల్‌కతా (Kolkata Knight Riders) ప్లేఆఫ్‌ చేరాలంటే అద్భుతమే జరగాలి. తొలి ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండే నెగ్గిన ఆ జట్టు 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ముందంజ వేయాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం అయిదు విజయాలు సాధించాలి. అప్పటికీ మిగతా జట్ల ఫలితాలు, నెట్‌ రన్‌రేట్‌పై ఆ జట్టు భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఆ జట్టు పేసర్‌ కమిన్స్‌ రెండో దశ మ్యాచ్‌లకు దూరం కాగా.. సౌథీ జట్టులోకి వచ్చాడు. జట్టు తిరిగి పుంజుకుని వరుస విజయాలు సాధించడం కష్టంగానే ఉంది.

సన్‌రైజర్స్‌కు నిరాశే!

ఎన్నో ఆశలు.. అంచనాలతో సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad Team) నిరాశ తప్పలేదు. సీజన్‌లో వరుస ఓటముల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్‌గా తప్పించి ఆ బాధ్యతలను విలియమ్సన్‌కు కట్టబెట్టినా జట్టు రాత మారలేదు. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆ జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్‌ చేరడం కోసం ఏడు మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గడమంటే ఆషామాషీ కాదు. బెయిర్‌ స్టో (248) రెండో దశ మ్యాచ్‌లకు దూరం కావడం గట్టి ఎదురు దెబ్బే.

ఇదీ చూడండి: CPL 2021: కరీబియన్ లీగ్ విజేతగా ఈసారి కొత్త జట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.