ETV Bharat / sports

షమీపై హార్దిక్​ ఫైర్​.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్​

author img

By

Published : Apr 12, 2022, 10:56 AM IST

Updated : Apr 12, 2022, 11:33 AM IST

hardik
హార్ధిక్​

సోమవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​పై సన్​రైజర్స్​హైదరాబాద్​ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ​ మ్యాచ్​లో సీనియర్​ ప్లేయర్​ మహ్మద్​ షమీపై హార్దిక్​ పాండ్య అసహనం ప్రదర్శించాడు. అతడిపై అరుస్తూ ముందుకు వచ్చాడు. దీంతో ఫ్యాన్స్​ హార్దిక్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీ20 లీగ్‌లో భాగంగా గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులు తక్కువ చేశామని గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. ఆ పరుగులు చేసుంటే చివర్లో పరిస్థితులు మరోలా ఉండేవన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పాండ్య (50*) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ 19.1 ఓవర్లలో రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది.

"బ్యాటింగ్‌లో మేం సుమారు 10 పరుగులు తక్కువ చేశామనుకుంటా. ఆ పరుగులు చేసుంటే చివర్లో పరిస్థితులు మరోలా ఉండేవి. తొలుత మేం బంతితో బాగా ఆరంభించినా రెండు ఓవర్లలో వాళ్లు సాధించిన 30 పరుగులతోనే తిరిగి పోటీలోకి వచ్చారు. హైదరాబాద్‌ టీమ్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. వాళ్ల ప్రణాళికలను కచ్చితంగా అమలు చేశారు. వాళ్ల బౌలింగ్‌ విధానానికి క్రెడిట్‌ దక్కుతుంది. తప్పుల నుంచి మేం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి గురించి మేమంతా కూర్చొని చర్చించుకొని ముందుకు సాగుతాం" అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

ఇక హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యం మోస్తరు స్కోరేనని చెప్పాడు."వాళ్లకు మేటి బౌలింగ్‌ దళం ఉంది. దీంతో మేం సరైన భాగస్వామ్యాలు నిర్మించాలనుకున్నాం. అదే పని చేశాం. మా ఆటగాళ్లు ఎవరేం చేయాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు. ఈ మ్యాచ్‌లో పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, మేం వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాం. బౌండరీలు సాధించడం కష్టంగా అనిపించినా చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. మొత్తానికి ఈరోజు మా కుర్రాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఇక రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి రాహుల్‌ త్రిపాఠి త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా" అని వివరించాడు.

Netizens fire on pandya: 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సన్​రైజర్స్​ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. అయితే 13వ ఓవర్​లో ప్రత్యర్థి జట్టు కెప్టెన్​ హార్దిక్ పాండ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఓవర్​ చివరి బంతికి రాహుల్‌ త్రిపాఠి (17 రిటైర్డ్‌ హర్ట్‌) ఆడిన భారీ షాట్‌ను డీప్‌ థర్డ్‌ మ్యాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న షమి క్యాచ్‌ అందుకోలేకపోయాడు. అప్పటికే తన ఓవర్‌లో విలియమ్సన్‌ రెండు సిక్సర్లు బాదడం వల్ల గుర్రుగా ఉన్న పాండ్య.. షమి ఆ బంతిని అందుకోకపోవడంతో గట్టిగా అరిచాడు. అది టీవీలో స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు వెంటనే పాండ్యపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. షమి లాంటి సీనియర్‌ ఆటగాళ్లను గౌరవించాలని అన్నారు. ఇలాగే అతిగా ప్రవర్తిస్తే గుజరాత్‌ జట్టులో ఎవరూ ఉండరని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్‌ టీమ్‌లో ఆటగాళ్లు పలు క్యాచ్‌లు వదిలినా విలియమ్సన్‌ ఎలా వ్యవహరించాడో ఒకసారి చూడాలని హితవు పలికారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు హార్దిక్‌పై అసహనం ప్రదర్శిస్తున్నారు.

మరోవైపు ఇదే మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్​ 42 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోవడంపైనా అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ టీ20 లీగ్‌ చరిత్రలోనే హార్దిక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఇన్ని బంతులు తీసుకోవడం ఇదే తొలిసారి. దీంతో అతడు నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాలని సూచిస్తున్నారు. అభినవ్‌ మనోహర్‌ నాలుగో స్థానంలో రావాలని కోరుతున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి.. ధోనీ నుంచి స్ఫూర్తి పొందావా అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి: కోహినూర్​ డైమండ్​ ఇప్పించొచ్చుగా.. ఆ కామెంటేటర్​పై సన్నీ సెటైర్లు

Last Updated :Apr 12, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.