ETV Bharat / sports

ఆఖర్లో మెరిసిన ధోనీ.. కోల్​కతా లక్ష్యం 132

author img

By

Published : Mar 26, 2022, 9:28 PM IST

IPL 2022 CSK Vs KKR: ఐపీఎల్​ 15వ సీజన్​ తొలి​ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ బ్యాటర్లు​ తడబడ్డారు. కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేశారు. ఆఖర్లో కాస్త మెరుపులు మెరిపించిన ధోనీ అర్ధసెంచరీ చేశాడు.

csk vs kkr
csk vs kkr

IPL 2022 CSK Vs KKR: వాంఖడే వేదికగా సాగుతున్న ఐపీఎల్​ 15వ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో చెన్నై జట్టు​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కోల్​కతా జట్టుకు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాటర్లలో మాజీ సారథి ధోనీ(50) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. ఉమేశ్ యాదవ్‌ వేసిన తొలి ఓవర్లోనే సీఎస్​కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) అవుటయ్యాడు. ఉమేశ్ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్​ ఐదో ఓవర్లో మరో ఓపెనర్‌ డెవాన్ కాన్వే (3).. శ్రేయస్ అయ్యర్‌కు చిక్కి పెవిలియన్‌ చేరాడు. రాబిన్ ఉతప్ప (28) నిలకడగా ఆడాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన చక్కటి బంతికి స్టంపౌటయ్యాడు. అనంతరం ఆ ఓవర్లోనే అంబటి రాయుడు కూడా రనౌటై.. క్రీజు వీడాడు. ఆండ్రీ రసెల్ వేసిన బంతికి శివమ్‌ దూబె (3).. సునీల్ నరైన్‌కు చిక్కాడు. దీంతో సగం ఓవర్లకే చెన్నై సగం వికెట్లు కోల్పోయినట్లయింది. కెప్టెన్​ రవీంద్ర జడేజా(26), ధోనీ(50) నాటౌట్​గా నిలిచారు. ఆఖర్లో ధోనీ సిక్స్​లు, ఫోర్లతో మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్​ యాదవ్ రెండు వికెట్లు తీయగా​, రుసెల్, వరుణ్​ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. ​

'టోక్యో ఒలింపిక్స్' పతక విజేతలకు సత్కారం..

గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్​ విజేతలకు ఐపీఎల్​ ఆరంభ మ్యాచ్​కు ముందు బీసీసీఐ సత్కరించింది. ఒలింపియన్లు జావెలిన్​ త్రో గోల్డ్​ మెడలిస్ట్​ నీరజ్ చోప్రాకు రూ.కోటి చెక్​ అందించగా.. బాక్సర్​ లవ్లీనాను రూ.25 లక్షల చెక్​తో బీసీసీఐ సన్మానించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​ పతకం నెగ్గినందుకు భారత పురుషుల హాకీ జట్టు తరఫున కెప్టెన్​ మన్​ప్రీత్​ కౌర్​కు చెక్ అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఒలింపిక్ బృందం రికార్డు స్థాయిలో ఈసారి 7 పతకాలు సాధించింది.

ఇదీ చదవండి: Women World Cup 2022: మిథాలీ సేన సెమీస్‌కు చేరుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.