ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్​ మధ్య ముదురుతున్న వివాదం!

author img

By

Published : Oct 31, 2020, 11:41 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ ద్వయం విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మల మధ్య గతేడాది ప్రపంచకప్​ నుంచి విభేదాలు కొనసాగుతున్నాయని వినికిడి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఉన్న సఖ్యత దెబ్బతిందని పలువురు క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. అదే కారణంతో రోహిత్​ శర్మను ఆస్ట్రేలియా సిరీస్​కు దూరం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

virat kohli rohit sharma rift continues?
కోహ్లీ, రోహిత్​శర్మ అనుబంధానికి బీటలు!

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టీమ్‌ఇండియాకు రెండు కళ్లు. ప్రతిభాపాటవాల్లో, జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా వీరిద్దరూ సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరం. ఒకరికొకరు సహకరించుకోవడం మరెంతో కీలకం. కానీ.. మళ్లీ వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. జట్టు భవితవ్యాన్ని ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. ఇంతకీ ఈ సమస్యకు పరిష్కారమేంటి?

virat kohli rohit sharma rift continues?
విరాట్​ కోహ్లీ

అప్పట్లో తెరమీదకు

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ ముందు వరకు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ మధ్య విభేదాల ప్రస్తావన అంతగా తెరమీదకు రాలేదు! న్యూజిలాండ్‌ చేతిలో కోహ్లీసేన ఘోరంగా ఓటమి పాలవ్వడం వల్ల కోహ్లీ, రోహిత్‌ మధ్య స్నేహం సవ్యంగా లేదనే సంగతి బయటపడింది. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. జట్టులో మిగతావాళ్ల అభిప్రాయాలకు విలువేలేదని రోహిత్ ఆగ్రహించాడని తెలిసింది. ఆటగాళ్ల ఎంపికలోనూ హిట్‌మ్యాన్‌ మాట వినిపించుకోలేదని సమాచారం.

జట్టు అవసరాల మేరకు కాకుండా తన శిబిరం వారినే విరాట్‌ తుది జట్టులోకి తీసుకోవడం వైస్‌కెప్టెన్‌కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో అతడు కోహ్లీ, అనుష్కను ఇన్‌స్టాలో అన్‌ఫాలో అయ్యాడనే విషయంతో రచ్చ మొదలైంది. అనుష్క పెట్టిన పోస్టులు, 'నాకోసం కాదు.. దేశం కోసం మైదానంలోకి దిగుతాను' అని రోహిత్‌ పెట్టిన పోస్టులు అందరినీ అయోమయంలో పడేశాయి. సెమీస్‌ ఓటమి తర్వాత విరాట్‌ తనకు ఇష్టమైన ఆటగాళ్లతోనే ఉన్నాడనీ వార్తలొచ్చాయి. టీమ్‌ఇండియా అంతా ఆదివారం నాడు స్వదేశానికి బయల్దేరితే హిట్‌మ్యాన్‌ మాత్రం తన సతీమణితో కలిసి మరో నాలుగు రోజుల తర్వాత ఇంగ్లాండ్‌ నుంచి బయల్దేరడమూ విభేదాల వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

virat kohli rohit sharma rift continues?
రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ

మాట మాట్లాడని రోహిత్‌

ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ × కోహ్లీపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగింది. వీరిద్దరి వివాదంలోకి కుటుంబ సభ్యులనూ లాగారు. ఎందుకంటే అప్పటికి కోహ్లీ, అనుష్క ఇన్‌స్టా ఖాతాలను రోహిత్‌ అన్‌ఫాలో చేశాడు. కోహ్లీ మాత్రం రోహిత్‌, రితికాను ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు. అనుష్క మాత్రం ఇద్దరినీ ఫాలో అవ్వడం లేదు. రితిక సైతం విరుష్కను అన్‌ఫాలో చేసేసి భర్త దారిలోనే నడిచింది. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

అయితే ఇవన్నీ అవాస్తవాలు, కల్పన అని కోహ్లీ స్పష్టం చేశాడు. తమ మధ్య వివాదం లేదని పేర్కొన్నాడు. కోచ్‌ రవిశాస్త్రి సైతం.. 'అభిప్రాయభేదాలు విభేదాలు ఎందుకవుతాయని' ప్రశ్నించాడు. నిజంగా కోపతాపాలే ఉంటే రోహిత్‌ వరుసగా ఐదు సెంచరీలు చేసేవాడా? విరాట్‌తో భాగస్వామ్యాలు నెలకొల్పేవాడా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాతి పర్యటనలో మళ్లీ కోహ్లీ, రోహిత్‌ కలిసి ఆడుతూ.. నవ్వుతూ కనిపించడం వల్ల వివాదం మరుగునపడింది. హిట్‌మ్యాన్‌ మాత్రం వివాదంపై ఒక్కమాటా మాట్లాడలేదు.

virat kohli rohit sharma rift continues?
స్టాండ్స్​లో దూరంగా కూర్చున్న అనుష్క శర్మ, రితిక

ట్వీటు వీడియోతో మరోసారి

ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం వల్ల మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. నిజానికి హిట్‌మ్యాన్‌ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. ఈ కారణాలతోనే అతడికి విశ్రాంతినిచ్చామని సెలక్టర్లు చెప్పారు. కానీ జట్టును ఎంపిక చేసినరోజే అతడు ప్యాడ్లు కట్టుకొని నెట్స్‌లో సిక్సర్లు బాదేస్తున్న వీడియోను ముంబయి ట్విటర్లో పోస్ట్‌ చేయడం అనుమానాలకు తావివచ్చింది. అంతేకాకుండా.. 'అసలు రోహిత్‌ సమస్యేంటి? అతడికి అయిన గాయం ఏంటి? ఇంకా నెలన్నర తర్వాత జరిగే టోర్నీకి ఎందుకు ఎంపిక చేయలేదు? ' అని గావస్కర్‌ ప్రశ్నించడం వల్ల సోషల్‌ మీడియాలో రచ్చ మొదలైంది.

గాయంతోనే బాధపడుతున్న మయాంక్‌ను ఎంపిక చేయడం ఆయన వ్యాఖ్యలకు బలం చేకూర్చింది. ఇంతలోనే సూర్యకుమార్‌పై శీతకన్నేయడమూ బయటకొచ్చింది. తాజా ఐపీఎల్‌ టోర్నీలోనే పదో మ్యాచ్‌ ముంబయి, బెంగళూరు మధ్య జరిగింది. టాస్‌కు వచ్చినప్పుడు రోహిత్‌, కోహ్లీ కనీసం ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోలేదు. ఎడమొహం పెడమొహంగా కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా టాస్‌ సమయంలో ప్రత్యర్థి కెప్టెన్లను పలకరించుకోవడం పరిపాటి.

virat kohli rohit sharma rift continues?
కోహ్లీ, రోహిత్​ శర్మ

ఆటగాళ్లకూ తెలుసా

ఇవన్నీ చూస్తుంటే రోహిత్‌, కోహ్లీ మధ్య సఖ్యత లేదన్న వాదన మరోసారి బలంగా ముందుకు వస్తోంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లకు కూడా ఈ విషయం తెలుసని సమాచారం. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో ఆటగాళ్లంతా ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడుకున్నారు. చాలామంది కోహ్లీ, హిట్‌మ్యాన్‌తో వేర్వేరుగా మాట్లాడారే తప్ప అందరూ కలిసి మాట్లాడుకోలేదు. వీరిద్దరికీ పడదు కాబట్టే! ఒకరి వద్ద మరొకరి గురించి ప్రస్తావన తీసుకురాలేదని వినికిడి. ఎవరి వర్గం వారికి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా చినికిచినికి గాలివానగా మారే ప్రమాదం ఉండటం వల్ల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని జోక్యం చేసుకోవాలని మాజీలు కోరుతున్నారు. అసలు రోహిత్‌ గాయం ఏంటి? దాని తీవ్రత ఏంటి? పర్యవేక్షణ ఎన్నాళ్లుంటుంది? పూర్తిగా స్పష్టతనివ్వాలని అడుగుతున్నారు. ఇక ముంబయి మాజీలంతా ఒక్కుమ్మడిగా హిట్‌మ్యాన్‌కు మద్దతు పలుకుతున్నారు.

virat kohli rohit sharma rift continues?
కోహ్లీ, రోహిత్​శర్మ అనుబంధానికి బీటలు!

ఇద్దరు కెప్టెన్లు.. మార్గమా?

నిర్ణయాధికారం, సెలక్షన్‌ ప్రక్రియ, నాయకత్వం, అధికారాలకు సంబంధించిన అంశాల్లోనే రోహిత్‌, కోహ్లీ మధ్య విభేదాలు పొడసూపుతున్నాయని చాలామంది అనుకుంటున్నారు. ఇందుకు స్ప్లిట్‌ కెప్టెన్సీ ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ను, సుదీర్ఘ ఫార్మాట్‌కు కోహ్లీని సారథులుగా నియమించాలన్న డిమాండ్లు‌ పెరుగుతున్నాయి.

నిజానికి సారథ్యం పరంగా రోహిత్‌కు అద్భుతమైన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ముంబయిని అతడు నాలుగుసార్లు విజేతగా నిలిపాడు. విరాట్‌ మాత్రం బెంగళూరుకు ఒక్కసారీ ట్రోఫీ అందించలేదు. ఇక ఆటగాళ్లకు మద్దతునివ్వడం, వారితో తరచూ మాట్లాడటం, నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మిగతావారి అభిప్రాయాలు సేకరించేందుకు హిట్‌మ్యాన్‌ ఇష్టపడతాడు. ప్రశాంతతలో అతడు ధోనీని తలపిస్తాడని చాలామంది మాజీల విశ్వాసం. కోహ్లీ ఇందుకు భిన్నంగా ఉంటాడని అంటారు.

ఐపీఎల్‌లో రోహిత్‌ 113 మ్యాచులకు సారథ్యం వహించి 66 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. విజయాల శాతం 60.17. బెంగళూరుకు విరాట్‌ 122 మ్యాచుల్లో నాయకత్వం వహించి 55 మ్యాచులే గెలిపించాడు. విజయాల శాతం 47.88. వీరిద్దరి గణాంకాలు, నాయకత్వ లక్షణాల సంగతి ఇది. వివాదానికి ముగింపేంటో చూడాలి మరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.