ETV Bharat / sports

పంజాబ్ వరుస విజయాలకు కారణాలివే!

author img

By

Published : Oct 28, 2020, 10:11 AM IST

Updated : Oct 28, 2020, 7:00 PM IST

తొలుత విఫలమైనట్లే కనిపించిన పంజాబ్​ జట్టు.. ఐపీఎల్​ రెండో అర్థభాగంలో అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచి ప్లేఆఫ్స్​కు చేరువైంది. ఇంతకీ ఆ జట్టు వరుస విజయాలకు కారణాలేంటి?

Punjab Victories_IPL2020
పంజాబ్ వరుస విజయాలకు కారణాలివే!..

'బ్రేక్‌ టైంలో వీళ్లేం తాగారో కనుక్కోవయ్యా. కాస్త మనవాళ్లకు కూడా పడదాం'- సై సినిమాలో భయపెట్టిన భిక్షూ యాదవ్‌ జట్టుపై నితిన్‌ టీం వరుసగా పాయింట్లు చేస్తుంటే పోలీసు అధికారి చెప్పిన డైలాగ్‌ ఇది. ఐపీఎల్‌లో పంజాబ్‌ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తొలి అర్ధభాగంలో వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయిన అదే జట్టు.. మలి అర్ధభాగంలో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి సంచలనం సృష్టించింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఒడిసిపట్టింది. మరి ఇంతకీ రాహుల్‌ సేన ఇంటర్వెల్‌లో ఏం చేసిందో తెలుసా!

విమర్శల్ని లెక్కచేయలేదు

'టీమ్‌ ఇండియాకు భవిష్యత్తు కెప్టెన్‌ దొరికాడు'.. పంజాబ్‌కు కేఎల్‌ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేసినప్పుడు, టీ20 లీగ్‌కు ముందు విశ్లేషణలు. 'రాహుల్‌ సైతం కోహ్లీ బాటలోనే నడుస్తున్నాడు. అతడికి నిజమైన వారసుడు ఇతడే మరి' వరుసగా ఐదు ఓటములు ఎదురవ్వడంతో వెటకారంతో వచ్చిన విమర్శలివి.

'కేఎల్‌ రాహుల్‌ జట్టును గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. సమయోచితంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తున్నాడు. హైదరాబాద్‌ మ్యాచులో 19వ ఓవర్లో జోర్డాన్‌ను ఉపయోగించడమే అందుకు ఉదాహరణ. అందుకే వారిప్పుడు ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నారు' వరుస విజయాల తర్వాత సన్నీ గావస్కర్‌ ప్రశంసలు.

ఇవన్నీ చెప్పొదొక్కటే.. పంజాబ్‌ అంటే రాహుల్‌.. రాహుల్‌ అంటే పంజాబ్‌ అని. అతడు రాణించినా.. రాణించకపోయినా ఆ జట్టుకు అతడే బలం.. అతడే బలహీనత. కానీ ఇప్పుడా బలహీన పరిస్థితి మారింది. జట్టులో సమష్టితత్వం పెరిగింది. ఆఖరి బంతి వరకు పోరాడుతోంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది.

Punjab Victories_IPL2020
కే ఎల్ రాహుల్

మూమెంట్స్‌ గెలవలేదు

తొలి అర్ధభాగంలో నిజానికి పంజాబ్‌ కనీసం 4 మ్యాచులు గెలవాల్సింది. కానీ చిన్న చిన్న మూమెంట్స్‌ను ఒడిసిపట్టడంలో విఫలమై ఓటమి పాలైంది. దిల్లీతో తొలి మ్యాచ్‌ను చివరిదాకా తీసుకొచ్చారు. అప్పటి వరకు అజేయంగా నిలిచిన మయాంక్‌ (89; 60 బంతుల్లో) ఆఖరి ఓవర్లో ఔటవ్వడంతో మ్యాచ్‌ సూపర్‌ఓవర్‌కు దారితీసింది. ఆపై విజయం దూరమైంది.

షార్జాలో రాజస్థాన్‌కు 224 పరుగుల లక్ష్యం నిర్దేశించినా బౌలింగ్‌లో పసలేకపోవడం.. సమయోచితంగా వికెట్లు తీయకపోవడంతో ఓటమి పాలవ్వక తప్పలేదు. నిజానికి ఇందులో గెలవాల్సింది.

ముంబయి మ్యాచులో 16 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బంతులేసిన బౌలర్లు చివరి 4 ఓవర్లలో 67 పరుగులిచ్చేశారు. మిడిలార్డర్‌ కుప్పకూలడంతో ముందున్న లక్ష్యం ఛేదించిలేకపోయింది.

చెన్నై మ్యాచులో బౌలర్లు కనీసం వికెట్‌ తీయలేకపోయారు. హైదరాబాద్‌పై బౌలర్లు, బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా పోరులో ఆఖరి 5 బంతుల్లో 12 చేయలేక విలవిల్లాడారు. ఇవన్నీ ఆయా మ్యాచుల్లో కీలకమైన మూమెంట్స్‌. వీటిని గెలవలేక మ్యాచులను చేజార్చుకుంది. రెండో అర్ధభాగంలో వాటిని సరిచేసుకుంది.

సుడి'గేల్' అదృష్టం‌‌

పంజాబ్‌ ఆడిన తొలి 7 మ్యాచుల్లో క్రిస్‌గేల్‌ ఆడలేదు. ఎందుకాడించడం లేదని అడిగినా సరైన సమయంలో ఆడిస్తామన్నారు. ఎప్పుడైతే అతడు జట్టులోకి వచ్చాడో అప్పట్నుంచి నుంచి వారి దశ, అదృష్టం మారింది. జట్టు విజయాల బాట పట్టింది. అతడు 5 మ్యాచుల్లో 2 అర్ధశతకాలతో 177 పరుగులు చేశాడు. అతడి మెరుపు షాట్లతోనే బ్యాటింగ్‌ ఆర్డర్‌పై భారం తగ్గింది.

జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ (529; 12 మ్యాచుల్లో) తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ (398; 10 మ్యాచుల్లో) సైతం మంచి టచ్‌లో కనిపించాడు. నికోలస్‌ పూరన్‌ (329; 12 మ్యాచుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటం మొదలెట్టేశాడు. ఇప్పుడు మన్‌దీప్‌సింగ్‌ సైతం ఫామ్‌ అందుకున్నాడు. ఒక్క మాక్స్‌వెల్‌ మాత్రమే భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాడు. అతడు మెరుపు షాట్లతో అలరించకపోయినా వికెట్‌ పడకుండా మిగతా వాళ్లకు స్ట్రైక్‌ ఇస్తూ జట్టు విజయాలకు దోహద పడటం మాత్రం గొప్పే.

దీపక్‌ హుడా సైతం ధైర్యాన్నిస్తున్నాడు. ఏదేమైనా గేల్‌ ఇందులో ఇమడటంతోనే బ్యాటింగ్‌ పటిష్ఠంగా మారింది. మొదట్లో కరుణ్‌ నాయర్‌, సిమ్రన్‌సింగ్‌, సర్ఫరాజ్‌తో కూడిన జట్లకు సమతూకం దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి.

Punjab Victories_IPL2020
క్రిస్ గేల్

కూర్పు కుదిరింది

బౌలింగ్‌ పరంగానూ పంజాబ్‌ మార్పులు చేసుకొంది. టోర్నీ ముందుకుసాగే కొద్దీ షమి (12 మ్యాచుల్లో 20 వికెట్లు) అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాడు. అతడు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరి ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు.

తొలుత ఎక్కువ పరుగులిచ్చిన క్రిస్‌ జోర్డాన్‌ (7 మ్యాచుల్లో 7 వికెట్లు) ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసం అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగులు ఆడిన అనుభవాన్ని ప్రదర్శిస్తున్నాడు. చివరి 5 మ్యాచుల్లో గెలుపుకు అతడెంతో కృషి చేశాడు.

మాక్స్‌వెల్‌ సైతం తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మొదట్లో కాట్రెల్‌, జిమ్మీ నీషమ్‌ను ప్రయత్నించి పంజాబ్‌ ఇబ్బంది పడింది. భారత బౌలర్లు రాణించడంతో జట్టు సమతూకం పెరిగింది. ఇద్దరు లెగ్‌ స్పిన్నర్ల వ్యూహంతో అదరగొడుతోంది.

Punjab Victories_IPL2020
షమి

విశ్వాసం నింపిన కుంబ్లే

తొలి 7 మ్యాచుల్లో వరుసగా 5 ఓడితే ఏ జట్టైనా సరే ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. చెన్నైకి హ్యాట్రిక్‌ ఓటములు ఎదరుకాగానే డీలా పడిపోయింది. కానీ పంజాబ్‌ విషయంలో అలా జరగలేదు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లేనే ఇందుకు కారణం.

కొన్నాళ్ల క్రితం ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డ రాహుల్‌కు గడ్డు పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక ధోరణి ఎలా ఉంటుందో తెలుసు. పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో కష్టపడితే విజయాలు వరిస్తాయన్నది జంబో శైలి. వీరిద్దరూ డ్రస్సింగ్‌ రూమ్‌ను సానుకూలంగా ఉంచారు. ఆటగాళ్లకు అండగా నిలిచారు. మాక్స్‌వెల్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారంటే వారెంత భరోసా ఇస్తున్నారో అర్థమవుతోంది.

తండ్రి పోయిన బాధలో ఉన్న మన్‌దీప్‌కు వీరిచ్చిన మద్దతు ఎంతగానో ఉపయోగపడింది. బ్యాటింగ్‌ కోచ్‌ వసీమ్‌ జాఫర్‌ చక్కని షాట్లు ఎంపిక చేసుకొనేలా తర్ఫీదునిస్తున్నాడు. ఇక ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మయాంక్‌, మాక్సీ, పూరన్‌, జోర్డాన్‌ అద్భుత ఫీల్డింగ్‌ను మనం ఇప్పటికే చూశాం. కుంబ్లే, బౌలింగ్‌ కోచ్‌ లాంజ్‌వెల్ట్‌ కుర్రాళ్లను సానబెడుతున్నారు.

Punjab Victories_IPL2020
అనిల్​ కుంబ్లే

రాహుల్‌ నాయకత్వం భేష్‌

వరుస విజయాలు సాధించిన ఐదు మ్యాచుల్లో రాహుల్‌ నాయకత్వ ప్రతిభ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. లేదంటే టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల జట్లకు బీసీసీఐ అతడిని వైస్‌ కెప్టెన్‌గా ఎందుకు నియమిస్తుంది చెప్పండి! ప్రతి మ్యాచ్‌కు ముందు కుంబ్లే, జాఫర్‌, లాంజ్‌వెల్ట్‌, రాహుల్‌ చక్కని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్ల బలహీనతలను విశ్లేషించి.. వారినెలా పెవిలియన్‌ పంపించాలో ప్రణాళికలు వేస్తున్నారు. వాటిని రాహుల్‌ యథాతథంగా మైదానంలో అమలు చేసేస్తున్నాడు.

కోల్‌కతా మ్యాచులో నితీశ్‌ రాణాను.. మాక్స్‌వెల్‌తో బౌలింగ్‌ చేయించి ఇలాగే ఉచ్చులో బిగించారు. హైదరాబాద్‌ మ్యాచులో స్పిన్నర్లతో పరుగులు నియంత్రించి.. పేసర్లతో స్లో డెలివరీలు వేయించారు. పరుగులు ఎక్కువగా వస్తుంటే రాహుల్‌ వెంటనే బౌలర్లను మార్చేస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యాలు నిర్మిస్తుంటే విడదీస్తున్నాడు.

బిష్ణోయ్‌.. ఎడమచేతి వాటం ఆటగాళ్లను సులువుగా బోల్తా కొట్టిస్తున్నాడు. అందుకే ప్రమాదకరంగా మారిన మోర్గాన్‌-గిల్‌ జోడీని బిష్ణోయ్‌ను ఉపయోగించే విడదీశాడు. దూకుడుగా ఆడితే పరుగుల వరద పారించగలనని తెలిసినా.. ఆఖరి వరకు క్రీజులో ఉండేందుకే అతడు మొగ్గు చూపుతున్నాడు. విజయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇలాంటి మార్పులెన్నో చేసింది కాబట్టే పంజాబ్‌ విజయాల బాట పట్టింది.

ఇదీ చదవండి:'వచ్చే సీజన్​లోనూ ధోనీయే కెప్టెన్​'

Last Updated : Oct 28, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.