ETV Bharat / sports

ఐపీఎల్​కు ధోనీ రిటైర్మెంట్​.. నిజమేనా?

author img

By

Published : Oct 24, 2020, 4:27 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ ఓ వైపు వరుస పరాజయాలు ఎదుర్కొంటుంటే.. ధోనీ వ్యవహరిస్తోన్న తీరు క్రీడాభిమానుల్లో ఓ అనుమానాన్ని రేకేత్తిస్తోంది. ఈ సీజన్​ తర్వాత అతడు ఐపీఎల్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తాడని అంతా అనుకుంటున్నారు.

Dhoni
ధోనీ

ఈ సీజన్​ తర్వాత ఐపీఎల్​కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్​ వర్గాలు. ఈ మెగాలీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో నిరాశపరుస్తోంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఓ పక్క చెన్నై ఓడుతున్నా.. మ్యాచ్‌ల అనంతరం ధోనీ వ్యవహరిస్తున్న తీరును చూస్తే.. వచ్చే సీజన్​లో అతడు ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. మహీ మాటలు, చేతలు దీనికి సంకేతాలుగా ఉన్నాయి.

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడిన అనంతరం.. ధోనీ తన జెర్సీని జాస్ బట్లర్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఈ మ్యాచ్​ అతడికి 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం.. బట్లర్ ధోనీకి అభిమాని అవ్వడం వల్ల అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ముంబయితో మ్యాచ్ అనంతరం మహీ మళ్లీ తన జెర్సీని పాండ్యా బ్రదర్స్‌కు బహుకరించాడు. దీంతోపాటే చాలా మంది ఆటగాళ్లకు వారి జెర్సీలపై ఆటోగ్రాఫ్‌లిచ్చాడు.

అంతే కాదు మ్యాచ్ అనంతరం మహీ మాట్లాడుతూ.. వచ్చే మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామన్నాడు. సారథులు పరాజయాల నుంచి పారిపోలేరని.. కెప్టెన్‌‌ను కాబట్టి తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడతానని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు.. జెర్సీలను బహుమతిగా ఇవ్వడం వంటివి చూస్తుంటే వచ్చే ఐపీఎల్​లో అతడు ఆడటం అనుమానమనే భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతోంది.

ఈ అనుమానాలన్నింటికీ కారణం లేకపోలేదు. ఎవరూ ఊహించని రీతిలో పంద్రాగస్టున ఓ ట్వీట్​తో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. అభిమానులకు షాకిచ్చాడు. టెస్టులకు ఇలాగే వీడ్కోలు పలికాడు. కాబట్టి ఐపీఎల్​లోనూ మహీ ఇదే విధంగా చేస్తాడని అంతా అనుకుంటున్నారు. నెట్టింట్లో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. మరి ఈ పరిస్థితుల్లో మహీ ఏం చేస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి రాహుల్ వద్ద ఆరెంజ్.. రబాడతో పర్పుల్ క్యాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.