ETV Bharat / sports

'ఆదిలో అదరగొట్టారు.. అంతలోనే తుస్సుమన్నారు'

author img

By

Published : Oct 24, 2020, 1:14 PM IST

ఐపీఎల్ 13వ సీజన్​ ప్రారంభంలో అలవోకగా సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ ప్రస్తుతం రెండంకెల స్కోరు అందుకోవడానికి చెమటోడ్చుతున్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన వాళ్లే.. తుదిజట్టులో తమ స్థానంపై సందేహాలు నెలకొనేలా చేస్తున్నారు. ఆదిలో 'సూపర్‌ హిట్టర్లు'గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం తడబడుతున్నారు. అలాంటి ఆటగాళ్లెవరో ఓసారి చూద్దాం.

IPL HITTERS_FAILED
'ఆదిలో అలరించి తర్వాత నిరాశపర్చిన ఆటగాళ్లు వీరే'

లీగ్‌ ఆరంభంలోనే సూపర్‌ ఓవర్లు, ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు.. కానీ, మధ్యలో వినోదం కాస్త తగ్గింది. ఎన్నో మ్యాచులు వన్‌సైడ్‌ గేమ్‌గా మారిపోయాయి. అయితే ప్లేఆఫ్ రేసు మొదలవ్వడం వల్ల ఉత్కంఠ తిరిగి తారస్థాయికి చేరింది. అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే మ్యాచ్‌ ఫలితాల్లో ఎలా మార్పు వచ్చిందో ఆటగాళ్ల ప్రదర్శనలోనూ అదే రీతిన అనూహ్య మార్పు కనిపించింది. భారీ షాట్లు ఆడి అలరించిన వారే రెండంకెల స్కోరు అందుకోవడానికి చెమటోడ్చుతున్నారు. ఆదిలో సూపర్​ హిట్​ అనిపించుకున్నవారు.. చివరకు జట్టులో తమ స్థానంపై సందేహం వచ్చేలా ఆడుతున్నారు. అలాంటి ఆటగాళ్లలో కొందరు..

'షార్జా' డాన్‌కు ఏమైంది?

వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. చెన్నైపై 32 బంతుల్లోనే 74 పరుగులు బాది 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. తర్వాత పంజాబ్‌పై (85 పరుగులు) కూడా అదిరే ప్రదర్శనతో మరోసారి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' సాధించాడు. శాంసన్‌ చెలరేగడం వల్ల ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రికార్డు ఛేదన చేసింది. కానీ, తర్వాత అతడు వరుసగా విఫలమవుతున్నాడు. రెండంకెల స్కోరు అందుకోవడానికి అయిదు మ్యాచ్‌లు ఎదురుచూడాల్సి వచ్చింది. 8, 4, 0, 5, 26, 25, 9, 0, 36 పరుగులతో నిరాశపరిచాడు. అయితే అతడు చెలరేగిన రెండు మ్యాచ్‌లూ చిన్న మైదానం అయిన షార్జాలోనే. కానీ అదే వేదికగా జరిగిన దిల్లీ మ్యాచ్‌లో 5 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 272 పరుగులు చేశాడు.

sanju_RR
సంజూ శాంసన్

ఒక్క మ్యాచ్‌లోనే..!

69 పరుగులకే నాలుగు వికెట్లు. కీలక బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విలియమ్సన్‌, మనీష్‌ పాండే పెవిలియన్‌కు చేరారు. ఆ పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ 164 పరుగులు చేసిందంటే యువ బ్యాట్స్‌మన్‌ ప్రియమ్‌ గార్గ్‌ వల్లే. 26 బంతుల్లో అతడు అజేయంగా 51 పరుగులు సాధించాడు. తొలుత క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి, తర్వాత చెలరేగిన అతడి ప్రదర్శనను అందరూ కొనియాడారు. కానీ, తర్వాత మ్యాచ్‌ల్లో అతడి నుంచి అటువంటి ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా లేదు. చెన్నైపై అర్ధశతకం మినహాయిస్తే అతడు చేసిన పరుగులు 12, 8, 0, 15, 16, 4 మాత్రమే. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన గార్గ్ 17.66 సగటుతో 106 పరుగులు చేశాడు.

priyam_garg
ప్రియం గార్గ్

పృథ్వీ 'షో' మిస్‌ అయ్యింది..

దిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా ఆరంభ మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో అదరగొట్టాడు. చెన్నై, కోల్‌కతాపై హాఫ్‌సెంచరీలు బాదాడు. శిఖర్‌ ధావన్‌తో కలిసి ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తూ జట్టుకు బలంగా మారాడు. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తూ ప్రత్యర్థులకు సవాలు విసిరాడు. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతేగాక నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన షా 20 సగటుతో 209 పరుగులు చేశాడు.

prithvi shah_DC
పృథ్వీ శా

స్టోయినిస్‌ మెరుపుల్లేవ్‌

దిల్లీ జట్టులో మరో ఆటగాడు మార్కస్ స్టోయినిస్‌ కూడా నిలకడగా ఆడట్లేదు. బెంగళూరుతో మ్యాచ్‌లో మినహా పెద్దగా రాణించలేదు. కానీ పంజాబ్‌.. బెంగళూరుపై అతడి మెరుపు అర్ధశతకాల వల్లే ఆ మ్యాచ్‌ల్లో దిల్లీ పైచేయి సాధించగలిగింది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన స్టోయినిస్‌ 28.25 సగటుతో 226 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. అంతేగాక ఆరు వికెట్లు తీశాడు.

stoinis
స్టోయినిస్

దినేశ్‌ కార్తీక్‌ కూడా..

ఈ సీజన్‌లో ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అలరించి తర్వాత సత్తాచాటలేకపోయిన మరో ఆటగాడు కోల్‌కతా మాజీ సారథి దినేశ్‌ కార్తీక్‌. సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతలు ఇయాన్‌ మోర్గాన్‌కు వదిలేసిన అతడు.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ మినహా రాణించలేకపోయాడు. పంజాబ్‌పై అతడు 29 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కార్తీక్ సాధించిన పరుగులు 30, 0, 1, 6, 12, 58, 1, 4, 29*, 4 మాత్రమే.

Dinesh karthik_KKR
దినేశ్ కార్తీక్

ఇదీ చదవండి:ఇటలీలో శిక్షణ ప్రారంభించిన భారత బాక్సర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.