స్టార్ పేసర్ రేణుకా సింగ్‌కు ICC అవార్డ్.. క్రికెట్లోకి వచ్చి ఏడాది కాకముందే..
Published: Jan 25, 2023, 6:52 PM


స్టార్ పేసర్ రేణుకా సింగ్‌కు ICC అవార్డ్.. క్రికెట్లోకి వచ్చి ఏడాది కాకముందే..
Published: Jan 25, 2023, 6:52 PM
భారత జట్టు వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్ తర్వాత ఆమె వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుకా సింగ్.. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆమెకు ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది.
క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాకముందే టీమ్ఇండియా యువ పేసర్ రేణుకా సింగ్‌కు అవార్డులు క్యూ కడుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో భారత జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్‌ప్రదేశ్ అమ్మాయి.. 2022కు గాను ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ బుధవారం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి అలైస్ క్యాప్సీలతో పాటు తన సహచర క్రికెటర్ యష్తిక భాటియాలు పోటీలో ఉన్నా.. రేణుకాసింగ్కే ఈ అవార్డు వరించింది. ఏడాదికాలంగా వన్డేలతో పాటు టీ20ల్లో భారత్ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న రేణుకకు ఈ అవార్డు దక్కింది. గతేడాది ఫిబ్రవరి 18న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణుక.. ఇప్పటివరకు 21 వన్డేల్లో 22 వికెట్లు తీసింది. 29 మ్యాచ్‌ల్లోనే 40 వికెట్లు సాధించింది.
-
Impressing everybody with her magnificent displays of seam and swing bowling, the ICC Emerging Women's Cricketer of the Year had a great 2022 👌#ICCAwards2022
— ICC (@ICC) January 25, 2023
గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రేణుక వేసిన స్పెల్ ఓ సంచలనం. నాలుగు ఓవర్లు వేసిన ఆమె నలుగురు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టుకు భారీ షాకిచ్చింది. ఇన్ స్వింగర్ ఆమె ఆయుధం. బ్యాటర్లను తికమకపెట్టి లోపలికి దూసుకొచ్చే బంతి వికెట్లను గిరాటేయడం ఆమె ప్రత్యేకత. మేటి క్రికెటర్లను కూడా దాటుకుని ఐసీసీ అవార్డు స్వీకరించడంపై ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
