ETV Bharat / sports

ఇది ప్రపంచ కప్​ తెచ్చే జట్టేనా?.. ఒక్కసారిగా తగ్గిన ఆశలు!

author img

By

Published : Sep 7, 2022, 7:33 AM IST

Indian Cricket team performance in Asia Cup 2022
Indian Cricket team performance in Asia Cup 2022

ఎప్పుడో 2007లో, టీ20 ప్రపంచకప్‌ మొదలైనపుడు ట్రోఫీ అందుకుంది భారత్‌. అప్పట్నుంచి ఇంకో కప్పు కోసం నిరీక్షణ కొనసాగుతోంది. గత ఏడాది ఘోరమైన ప్రదర్శనతో కనీసం గ్రూప్‌ దశను కూడా దాటలేకపోయింది టీమ్‌ఇండియా. ఈసారైనా తప్పులు దిద్దుకుని కప్పుకేసి దూసుకెళ్తుందనుకుంటే.. ఆసియా కప్‌లో సాధారణ ప్రదర్శనతో ఆశలు, అంచనాలను ఒక్కసారిగా తగ్గించేసింది. సూపర్‌-4లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన రోహిత్‌ సేన.. ఇక ఫైనల్‌ చేరుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఆసియా కప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న జట్టు ఫైనల్‌ కూడా చేరకుండా నిష్క్రమించే పరిస్థితి రావడం ప్రపంచకప్‌ సన్నాహాలను ప్రశ్నార్థకం చేస్తోంది.

ప్రపంచకప్‌కు ఇంకో నెలన్నరే సమయం ఉంది. ఈ స్థితిలో టీమ్‌ఇండియా ఆసియా కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో సత్తా చాటి ఆత్మవిశ్వాసం పెంచుకుంటుందని, మెగా టోర్నీలో ఆడించే జట్టుపై ఒక అవగాహనకు వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ టోర్నీలో ప్రదర్శన ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉంది. అలాగే జట్టు, కూర్పు విషయంలో సెలక్టర్లలో, టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ నిలకడ లేమి జట్టును దెబ్బ తీసింది. ఆటగాళ్లలో పట్టుదల, సరైన దృక్పథం లోపించిన విషయం టోర్నీలో స్పష్టంగా కనిపించింది. ఏ ఒక్క ఆటగాడూ టోర్నీలో నిలకడగా రాణించకపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించే విషయం.

అన్ని విధాలా..: బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఆసియా కప్‌ సందర్భంగా మూడు విభాగాల్లోనూ టీమ్‌ఇండియా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌లో త్రిమూర్తులు అనదగ్గ రోహిత్‌, రాహుల్‌, కోహ్లి అభిమానుల అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయారు. రోహిత్‌ శ్రీలంకపై బాగానే ఆడాడు కానీ.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. రోహిత్‌ చాన్నాళ్ల నుంచి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదన్నది వాస్తవం. ఇక కోహ్లి అతి కష్టం మీద ఈ టోర్నీలో పరుగులు చేయగలిగాడు కానీ.. బ్యాటింగ్‌లో సాధికారత అయితే కనిపించలేదు. అతనింకా పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం అందుకోలేదన్నది స్పష్టం. లంకతో మ్యాచ్‌లో మదుశంక లాంటి కొత్త బౌలర్‌ బంతిని విరాట్‌ అడ్డంగా ఆడి బౌల్డయిన తీరు అభిమానులకు పెద్ద షాక్‌.

ఇక గాయం కారణంగా చాలా రోజులు జట్టుకు దూరమై ఈ టోర్నీలో పునరాగమనం చేసిన రాహుల్‌ లయ అందుకోలేకపోయాడు. పాక్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో అతను మెరుగ్గానే కనిపించినా.. పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. మిగతా మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. మొత్తంగా చూస్తే టాప్‌ ఆర్డర్‌ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ మెరుపులు తొలి మ్యాచ్‌కే పరిమితం అయ్యాయి. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను బ్యాటుతో, బంతితో తేలిపోయాడు. దినేశ్‌ కార్తీక్‌ రూపంలో తనకు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ పంత్‌ జాగ్రత్త పడట్లేదు. అదే నిర్లక్ష్యపు షాట్లతో అవకాశాలను వృథా చేసుకుంటున్నాడు. ఇక సూర్యకుమార్‌ మంచి ఫామ్‌లోనే ఉన్నప్పటికీ.. బలహీన హాంకాంగ్‌ మీద మాత్రమే చెలరేగాడు. కీలక మ్యాచ్‌ల్లో జట్టు ఆశలను నిలబెట్టలేకపోయాడు. బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. బుమ్రా లేని పేస్‌ విభాగం సాధారణంగా కనిపిస్తోంది. పేస్‌ దళాన్ని ముందుండి నడిపించడంలో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ విఫలమయ్యాడు.

డెత్‌ ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేస్తాడని పేరున్న అతను.. పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌ చివర్లో ఒకే ఓవర్లో 19 పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యాడు. ఈ మధ్యే జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. అవేష్‌ ఖాన్‌ అవకాశాలను ఉపయోగించుకోలేక తుది జట్టులో చోటు కోల్పోయాడు. బుమ్రా తిరిగొస్తే పేస్‌ విభాగం మెరుగుపడవచ్చు. అయితే ప్రస్తుత జట్టులో మిగతా పేసర్ల ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో షమి లాంటి సీనియర్‌ వైపు మళ్లీ చూడాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పని భారం ఎక్కువవుతోందని, అలాగే భవిష్యత్తు దిశగా యువ పేసర్ల వైపు మొగ్గు చూపితే.. వారు అవకాశాలను ఉపయోగించుకోకపోవడంతో షమిని తిరిగి జట్టులోకి తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో మ్యాచ్‌ను మినహాయిస్తే స్పిన్నర్‌ చాహల్‌ టోర్నీలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక టోర్నీలో ఫీల్డింగ్‌ కూడా గొప్పగా ఏమీ లేదు. పాక్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ తేలికైన క్యాచ్‌ వదిలేయడం మ్యాచ్‌ను ఎలా మలుపు తిప్పిందో తెలిసిందే.

ప్రయోగాలతో చేటు?
గత ఏడాది ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత జట్టులో, యాజమాన్యంలో చాలా మార్పులే జరిగాయి. కెప్టెన్‌ మారాడు. కొత్త కోచ్‌ వచ్చాడు. అయితే కోహ్లి స్థానంలో పగ్గాలందుకున్న రోహిత్‌ మాత్రమే జట్టును నడిపించలేదు. మ్యాచ్‌లు పెరిగిపోవడం, పని ఒత్తిడి, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా వేర్వేరు సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించారు. అలాగే చాలామంది కుర్రాళ్లకు అవకాశమిచ్చారు. వివిధ స్థానాల్లో వేర్వేరు ఆటగాళ్లను ప్రయత్నించి చూశారు. దీని వల్ల గత పది నెలల్లో టీమ్‌ఇండియా ఎప్పుడు ఎక్కడ, ఎవరితో సిరీస్‌ ఆడిందో చెప్పాలన్నా కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ఇక ఏ సిరీస్‌లో ఎవరు జట్టును నడిపించారో, ఎవరెవరు జట్టులో ఉన్నారో, ఎవరు ఏ స్థానంలో ఆడారో అభిమానులకు అర్థం కాని గందరగోళం తలెత్తింది.

సామాన్య అభిమానులే కాదు.. ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షించి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయాల్సిన వాళ్లు కూడా కొంత అయోమయానికి గురై ఉంటే ఆశ్చర్యం లేదేమో! తరచుగా ఆటగాళ్లను మారుస్తూ వెళ్లడంతో ఎవ్వరూ జట్టులో కుదరుకోలేకపోయారు. అవకాశాలు అందుకున్న కుర్రాళ్లలో మరీ గొప్ప ప్రదర్శన ఎవ్వరూ చేయలేదు. దీంతో జట్టులో ఇప్పటికే ఉన్న సీనియర్లలో ఎవరినీ పక్కన పెట్టే పరిస్థితి కనిపించలేదు. ఆసియాకప్‌కు వచ్చేసరికి చాలా వరకు సీనియర్లనే ఆడించారు. వాళ్లూ అంచనాలను అందుకోలేకపోయారు. ఇప్పుడిక ప్రపంచకప్‌ జట్టులో ఎవరికి ప్రాధాన్యమిస్తారో చూడాలి.

ఇదీ చదవండి:

'ఆటలో వ్యక్తిగత దాడులు వద్దు'.. అర్ష్‌దీప్‌కు సచిన్‌ మద్దతు

ట్రోలింగ్‌పై అర్ష్‌దీప్‌ రియాక్షన్​.. ఏమన్నాడంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.