ETV Bharat / sports

'ఆ సమయంలో​ తీవ్ర అసంతృప్తితో సచిన్​.. కానీ నేను మాత్రం సక్సెస్​ అయ్యా'

author img

By

Published : Feb 15, 2023, 1:43 PM IST

Gary Kirsten
Gary Kirsten

భారత్​కు దిశా నిర్దేశం చేసిన కోచ్‌ల్లో గ్యారీ కిర్‌స్టెన్‌ ఒకడు. కోచ్​గా ఉన్న కాలంలో భారత్‌కు ఆయన రెండో వరల్డ్‌ కప్‌ అందించాడు. అయితే కోచింగ్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడినట్లు ఓ క్రికెట్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ గుర్తు చేసుకొన్నాడు. ఆ విశేషాలు మీ కోసం...

దాదాపు 28 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా ఖాతాలో రెండో వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ పడింది. మిస్టర్‌ కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించగా.. ప్రముఖ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ మార్గదర్శకత్వంలోనే 2011లో ఆ ఘనతను భారత్‌ సాధించింది. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కావడం విశేషం. ఆరో ప్రపంచకప్‌లో సచిన్‌ చిరకాల వాంఛ తీరింది. 2003లో ఫైనల్‌కు దూసుకెళ్లినప్పటికీ.. ఆసీస్‌ చేతిలో ఓటమితో రన్నరప్‌గా నిలిచింది. 2007లో ఘోరపరభావంతో భారత్‌ తీవ్ర విమర్శలపాలైంది. దీంతో 2008లో కోచింగ్ బాధ్యతలను చేపట్టిన గ్యారీ కిర్‌స్టెన్‌ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ప్రపంచకప్ సాధించేలా జట్టును సిద్ధం చేయడం గమనార్హం. కానీ, కోచ్‌గా తాను రావడం పట్ల సచిన్‌ మొదట్లో అసంతృప్తిగా ఉన్నట్లు గ్యారీ గుర్తు చేసుకొన్నాడు. సచిన్‌ను ఫామ్‌లోకి తీసుకురావడమే అతిపెద్ద సవాల్‌గా మారిందని కిర్‌స్టెన్‌ వెల్లడించాడు.

"అత్యుత్తమ ఆటగాళ్లు కలిగిన జట్టుకు కోచింగ్ బాధ్యతలు ఎలా నిర్వహించాలనే దానిపై తర్జనభర్జన పడ్డాను. అంతకుముందు జరిగిన ప్రపంచకప్‌లో ఘోర పరాభవంతో ఇబ్బంది పడిన జట్టును గాడిలో పెట్టడం సవాల్‌తో కూడుకున్నదే. నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో జట్టులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆనందంగా లేని ఆటగాళ్లలో మనోస్థైర్యం నింపాల్సిన బాధ్యత నాపై ఉంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను కాపాడుతూనే ఉత్సాహంగా బరిలోకి దిగేందుకు సాయమందించాలి"

"సచిన్‌ తెందూల్కర్‌ వంటి దిగ్గజ ఆటగాడికి శిక్షణ ఇవ్వడం అంత సులువేం కాదు. ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. అయితే, నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో సచిన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా అనిపించింది. అప్పటికే సచిన్‌ తనదైన శైలిలో క్రికెట్‌ను ఆస్వాదించలేకపోతున్నాడు. అలాగే త్వరలోనే ఆటకు వీడ్కోలు పలకాలని భావించాడు. అందుకే అతడితో కనెక్ట్‌ కావడం చాలా ముఖ్యం. ఇప్పటికే జట్టు విజయాల్లో సచిన్‌ కీలక పాత్ర పోషించాడు. అందువల్లే జట్టు ఇంతటి ఉన్నతస్థాయిలో ఉందనే విషయాన్ని సచిన్‌కు తెలియజేసేలా చేయాలని భావించా. దీంతో సచిన్‌ క్రికెట్‌ను ఆస్వాదించడం మళ్లీ ప్రారంభించాడు. అందుకు నేను సక్సెస్‌ అయినట్లే. ఎందుకంటే నేను కోచ్‌గా వచ్చిన తర్వాత జరిగిన తొలి వన్డే ప్రపంచకప్‌నే టీమ్‌ఇండియా సొంతం చేసుకొంది. ధోనీ వంటి కెప్టెన్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. భారత క్రికెట్‌ ఉన్నత శిఖరాలకు చేరడంలో అతడిదీ కీలక పాత్రే " అని గ్యారీ కిర్‌స్టెన్ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.