ETV Bharat / sports

ఆఖరి వన్డే కోసం భారత్​-దక్షిణాఫ్రికా సై.. సిరీస్​ ఎవరిదో?

author img

By

Published : Oct 11, 2022, 6:52 AM IST

టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి వన్డే మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను దక్కించుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Match preview
భారత్​-దక్షిణాఫ్రికా సిద్ధం

తొలి వన్డేలో ఓడినా, బలంగా పుంజుకుని రెండో మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ఇండియా ఫుల్​ జోష్​లో ఉంది. అయితే ఇదే ఉత్సాహంతో మూడో వన్డేలోకి బరిలోకి దిగనుంది. అలాగే ఇదే మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్ నెగ్గాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. మరి సిరీస్​ ఎవరిదో?

ఓపెనర్ల నుంచి స్థిరమైన ప్రదర్శనను ఆశిస్తోన్న టీమ్‌ఇండియా ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. ధావన్‌ నేతృత్వంలోని ద్వితీయశ్రేణి జట్టు చివరిదైన మూడో వన్డేలో సోమవారం దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఆరంభ మ్యాచ్‌లో కొద్ది తేడాతో ఓడిన భారత్‌.. రెండో వన్డేలో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓపెనింగ్‌ జంట ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ల ఫామే జట్టు మేనేజ్‌మెంట్‌కు కాస్త ఆందోళన కలిగిస్తోంది. సిరీస్‌లో ఇప్పటివరకు వీళ్లిద్దరు రాణించలేదు. రెండు మ్యాచ్‌ల్లో 17 పరుగులే చేసిన ధావన్‌ నిర్ణయాత్మక పోరులోనైనా జట్టుకు శుభారంభాన్నిస్తాడో లేదో చూడాలి. మరోవైపు తొలి మ్యాచ్‌లో తక్కువకే ఔటైన గిల్‌.. రెండో వన్డేలో మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌లతో మిడిల్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తోంది. శ్రేయస్‌, శాంసన్‌ నిలకడగా రాణిస్తుండగా.. గత మ్యాచ్‌లో ఇషాన్‌ చెలరేగిపోయాడు. ఈ ముగ్గురూ జోరు కొనసాగిస్తే మ్యాచ్‌లో భారత్‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో అందరి కళ్లూ సిరాజ్‌పైనే. గాయపడ్డ బుమ్రా స్థానంలో టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు కోసం పోటీలో ఉన్న అతడు.. రెండో వన్డేలో చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటి తన ప్రపంచకప్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలనుకుంటున్నాడు. షాబాజ్‌ అహ్మద్‌ స్థానంలో ఫాస్ట్‌బౌలర్‌ ముకేశ్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది.

దక్షిణాఫ్రికాకు చాలా ముఖ్యం: భారత్‌ కన్నా కూడా దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్‌లో విజయం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ జట్టు 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఐసీసీ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో మే నాటికి తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మిగతా జట్లు క్వాలిఫయర్స్‌ ఆడాల్సివస్తుంది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. ఈ సిరీస్‌ గెలిస్తే పది పాయింట్లు ఖాతాలో వేసుకుని 9వ స్థానానికి చేరుకుంటుంది. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ కన్నా 9 పాయింట్లు తక్కువతో ఉంటుంది. ఈ సిరీస్‌ ముగిశాక అయిదు మ్యాచ్‌లు ఆడాల్సివున్న దక్షిణాఫ్రికా ఇక్కడ పది పాయింట్లు సాధిస్తే.. ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు మెరుగవుతాయి. కానీ చివరి వన్డేలో భారత్‌ను అడ్డుకోవడం ఆ జట్టుకు సవాలే. కెప్టెన్‌ బవుమా పేలవ ఫామ్‌ దక్షిణాఫ్రికాకు పెద్ద ప్రతికూలాంశం. ఘోర వైఫల్యాల నేపథ్యంలో రెండో వన్డేకు విశ్రాంతి తీసుకున్న బవుమా.. ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగే అవకాశముంది. ఈ పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల్లో 11 పరుగులే చేసిన అతడు ఆఖరి సమరంలోనైనా మెరవాలని జట్టు ఆశిస్తోంది. బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికాను గట్టెక్కించాల్సిన బాధ్యత ఫామ్‌లో ఉన్న మిల్లర్‌, క్లాసెన్‌, మార్‌క్రమ్‌, డికాక్‌లదే. బంతితో కాగిసో రబాడ, నోకియా తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని దక్షిణాఫ్రికా కోరుకుంటోంది.

వర్షం పడొచ్చు..: మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దిల్లీలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పరిస్థితులు మెరుగ్గానే ఉండొచ్చు. అయినా.. వర్షం వల్ల కొన్ని ఓవర్లు తగ్గించక తప్పకపోవచ్చు. పిచ్‌ పేసర్లకు సహకరించే అవకాశముంది. ఇక ఆడిన గత మూడు వన్డేల్లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి.

ఇదీ చూడండి: వార్మప్​ మ్యాచ్​లో అదరగొట్టిన భారత్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.