ETV Bharat / sports

పసికూనతో టీమ్​ఇండియా ఢీ.. తక్కువ అంచనా వేస్తే కష్టమే!

author img

By

Published : Jun 25, 2022, 5:46 PM IST

Ind vs Ireland Series: ఇంగ్లాండ్​తో టెస్టు, వన్డే, టీ-20 సిరీస్​ కోసం.. రోహిత్​​ శర్మ నేతృత్వంలో టీమ్​ఇండియా ఇప్పటికే అక్కడికి వెళ్లింది. ఇదే క్రమంలో హార్దిక్​ పాండ్య సారథ్యంలో మరో భారత జట్టు ఐర్లాండ్​లో పర్యటిస్తోంది. రెండు టీ-20ల సిరీస్​లో తొలి మ్యాచ్​ ఆదివారమే. ఈ మ్యాచ్​ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు ప్రత్యక్ష ప్రసారం సహా అన్ని విశేషాలు తెలుసుకోండి.

IND vs IRELAND T20 Series Schedule 2022
IND vs IRELAND T20 Series Schedule 2022

Ind vs Ireland Series: 2 మ్యాచ్​ల టీ-20 సిరీస్​ కోసం ఇప్పటికే ఐర్లాండ్​ వెళ్లింది టీమ్​ ఇండియా. పసికూనతో సిరీస్​ కోసం హార్దిక్​ పాండ్య.. భారత్​కు నేతృత్వం వహిస్తున్నాడు. వీవీయస్‌ లక్ష్మణ్‌ కోచ్​గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ టీమ్​ఇండియాకు కెప్టెన్​, కోచ్​గా చేయనుండటం ఇదే తొలిసారి. దాదాపు ఇది భారత జూనియర్​ జట్టే. రోహిత్​ శర్మ సారథ్యంలో టీమ్​ ఇండియా సీనియర్​ టీమ్​ ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం వెళ్లింది. అయినా ఐర్లాండ్​తో సిరీస్​లో టీమ్​ ఇండియానే ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది. అయితే.. ఐరిష్‌ జట్టును అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. టీమ్​ ఇండియా- ఐర్లాండ్​ సిరీస్​లో తొలి మ్యాచ్​ ఆదివారమే. డబ్లిన్​ వేదికగా రెండు మ్యాచ్​లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతాయి.

ఎందుకు భారతే ఫేవరేట్‌..?
దక్షిణాఫ్రికాతో గత సిరీస్‌లో 0-2 వెనకబడ్డ యువ భారత్‌.. తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఐర్లాండ్‌లో అడుగుపెట్టింది. దాదాపు అందరూ ఫామ్‌లోనే ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా చివరి ఓవర్లలో రెచ్చిపోయే ఫినిషర్లు హార్దిక్‌, కార్తీక్‌.. ప్రారంభంలో ఇషాన్‌ కిషన్‌ మెరుపులు యువ భారత్‌కు ప్రధాన బలం. భువి స్వింగ్‌ , హర్షల్ స్లో బంతులు, అవేశ్‌ పేస్‌, స్పిన్‌తో మాయ చేసే చాహల్‌ను ఎదుర్కొవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే.

వాళ్లని ఆడిస్తే..
గత సిరీస్‌లో బెంచ్‌కే పరిమితం అయిన దీపక్‌ హూడా, వెంకటేశ్‌ అయ్యర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌, బిష్ణోయ్‌కు తుది జట్టులో అవకాశం ఇస్తే.. సత్తాచాటాలని చూస్తున్నారు. భారత టీ20 లీగ్‌లో గాయపడిన స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో అడుగుపెడుతున్నాడు. సంజూ శాంసన్‌, తొలిసారి భారత జట్టుకు ఎంపికైన రాహుల్‌ త్రిపాఠి.. ఇలా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల హిట్టర్లు జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు నిలబడిన.. మ్యాచ్‌పై ఐర్లాండ్‌ ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే సీనియర్లు లేకపోయినా సమతూకంగా ఉన్న యువ భారత్‌ ఫేవరేట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

IND vs IRELAND T20 Series Schedule 2022
రవి బిష్ణోయ్​

ఐర్లాండ్​ ఫామ్​లో ఉందా?
ఇటీవల ఒమన్‌లో 2022 టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ టోర్నీ జరిగింది. ఇందులో లీగ్‌ దశలో 3 మ్యాచ్‌లు ఆడి ఐర్లాండ్‌ రెండింట్లో గెలిచింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ ఒమన్‌పై 56పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌ చేరింది. అయితే లీగ్‌ దశలో ఐర్లాండ్‌ను ఓడించిన యూఏఈ.. ఫైనల్లో వారిపై 7 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌ టోర్నీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్‌ తరఫున బ్యాటింగ్‌లో హర్రీ టెక్టార్‌(4 మ్యాచ్‌ల్లో 116 ), పాల్‌ స్టిర్లింగ్‌ (5 మ్యాచ్‌ల్లో 116 ), గ్రేత్‌ డెన్లీ (5 మ్యాచ్‌ల్లో 113), కెప్టెన్‌ ఆండ్రూ బాల్‌బిర్ని(5 మ్యాచ్‌ల్లో 100) పరుగులు చేశారు. బౌలింగ్‌లో క్రెగ్‌ యంగ్‌ 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు, జోష్‌ లిటిల్‌ 5 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు, ఆండ్రి మెక్‌బ్రిన్‌ 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టారు.

IND vs IRELAND T20 Series Schedule 2022
ఐర్లాండ్​ టీ-20 జట్టు

ఇంగ్లిష్‌ కౌంటీల్లో రాణిస్తున్న మార్క్‌ అడైర్‌ ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో మంచి పేస్‌తో 39 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి వెలుగులోకి వచ్చిన కర్టిస్‌ కాంఫర్‌.. ఇప్పటివరకు ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 44 పరుగులు చేసిన గ్రెత్‌ డెన్లీ మొత్తంగా 37 టీ20 మ్యాచ్‌ల్లో 694 పరుగులు చేశాడు. వీరితోపాటు కెప్టెన్‌ ఆండ్రూ బల్‌బిర్ని(67 టీ20 మ్యాచ్‌ల్లో 1429), సీనియర్‌ ఆటగాడు పాల్‌ స్టిర్లింగ్‌ 102 మ్యాచ్‌ల్లో 2776 పరుగులతో టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు కలిగి ఉన్నారు. వీరంతా సమష్టిగా రాణించడంపై ఐర్లాండ్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

అప్పుడు ఏమైందంటే..
ఇప్పటివరకు భారత్‌ ఐర్లాండ్‌తో కేవలం మూడు టీ20ల్లోనే తలపడింది. అన్నింటిలోనూ భారత్‌దే పైచేయి. ఐర్లాండ్‌ తొలిసారిగా 2009 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఢీకొంది. ఈ మ్యాచ్‌లో పేసర్‌ జహీర్‌ఖాన్‌ విజృంభణతో ఐర్లాండ్‌ 18 ఓవర్ల మ్యాచ్​లో (వర్షం కారణంగా కుదించారు) 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్‌ అర్ధశతకం చేయడంతో భారత్‌ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2018లో భారత్‌ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. డబ్లిన్‌ వేదికగా జరిగిన మొదటి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసి 208/5 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ధావన్‌(74; 45 బంతుల్లో 5x4, 5x6) రోహిత్‌ (97; 45 బంతుల్లో 8x4, 5x6) రెచ్చిపోయి ఆడారు. ఛేదనలో ఐరిష్‌ జట్టు 132/9 పరుగులు మాత్రమే చేసింది. కుల్​దీప్‌ యాదవ్‌(4), బుమ్రా(2) వికెట్లతో రాణించారు. రెండో టీ20లో మళ్లీ బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా ఐరిష్‌ బౌలర్లతో ఓ ఆట ఆడుకుంది. రాహుల్‌ (70; 36 బంతుల్లో 3x4, 6x6), రైనా (69; 45బంతుల్లో 5x4,3x3) చెలరేగి ఆడడంతో భారత్‌ 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. ఛేదనలో ఐర్లాండ్‌ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌, చాహల్‌ చెరో 3 వికెట్లతో విజృంభించారు. దీంతో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ వైట్‌వాష్‌ చేసింది.

ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ సంచలనాలు మరిచిపోగలమా..!
అయితే.. పసికూన అనుకుని ఈ జట్టుని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రపంచ క్రికెట్‌లో ఈ జట్టు కొన్ని సంచలన విజయాలు నమోదు చేసింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిందంటే దానికి కారణం ఐరిష్‌ జట్టే. ఈ టోర్నీలో తొమ్మిదో మ్యాచ్‌ అది. ఐర్లాండ్‌కు అదే మొదటి ప్రపంచకప్‌. ప్రత్యర్థి పాకిస్థాన్‌. పాక్‌ విజయం ఖాయం అనుకున్నారంతా. కానీ ఐర్లాండ్‌ అద్భుతమే చేసింది. సెబినా పార్క్‌ (జమైకా) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ జట్టు టాస్‌ గెలిచి ఫీల్ఢింగ్‌ ఎంచుకుంది. 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. ఐరిష్‌ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 132 పరుగలకే ఆలౌట్‌ అయింది. ఛేదనలో నియల్ ఓబ్రియన్‌ (107 బంతుల్లో 72) పోరాటంతో ఐర్లాండ్‌ లక్ష్యాన్ని 32 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలోనే బంగ్లా చేతిలో ఓడి టీమ్‌ఇండియా గ్రూప్‌దశలోనే ఇంటిముఖం పట్టింది.

IND vs IRELAND T20 Series Schedule 2022
ఐర్లాండ్​ క్రికెటర్లు

కెవిన్‌ ఓబ్రియన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
2011 వన్డే ప్రపంచకప్‌.. వేదిక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. ఇంగ్లాండ్‌ , ఐర్లాండ్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మైదానం ఫోర్లు, సిక్సర్లతో తడిసి ముద్దైయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ట్రాట్‌, బెల్‌, పీటర్సన్‌ అర్ధశతకాలతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కెవిన్‌ ఓబ్రియన్‌ ఇన్నింగ్స్‌ ఈ టోర్నీకే హైలైట్‌. ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడిన అతడు 50 బంతుల్లోనే శతకం బాదేశాడు. మొత్తంగా కెవిన్‌ ఓబ్రియన్‌ 63 బంతుల్లో 113 పరుగులు (13ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. దీంతో ఐరిష్‌ జట్టు 49.1 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి భారీ టార్గెట్‌ను ఛేదించి రికార్డు విజయం నమోదు చేసింది.

ఇవీ చూడండి: పాపం నికోల్స్​.. ఎలా అవుటయ్యాడో చూడండి!

100 సిక్సర్లు.. 100 వికెట్లు.. తొలి టెస్టు క్రికెటర్​గా రికార్డు పుస్తకాల్లోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.