ETV Bharat / sports

IND VS SL: జట్టులోకి బుమ్రా.. రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్​ కాదంటున్న హార్దిక్​!

author img

By

Published : Jan 3, 2023, 4:34 PM IST

ఆసియా కప్‌ సమయంలో లంకేయుల చేతిలో ఎదుర్కొన్న ఓటమికి.. తాజా సిరీస్​లో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో మ్యాచ్​ గురించి మాట్లాడాడు కెప్టెన్​ హార్దిక్​. మరోవైపు ఈ సిరీస్​ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ గుడ్​న్యూస్ చెప్పింది. జట్టులోకి బుమ్రా వస్తున్నాడని తెలిపింది.

Bumra Back To Field Hardik Pandya
Hardik Pandya Jasprit Bumra

ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య సారథ్యంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆసియా కప్‌ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులను ఈ సిరీస్‌తోనైనా అలరిస్తారా? అనే ప్రశ్నకు కెప్టెన్‌ పాండ్య తాజాగా స్పందించాడు. "బదులు తీర్చుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని మేం అనుకోవడం లేదు. కానీ, గొప్ప ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం. ప్రత్యర్థి జట్టును జడిపించడానికి కొత్తగా చేయాల్సిందేమీ లేదు. వారికి మా బాడీ లాంగ్వేజ్‌ చాలు. భారత్‌లో టీమ్‌ఇండియాను ఢీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసేలా ఆడతాం. గత వైఫల్యాలను నా కెప్టెన్సీలో పునరావృతం కాకుండా చూసుకుంటాను" అని పాండ్య పేర్కొన్నాడు.

తన సారథ్యంలో జట్టు ఏ విధంగా ముందుకు వెళ్లనుందనే ప్రశ్నకు స్పందిస్తూ.. "భారత టీ20 లీగ్‌ ముంగిట కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రయోగాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదు. అయినప్పటికీ కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకువెళ్తాం. అందులో ఏది మంచి ఫలితాలను ఇస్తుందో చూస్తాం. జట్టులో అందరికీ వీలైనన్ని ఎక్కువ అవకాశాలు అందేలా చూస్తాం" అంటూ పాండ్య వివరించాడు.

జట్టులోకి బుమ్రా.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గత కొంత కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ బుమ్రా తిరిగి లంకతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. కాగా తొలుత వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన 15 ‍మంది సభ్యుల జట్టులో బుమ్రా పేరు లేదు. తాజగా బుమ్రాను వన్డే జట్టులోకి చేర్చినట్లు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. "శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ ​కోసం భారత జట్టులోకి పేసర్ బుమ్రాను ఆల్‌ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది" అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.

లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్​ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.