ETV Bharat / sports

AUS Vs WI: గేల్​ సునామీ.. విండీస్​దే టీ20 సిరీస్​

author img

By

Published : Jul 13, 2021, 10:05 AM IST

Updated : Jul 13, 2021, 10:47 AM IST

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్(Chris Gayle) హాఫ్​ సెంచరీతో దంచికొట్టాడు. దీంతో​ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లోనూ విండీస్​ జట్టు భారీ విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 3-0తో కైవసం చేసుకుంది.

chris gayle, australia vs windies
క్రిస్ గేల్, ఆస్ట్రేలియా vs విండీస్

గ్రాస్ ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో​ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్​ల పొట్టి సిరీస్​ను 3-0తో గెలుచుకుంది కరీబియన్ జట్టు. సిరీస్​లో నామమాత్రమైన తదుపరి మ్యాచ్​ గురువారం జరగనుంది.

తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్​ ఫించ్ (31 బంతుల్లో 30 పరుగులు), హెన్రిక్స్​(29 బంతుల్లో 33 పరుగులు) ఫర్వాలేదనిపించారు. విండీస్​ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. వాల్ష్​ 2, బ్రావో, అలెన్, మెక్​కాయ్​ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో పూరన్​ సేన దూకుడుగా ఆడింది. కేవలం 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. యూనివర్సల్​ బాస్​ క్రిస్​ గేల్​(38 బంతుల్లో 67 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. అతనికి సారథి నికోలస్​ పూరన్​(27 బంతుల్లో 32 పరుగులు) అండగా నిలిచాడు. ఆసీస్​ బౌలర్లలో మెరిడిత్ 3, స్టార్క్​ ఒక వికెట్ తీసుకున్నారు.

గేల్ రికార్డు..

universe boss
క్రిస్​ గేల్

తాజా మ్యాచ్​లో అర్ధ సెంచరీతో మెరిసిన క్రిస్​ గేల్​(Chris Gayle).. సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 14వేల పరుగుల మార్కు​ను అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు.

అలెన్ సూపర్ క్యాచ్..

ఈ మ్యాచ్​లో ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ క్యాచ్​ను అద్భుతంగా ఒడిసిపట్టాడు విండీస్ బౌలర్​ ఫాబియాన్ అలెన్. 12వ ఓవర్లో వాల్ష్ వేసిన ఫుల్​టాస్​ను భారీ షాట్​ ఆడాడు ఫించ్. అది కాస్తా నేరుగా బ్రావో చేతిలో పడినట్లే పడి కింద పడబోయింది. కిందపడే సమయంలో కాలితో బంతిని పైకి లేపగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న అలెన్​ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ఆసీస్​ కెప్టెన్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడం వల్ల అలెన్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఇదీ చదవండి: 'కోహ్లీ ఐపీఎల్ టైటిలే గెలవలేదు.. ఐసీసీ ట్రోఫీ అంటే?'

Last Updated : Jul 13, 2021, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.