ETV Bharat / sports

అప్పట్లో ద్రవిడ్‌ బ్యాటింగ్‌ ఎలా ఉండేదంటే?.. సీక్రెట్‌ చెెప్పేసిన మాజీ సహచరుడు

author img

By

Published : Jan 13, 2023, 11:48 AM IST

rahul dravid
rahul dravid

షోయబ్‌ అక్తర్‌ వంటి ఫాస్ట్‌ బౌలర్‌ పరుగు పరుగున వచ్చి విసిరిన బంతిని.. నింపాదిగా అడ్డుకొన్న ఏకైక బ్యాటర్‌ రాహుల్ ద్రవిడ్. క్రీజ్‌లో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారేవాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టును నడిపిస్తున్న కోచ్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ద్రవిడ్‌ ఆటతీరుపై మాజీ సహచరుడు కొత్త విషయాలను వెల్లడించాడు.

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను 'ది వాల్' అని అంటారని తెలుసు కదా.. టెస్టు ఫార్మాట్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం అతడి సొంతం. భీకరమైన ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ వికెట్ ఇవ్వకుండా అడ్డుగా క్రీజ్‌లో పాతుకుపోయేవాడు. అయితే ఇదేదో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాక అనుకొంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే యువకుడిగా ఉన్నప్పుడు చెన్నై క్రికెట్‌ లీగ్‌ ఆడాడు. అప్పటి నుంచే గంటలకొద్దీ సమయం క్రీజ్‌లో గడిపేవాడు. ఇదే విషయాన్ని ద్రవిడ్ మాజీ సహచరుడు హేమాంగ్ బదానీ తెలిపాడు. రెండు రోజుల కిందట రాహుల్‌ 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

"రాహుల్‌ బెంగళూరులో ఉండేవాడు. లీగ్‌ చెన్నైలో జరిగేది. అక్కడ నుంచి ఈ లీగ్‌ కోసం చెన్నైకి వచ్చేవాడు. అప్పట్లో చెన్నై లీగ్‌ భారత్‌లో అత్యుత్తమ లీగ్‌ల్లో ఒకటి. అలాంటి లీగ్‌లో ద్రవిడ్‌ సెంచరీల మీద సెంచరీలు బాదేశాడు. నేను కూడా బాగానే ఆడిననప్పటికీ.. లాఫ్టెడ్‌ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరేవాడిని. అయితే ద్రవిడ్ మాత్రం శతకం బాదినా సరే ఏమాత్రం అలసిపోయినట్లు కనిపించేవాడు కాదు. బంతిని ఎక్కువగా పైకి లేపకుండా పరుగులు రాబట్టేవాడు. వరుసగా నాలుగైదు శతకాలు సాధించిన తర్వాత, ఓ సారి అడిగా.. 'రాహుల్ ఏం జరుగుతోంది..? నీకసలు విసుగు రాదా..?' అని ప్రశ్నించా. దానికి ద్రవిడ్ ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది"

"బెంగళూరు నుంచి చెన్నై ప్రయాణం గురించి ద్రవిడ్‌ ఇలా చెప్పాడు. 'నేను బెంగళూరు నుంచి చెన్నై వచ్చేందుకు రాత్రివేళ రైలు ఎక్కుతా. అప్పట్లో విమాన సదుపాయం ఉన్నప్పటికీ.. చాలా ఖరీదైంది. దాదాపు 6.30 గంటలు ప్రయాణించి మరీ చెన్నైకి వస్తా. ఏదో కేవలం 3 గంటలు బ్యాటింగ్‌ చేయడానికి అంత దూరం నుంచి రాలేదు. కనీసం ఓ ఐదు గంటలు బ్యాటింగ్‌ చేసి సెంచరీ సాధించాలి. ఎందుకంటే ఇన్నేసి గంటలపాటు ప్రయాణించి మరీ ఇక్కడకు వచ్చాక.. క్రీజ్‌లో గడపకపోతే ఫలితం ఏముంటుంది' అని ద్రవిడ్‌ చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి" అని బదానీ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.