ETV Bharat / sports

టీమ్ఇండియా ఓపెనర్లు ఎవరో చెప్పేసిన కోహ్లీ

author img

By

Published : Mar 11, 2021, 8:45 PM IST

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​లో రోహిత్​ శర్మకు జోడిగా కేఎల్​ రాహుల్​ ఓపెనింగ్​ చేస్తాడని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టులో ఒకే ఆఫ్​ స్పిన్నర్​కు అవకాశం ఉన్న కారణంగా.. ఆ స్థానంలో వాషింగ్టన్​ సుందర్​కు అవకాశం ఇచ్చామని అన్నాడు. సుందర్​ బాగా ఆడుతున్నంత వరకు అశ్విన్​కు పరిమిత ఓవర్ల జట్టులో చోటు కష్టమేనని కోహ్లీ వెల్లడించాడు.

Kohli speaks about India's opening combination and Ashwin's future in T20Is
భారత ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​పై కెప్టెన్​ స్పష్టత

ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీసులో రోహిత్‌శర్మకు జోడీగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. శిఖర్ ధావన్‌ మూడో ఓపెనర్‌గా ఉంటాడన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బాగా ఆడుతున్నంత వరకు రవిచంద్రన్‌ అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు కష్టమేనని వెల్లడించాడు. తొలి టీ20కి ముందు విరాట్‌ మీడియాతో మాట్లాడాడు.

"రోహిత్‌ జట్టులో ఉంటే కేఎల్‌ రాహుల్ అతడితో కలిసి‌ ఓపెనింగ్‌ చేస్తాడు. ఇది చిన్న విషయం. నిలకడగా పరుగులు చేస్తున్నంత వరకు వీరిద్దరే ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. రోహిత్‌ విశ్రాంతి తీసుకుంటే, రాహుల్‌కు గాయమైతే శిఖర్‌ మూడో ఓపెనర్‌గా వస్తాడు. సాధారణ పరిస్థితుల్లో మాత్రం రోహిత్‌, రాహులే ఓపెనర్లు."

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

గతేడాది ఐపీఎల్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ బాగా ఆడాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తెలుపు బంతి క్రికెట్లో చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా.. "వాషింగ్టన్‌ సుందర్‌ బాగా ఆడుతున్నాడు. అశ్విన్‌, సుందర్‌ ఆఫ్‌ స్పిన్‌ వేస్తారు. అందుకే చోటు మాత్రం ఒక్కరికే ఉంటుంది. సుందర్‌ పేలవ ఫామ్‌లో ఉండి, వికెట్లు తీయలేకపోతుంటే మరొకరికి అవకాశం దొరుకుతుంది" అని కోహ్లీ బదులిచ్చాడు. "అడిగే ప్రశ్నలకు కాస్త తర్కమూ ఉండాలి. అశ్విన్‌ను ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ ఆడించాలో మీరే సూచించండి. సుందర్‌ ఇప్పటికే బాగా ఆడుతున్నాడు. ప్రశ్నలు అడగడం తేలికే. కానీ తర్కమూ అవసరమే కదా" అని విరాట్‌ తెలిపాడు.

ఫిట్‌నెస్‌ ప్రమాణాలు అందుకోనంత వరకు ఆటగాళ్లకు జట్టులో చోటు దొరకదని కోహ్లీ స్పష్టం చేశాడు. వరుణ్‌ చక్రవర్తి గురించి అడగ్గా ఇలా జవాబిచ్చాడు. ఎన్‌సీఏలో నిర్వహించిన యోయో (17.1), 2 కి.మీ పరుగు (8 నిమిషాల్లో) పోటీల్లో వరుణ్‌ విఫలమైన సంగతి తెలిసిందే.

"టీమ్‌ఇండియా కోసం సృష్టించుకున్న వ్యవస్థను అందరూ అర్థం చేసుకోవాలి. ఫిట్‌నెస్‌ పరంగా అత్యున్నత స్థాయిలో ఉండటం అవసరం. అలా పాటిస్తోంది కాబట్టే టీమ్‌ఇండియా అన్ని ఫార్మాట్లలో ఇప్పుడింత పటిష్ఠంగా ఉంది. జట్టులో చోటు కావాలంటే ప్రమాణాలను అందుకొనేందుకు ప్రయత్నించాలి. ఇందులో రాజీ లేదు" అని విరాట్‌ స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి: భారత్​ Vs ఇంగ్లాండ్​: కోహ్లీసేన జోరు కొనసాగించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.